BCCI Awards: రవిశాస్త్రికి లైఫ్ టైం అచీవ్‌మెంట్, గిల్‌కు క్రికెట్ ఆఫ్ ది ఇయర్
BCCI Awards: టీమిండియా మాజీ కెప్టెన్ రవిశాస్త్రికి బీసీసీఐ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు, టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు 2023 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించింది.
![BCCI Awards: రవిశాస్త్రికి లైఫ్ టైం అచీవ్‌మెంట్, గిల్‌కు క్రికెట్ ఆఫ్ ది ఇయర్ Shubman Gill Ravi Shastri to be honoured at BCCI Awards BCCI Awards: రవిశాస్త్రికి లైఫ్ టైం అచీవ్‌మెంట్, గిల్‌కు క్రికెట్ ఆఫ్ ది ఇయర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/23/d8c9cbf96bcd0d51758f8b66138e78121705984236372872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ రవిశాస్త్రి(Ravi Shastri)కి అరుదైన గౌరవం దక్కింది. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా కూడా పనిచేసిన రవిశాస్త్రికి.... బీసీసీఐ(BCCI) లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించింది. ఇవాళ హైదరాబాద్(Hyderabad)లోనే వేడుకను నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లను పూర్తిచేసింది. కరోనా కారణంగా మూడేళ్లు అవార్డులు ప్రకటించని బీసీసీఐ... తాజాగా ఈ అవార్డులను ప్రకటించింది. భారత క్రికెట్ జట్టుకు చేసిన సేవలకు గాను రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించి బీసీసీఐ గౌరవించింది. గతేడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసి న టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill)కు 2023 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించింది. ఈ ఇద్దరితో పాటు మరికొంతమంది యువ క్రికెటర్లు కూడా అవార్డులను దక్కించుకున్నారు. అవార్డుల ప్రధానోత్సవానికి భారత్, ఇంగ్లండ్ జట్లు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
2023లో రికార్డులే రికార్డులు
గత ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్.. అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్, కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. గిల్ కేవలం 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌తో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా గిల్ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టాడు. భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 1998లో క్రికెట్ గాడ్ సచిన్ 1894 పరుగులు చేశాడు. సౌరవ్ గంగూలీ రెండో స్థానంలో ఉన్నాడు. గంగూలీ 1999లో 1767 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో ఉండగా ది వాల్ 1761 పరుగులు చేశాడు. సచిన్ మళ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 1996లో మరోసారి మాస్టర్ బ్లాస్టర్ 1611 పరుగులు చేశాడు. శుభ్‌మన్ ఈ ఏడాది వన్డేల్లో 1500 పరుగులు చేశాడు. ఈ విషయంలో రోహిత్, కోహ్లిలను గిల్ వెనక్కినెట్టాడు. 2019లో రోహిత్ 1490 పరుగులు చేయగా.. 2017లో కోహ్లీ 1460 పరుగులు చేశాడు. వీరిద్దరిని అధిగమించి గిల్ 1500 పరుగులు చేసి సత్తా చాటాడు.
రవిశాస్త్రి కెరీర్
టీమిండియా తరఫున రవిశాస్త్రి 80 టెస్టులు ఆడి 3,830 పరుగులు చేశాడు. , 150 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన రవిశాస్త్రి 3,108 రన్స్ చేశాడు. టెస్టుల్లో 151 వికెట్లు తీసిన ఈ దిగ్గజ ఆల్‌రౌండర్.. వన్డేల్లో 129 వికెట్లు పడగొట్టాడు. 2014 లో భారత క్రికెట్ జట్టుకు టీమ్ డైరెక్టర్‌గా ఉన్న శాస్త్రి.. 2016 తర్వాత పూర్తిస్థాయి కోచ్ బాధ్యతలు స్వీకరించాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో రవిశాస్త్రి కోచింగ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలపై టీమిండియా గెలిచింది. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడే భారత్.. ఆస్ట్రేలియాలో వరుసగా రెండుసార్లు టెస్టు సిరీస్‌లను సాధించింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో ఫైనల్ చేరింది. 2021లో దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ తర్వాత శాస్త్రి కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)