Smith 10,000 Runs: స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత - టెస్టుల్లో పది వేల రన్స్ పూర్తి, ఈ క్లబ్బులో ఎంతమంది ఉన్నారో తెలుసా..?
Steve Smith: పది వేల పరుగుల మార్కును చేరుకున్న 15వ ఆటగాడిగా స్మిత్ రికార్డులకెక్కాడు. నిజానికి సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులోనే స్మిత్ ఈ ఘనత సాధించాల్సింది. ఆ మ్యాచ్ లో 4 పరుగులకే ఔటయ్యాడు.
![Smith 10,000 Runs: స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత - టెస్టుల్లో పది వేల రన్స్ పూర్తి, ఈ క్లబ్బులో ఎంతమంది ఉన్నారో తెలుసా..? Steve Smith Compleates 10000 runs in tests Smith 10,000 Runs: స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత - టెస్టుల్లో పది వేల రన్స్ పూర్తి, ఈ క్లబ్బులో ఎంతమంది ఉన్నారో తెలుసా..?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/20/b7aa96f137f35da32647bef02a27260d1737373037897901_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Aus Vs SL 1St Test Live Updates: ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్.. టెస్టు ఫార్మాట్లో అరుదైన ఘనత సాధించాడు. పది వేల పరుగుల మార్కును చేరుకున్న 15వ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. నిజానికి ఈనెల మొదటివారంలో భారత్‌తో సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులోనే స్మిత్ ఈ ఘనత సాధించాల్సింది. అయితే ఆ మ్యాచ్‌లో నాలుగు పరుగులు మాత్రమే చేసిన స్మిత్.. భారత పేసర్ ప్రసిధ్ చేతిలో ఔటయ్యాడు. ఆ తర్వాత 22 రోజుల వరకు తను ఈ ఫీట్‌ను సాధించడం కోసం ఎదురు చూశాడు. తాజాగా శ్రీలంకతో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఎదుర్కొన్న తొలి బంతినే సింగిల్ తీసి పది వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. ప్రభాత్ జయసూర్య బౌలింగ్ లో మిడ్ వికెట్ దిశగా సింగిల్ తీసి ఈ ఘనత సాధించాడు. తన కెరీర్లో 205వ ఇన్నింగ్స్‌లో ఈ మార్కును చేరుకున్నాడు. దీంతో పది వేల పరుగుల మార్కును అత్యత వేగవంతంగా చేరుకున్న ఐదో బ్యాటర్‌గా నిలిచాడు.
ఫస్ట్ ప్లేస్‌లో ఇద్దరు..
నిజానికి టెస్టుల్లో పది వేల పరుగుల క్లబ్బును ప్రారంభించింది భారత్‌కు చెందిన దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కావడం విశేషం. 1987లో 37 ఏళ్ల ప్రాయంలో ఈ రికార్డును నెలకొల్పాడు. అయితే అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న ప్లేయర్లు ఇద్దరు ఉన్నారు. 2004లో ఇంగ్లాండ్ పై మాంచెస్టర్‌లో బ్రియన్ లార్ తొలుత ఈ రికార్డును చేరుకోగా, ఆ తర్వాత ఏడాదే భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ఈడెన్ గార్డెన్ లో పాకిస్థాన్‌పై ఈ మార్కును చేరుకున్నారు. కేవలం 195 ఇన్నింగ్స్‌ల్లోనే వీరిద్దరూ ఈ ఘనతను సాధించారు. ఆ తర్వాత కుమార సంగక్కర (196), స్టీవ్ స్మిత్ (206), రాహుల్ ద్రావిడ్ (206) తర్వాత స్థానాల్లో నిలిచారు.
ఓవరాల్‌గా 15వ క్రికెటర్ స్మిత్..
ఇప్పటివరకు టెస్టుల్లో పది వేల పరుగుల మార్కును చేరుకున్న ఆటగాళ్లు 14 మంది ఉండగా, బుధవారం స్టీవ్ స్మిత్ ఆ జాబితాలో చేరాడు. దీంతో మొత్తం 15 మంది ఆటగాళ్లు అయ్యారు. ఇక టెస్టుల్లో పదివేల పరుగులు సాధించి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లను పరిశీలిస్తే, సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు), రికీ పాంటింగ్ (13,378), జాక్ కల్లిస్ (13,289), రాహుల్ ద్రావిడ్ (13,288), జో రూట్ (12,972), ఆలిస్టర్ కుక్ (12, 472), సంగక్కర (12,400), బ్రియాన్ లారా (11,867), శివ నారాయణ్ చంద్రపాల్ (11,867), మహేళ జయవర్ధనే (11,814), అలన్ బోర్డర్ (11,174), స్టీవ్ వా (10, 927), సునీల్ గావస్కర్ (10,122), యూనిస్ ఖాన్ (10,099), స్మిత్ (10,000+ పరుగులు) ఉన్నారు. ఇక పదివేల మార్కును చేరుకున్న నాలుగో ఆస్ట్రేలియన్ గా స్మిత్ రికార్డులకెక్కాడు. గతంలో అలన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్ ఈ ఘనత సాధించారు. ఇక శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో కడపటి వార్తలందేసరికి అర్థ సెంచరీని పూర్తి చేసిన స్మిత్.. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసి ఈ మ్యాచ్ ను మధురానుభూతిగా మార్చుకోవాలని భావిస్తున్నాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)