Sri Lanka ODI Record: బంగ్లాపై విజయంతో లంక సూపర్ రికార్డు - ఆ జాబితాలో మూడో స్థానం
ఆసియా కప్ - 2023లో లంక బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌తో గురువారం ముగిసిన మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఆ జట్టు మరో ఘనతను సొంతం చేసుకుంది.
Sri Lanka ODI Record: ద్వీప దేశం శ్రీలంక ఆసియా కప్ - 2203లో ఘనంగా బోణీ కొట్టింది. పల్లెకెల వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ మెరిసి విజయంతో టోర్నీని ఆరంభించింది. ఈ విజయంతో శ్రీలంక మరో అరుదైన రికార్డునూ సొంతం చేసుకుంది. వన్డేలలో లంకకు ఇది వరుసగా 11వ విజయం కావడం గమనార్హం.
ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకూ ఆడిన 11 వన్డేలలోనూ ఆ జట్టు అప్రతీహాతంగా సాగుతోంది. తాజా విజయంతో ఆ జట్టు రికార్డు విజయాలలో వెస్టిండీస్ తో కలిసి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా.. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 21 విజయాలు సాధించింది. వన్డేలలో ఆస్ట్రేలియా అత్యంత ప్రబలశక్తిగా ఉన్న 2000వ దశకంలో ఈ రికార్డును సాధించింది. 2003లో జనవరి నుంచి మే వరకూ ఆ జట్టు ఆడిన 21 వన్డేలలోనూ గెలిచింది. స్టీవ్ వా సారథ్యంలో ఆ జట్టు ఈ ఘనత సాధించింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా తర్వాత ఓటమెరుగకుండా 12 విజయాలు సాధించిన జట్టు దక్షిణాఫ్రికా. సఫారీలు 2005 ఫిబ్రవరి నుంచి ఆ ఏడాది అక్టోబర్ వరకూ ఓటమనేదే లేకుండా 12 మ్యచ్‌లనూ సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా సఫారీలతో సమానంగా నిలిచింది. పాక్.. 2007 నవంబర్ నుంచి 2008 జూన్ మధ్య 12 విజయాలు సాధించింది. ఇక మూడో స్థానంలో వెస్టిండీస్.. 11 విజయాలతో ఉంది. 1984 జూన్ నుంచి 1985 ఫిబ్రవరి వరకూ కరేబియన్ జట్టు ఓటమన్నదే లేకుండా ఆడింది. తాజాగా లంక కూడా విండీస్ సరసన నిలిచింది.
11 wins in a row!
— ESPNcricinfo (@ESPNcricinfo) August 31, 2023
This is Sri Lanka's longest winning streak in ODIs 🔥 pic.twitter.com/kqsgplkvMD
అయితే లంక విజయాలలో అధికంగా అనామక జట్ల మీద వచ్చినవే కావడం గమనార్హం. ఈ ఏడాది జూన్ లో జింబాబ్వే వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ఆడిన శ్రీలంక.. యూఏఈ, ఓమన్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే మీద గెలిచింది. రెండు మ్యాచ్‌లను అఫ్గానిస్తాన్ పై గెలిచిన లంకేయులు.. ఒక మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌పై నెగ్గారు.
Sri Lanka celebrates a victorious start to the group stage with a comfortable 5-wicket win! 🙌#AsiaCup2023 #SLvBAN pic.twitter.com/gAmg41kql6
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 31, 2023
ఇక గురువారం బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. పల్లెకెలలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయింది. నజ్ముల్ శాంటో (89) రాణించినా అతడికి తోడ్పాటు అందించేవారే కరువయ్యారు. లంక యువ పేసర్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే మతీష పతిరాన నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు తీక్షణ రెండు వికెట్లు తీయగా ధనంజయ డిసిల్వ, వెల్లలగె, కెప్టెన్ శనక తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడింది. ఓపెనర్లు నిస్సంక, కరుణరత్నెలతో పాటు వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ కూడా విఫలమయ్యారు. కానీ మిడిలార్డర్ బ్యాటర్లు సదీర సమరవిక్రమ (54), చరిత్ అసలంక (62 నాటౌట్)లు రాణించి 39 ఓవర్లలో లంకకు విజయాన్ని అందించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial