T20 World Cup 2022: ప్చ్ CSK! ప్రపంచకప్‌నకు ఒక్కర్నీ ఇవ్వలేదు - ఆ రెండు జట్లదే డామినేషన్
T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు టీమ్‌ఇండియాను ఎంపిక చేశారు. 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఏ ఫ్రాంచైజీ నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం లభించిందో అభిమానులు చర్చించుకుంటున్నారు.
T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు టీమ్‌ఇండియాను ఎంపిక చేశారు. 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఏ ఫ్రాంచైజీ నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం లభించిందో అభిమానులు చర్చించుకుంటున్నారు. ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఎక్కువ మంది క్రికెటర్లు ఎంపికయ్యారు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నుంచి ఒక్కరూ లేకపోవడం గమనార్హం.
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్
దిల్లీ క్యాపిటల్స్ : రిషభ్ పంత్, అక్షర్ పటేల్
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, దీపక్ హుడా
రాజస్థాన్ రాయల్స్: యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్
సన్‌రైజర్స్ హైదరాబాద్: భువనేశ్వర్ కుమార్
పంజాబ్ కింగ్స్: అర్షదీప్ సింగ్
గుజరాత్ టైటాన్స్ : హార్దిక్ పాండ్య
ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి తలో ముగ్గురు ఎంపికయ్యారు. దాదాపుగా కీలక ఆటగాళ్లు ఈ జట్ల నుంచే ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇక జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ బౌలింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. డీకే, సూర్య కుమార్ నుంచి మెరుపులు కావాలి. లక్నో నుంచి కేఎల్ రాహుల్ (KL Rahul), దీపక్ హుడా (Deepak Hooda) ఉన్నారు. రాహుల్ వైస్ కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే. మిడిలార్డర్లో ఫ్లోటర్‌లా దీపక్ హుడాను ఉపయోగించుకుంటారు. స్కోరింగ్ రేటు పెంచే బాధ్యతను అప్పగిస్తారు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అవసరమైనప్పుడు అతడిని తీసుకొనే అవకాశం ఉంది.
దిల్లీ క్యాపిటల్స్ నుంచి రిషభ్ పంత్ (Rishabh Pant), అక్షర్ పటేల్ ఉన్నారు. రాజస్థాన్ నుంచి ఇద్దరూ స్పిన్నర్లే. ఒకరు మణికట్టు మాంత్రికుడు యూజీ కాగా మరొకరు సీనియర్ స్పిన్నర్ అశ్విన్. హైదరాబాద్ నుంచి భువీ, పంజాబ్ నుంచి అర్షదీప్, గుజరాత్ నుంచి పాండ్యకు అవకాశం దక్కింది. ఒకప్పుడు ఛాంపియన్లను అందించిన చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఇప్పుడు ఎవ్వరూ లేరు. అవసరం లేని సాహస కృత్యం వల్ల జడ్డూ గాయపడ్డాడు. శస్త్రచికిత్సతో చోటు కోల్పోయాడు. దీపక్ చాహర్ స్టాండ్‌బైగా ఉన్నప్పటికీ ఎవరైనా గాయపడ్డా తీసుకోవడం అరుదు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌పై భుజ స్కందాలపై ఎక్కువ భారమే ఉంది.
టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్
స్టాండ్ బై ప్లేయర్లు
మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్
అక్టోబర్ 16వ తేదీ నుంచి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టీమిండియా తమ మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. అక్టోబర్ 23వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు నేరుగా సూపర్-12 మ్యాచ్ ఆడనుంది.
మొదట ఎనిమిది జట్లు క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. వీటిలో శ్రీలంక, వెస్టిండీస్, నమీబియా, యూఏఈ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. వీటిలో నాలుగు జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి.