Shubman Gill To Lead India In Zimbabwe Tour: ఓ పక్క టీమిండియా టీ 20 ప్రపంచకప్(T20 World Cup)లో వరుస విజయాలతో దూసుకుపోతుంటే మరోవైపు జింబాబ్వే పర్యటనకు( Zimbabwe Tour) జట్టును ప్రకటించే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్‌గిల్(Shubman Gill)ను జింబాబ్వే(Zimbabwe) పర్యటనలో టీమిండియా సారధిగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొట్టి వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత జట్టు జింబాబ్వే పర్యటనకు బయలుదేరనుండగా.... ఈ టూర్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. టీమిండియా... జింబాబ్వేతో అయిదు టీ 20 మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ పర్యటనకు పూర్తిగా యంగ్ ప్లేయర్లకే అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
అభిషేక్ శర్మ వచ్చేసినట్లే
ఇటీవల ఐపీఎల్‌లో రాణంచిన సన్‌రైజర్స్ హైదరాబా్ ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మకు జింబాబ్వే టూర్‌కు వెళ్లనున్న టీమిండియా జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. భారత తదుపరి ఓపెనింగ్ స్టార్‌గా పరిగణిస్తున్న అభిషేక్ శర్మను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సులభంగా బౌండరీలు కొట్టడం, 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేయడం అభిషేక్ శర్మకు కలిసిరానుంది. ఐపీఎల్ సీజన్‌లో అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకడిగా నిలిచిన అభిషేక్ శర్మ జింబాబ్వే సిరీస్‌కు కాల్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
పేస్ తుపానుకు చోటు!
మయాంక్‌యాదవ్ కూడా జింబాబ్వే టూర్‌లో జట్టులో స్థానం దక్కించుకోవచ్చని తెలుస్తోంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ 140 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తూ ఐపీఎల్‌లో సంచలనం సృష్టించాడు. మయాంక్ ఈ టూర్‌లో రాణిస్తే భవిష్యత్ స్టార్ పేసర్‌గా ఎదుగుతాడన్న అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా గుర్తింపు పొందిన మయాంక్... జింబాబ్వే టూర్‌కు వెళ్లే జట్టులో స్థానం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నాడు.
వారిద్దరికి కూడా..
ధృవ్ జురెల్, రియాన్ పరాగ్‌లకు కూడా జింబాబ్వే జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలో దిగిన వీరిద్దరూ ఈ ఐపీఎల్ సీజన్‌లో హై పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పటికే ధృవ్ జురెల్, రియాన్ పరాగ్ తలేగావ్‌లోని రాజస్థాన్ రాయల్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నారు. తుషార్ దేశ్‌పాండేకు కూడా కాల్ రావచ్చు. ఇతర పేసర్లు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌కు కూడా జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేశారని... వారికి సమాచారం అందించామని క్రికెట్ నెక్స్ట్ కరస్పాండెంట్ సాహిల్ మల్హోత్రా తెలిపారు. 5 మ్యాచ్‌ల T20I సిరీస్‌కు వీలైనంత ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు స్థానం కల్పించాలని BCCI భావిస్తోంది. 20 మంది సభ్యుల తాత్కాలిక జట్టును ప్రకటించే అవకాశం ఉంది.