Shubman Gill Captain Innings: గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. వరుసగా రెండో సెంచరీతో సత్తా.. రాణించిన జైస్వాల్, జడేజా.. ఇంగ్లాండ్ తో రెండో టెస్టు
కెప్టెన్ గా వరుసగా రెండో సెంచరీని గిల్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో చాలా ఓపికగా ఆడి, కెప్టెన్ ఇన్నింగ్స్ తో గిల్.. జట్టును మంచి పొజిషన్ కు చేర్చాడు. జైస్వాల్ కూడా ఫిఫ్టీతో రాణించాడు.

Ind Vs Eng 2nd Test Latest Updates: భారత కెప్టెన్ శుభమాన్ గిల్ అద్భుత సెంచరీ (216 బంతుల్లో 114 బ్యాటింగ్ , 12 ఫోర్లు)తో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ పర్యటనలో వరుసగా రెండో మ్యాచ్ లోనూ శతకం బాది, తన సత్తా చాటాడు. బుధవారం బర్మింగ్ హామ్ లో ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజు భారత్ ఫర్వాలేదనిపించే రీతిలో రోజును ముగించింది. ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ కు రెండు వికెట్లు దక్కాయి. బ్యాటింగ్ కు అనుకూలించే వికెట్, ఎండ కూడా బాగా కాయడంతో ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఫ్లాట్ వికెట్ పై ఫర్వాలేదనిపించారు. ఇక ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. జస్ ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్ స్థానాల్లో ఆకాశ్ దీప్ , నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు.
Stumps on the opening day of the 2nd Test 🏟️#TeamIndia finish Day 1 with 310/5 on board 👌👌
— BCCI (@BCCI) July 2, 2025
Scorecard ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND pic.twitter.com/hzMC3Befky
జైస్వాల్ మరోసారి..
ఇక టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (2) వికెట్ ను త్వరగానే కోల్పోయింది. ఈ దశలో కరుణ్ నాయర్ (31), యశస్వి జైస్వాల్ (107 బంతుల్లో 87, 13 ఫోర్లు) అద్భుతంగా ఆడారు. తనకెంతో ఇష్టమైన మూడో నెంబర్లో కరుణ్ ఆకట్టుకున్నాడు. తన అనుభవన్నంతా రంగరించి, ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. మరో ఎండ్ లో ఆరంభంలో ఆచి తూచి ఆడిన జైస్వాల్.. ఆ తర్వాత బౌండరీలతో రెచ్చిపోయాడు. ఈ సిరీస్ లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకుని, సెంచరీ దిశగా సాగాడు. అయితే లంచ్ విరామానికి కాసేపు కరుణ్ ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్ కి వచ్చిన గిల్.. తన క్లాస్ మరోసారి చూపించాడు.
వరుస సెంచరీ..
లంచ్ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతోపాటు, వినూత్న ఫీల్డింగ్ సెట్టింగ్ తో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆకట్టుకున్నాడు. దీంతో పరుగుల రాక మందగించింది. ఈ దశలో గిల్, జైస్వాల్ ఆచితూచి ఆడి, ఆ తర్వాత వేగం పెంచారు. అయితే శతకానికి చేరువైన జైస్వాల్ ను స్టోక్స్ మరోసారి బుట్టలో వేసుకున్నాడు. పదేపదే ఔట్ సైడ్ ఆవతల బంతులు వేసి, జైస్వాల్ ని ఔట్ చేశాడు. ఆ తర్వాత రిషభ్ పంత్ (25) బ్యాటింగ్ కు వచ్చి, మరోసారి దూకుడుగా ఆడాడు. ఇన్నింగ్స్ లో నమోదైన ఏకైక సిక్సర్ ను బషీర్ బౌలింగ్ లో తనే కొట్టాడు. కాసేపటికి మరో భారీ షాట్ కి ప్రయత్నించి, ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (1) విఫలమయ్యాడు. ఈ దశలో సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (41 బ్యాటింగ్)తో కలిసి మరో వికెట్ పడకుండా తొలి రోజును గిల్ ముగించాడు. ఈ క్రమంలో ఆరో వికెట్ కు అబేధ్యంగా 99 పరుగులను వీరిద్దరూ జోడించారు. అంతకుముందు చాలా ఓపికగా బ్యాటింగ్ చేసి, టెస్టుల్లో ఏడో సెంచరీని గిల్ పూర్తి చేసుకున్నాడు. అలాగే ఇంగ్లాండ్ గడ్డపై రెండో టెస్టు సెంచరీ చేసిన కెప్టెన్ గా మహ్మద్ అజారుద్దీన్, విరాట్ కోహ్లీ సరసన గిల్ నిలిచాడు.




















