WI vs SCO: ప్రపంచ కప్ చరిత్రలో సంచలనం - మొదటిసారి ఏకంగా టోర్నీకే విండీస్ దూరం!
ప్రపంచకప్ 2023 ప్రధాన టోర్నమెంట్‌కు వెస్టిండీస్ అర్హత సాధించలేకపోయింది. స్కాట్లాండ్ చేతిలో ఓటమితో క్వాలిఫయర్స్‌లోనే నిష్క్రమించింది.
WI vs SCO, Match Report: వన్డే క్రికెట్ చరిత్రలో సంచలనం. స్కాట్లాండ్ చేతిలో ఓడిన వెస్టిండీస్ జట్టు వన్డే వరల్డ్ కప్ 2023కి అర్హత సాధించలేకపోయింది. ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఒక జట్టు, మరో ప్రపంచకప్ ప్రధాన టోర్నీకే ఎంపిక కాకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి.
వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్ వెస్టిండీస్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో కరీబియన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. స్కాట్లాండ్‌పై ఓటమి తర్వాత, వెస్టిండీస్ జట్టు వన్డే ప్రపంచ కప్ 2023కి అర్హతను కోల్పోయింది. ఇప్పుడు వెస్టిండీస్ జట్టు వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడబోదు. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు 43.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం స్కాట్లాండ్ బ్యాటింగ్‌కు దిగి 43.3 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. స్కాట్లాండ్ తరపున మాథ్యూ క్రాస్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ ఆటగాడు 107 బంతుల్లో అజేయంగా 74 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు కొట్టాడు. బ్రాండన్ మెక్‌ముల్లన్ 106 బంతుల్లో 69 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. వెస్టిండీస్‌లో జేసన్ హోల్డర్‌తో పాటు, రొమారియో షెపర్డ్, అకిల్ హౌసెన్ చెరో వికెట్లు సాధించారు.
మ్యాచ్ పరిస్థితి ఇలా...
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తరఫున జేసన్ హోల్డర్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ మాజీ కెప్టెన్ 79 బంతుల్లో 45 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. అయితే హోల్డర్ మినహా మిగిలిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లు నిరాశపరిచారు.
ఐదుగురు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. స్కాట్లాండ్ తరఫున బ్రాండన్ మెక్‌ముల్లన్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా క్రిస్ సోల్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్ రెండేసి వికెట్లు తీశారు. సఫ్యాన్ షరీఫ్‌కు ఒక వికెట్ దక్కింది. ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌ను భారత గడ్డపై నిర్వహిస్తున్నారు. టోర్నీ అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం అయి నవంబర్ 19వ తేదీన జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది.
మరోవైపు టీమ్‌ఇండియాతో రెండు టెస్టుల సిరీస్‌కు క్రికెట్ వెస్టిండీస్ ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును కూడా ప్రకటించింది. ఎప్పట్లాగే క్రెయిగ్ బ్రాత్‌వైట్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌కు కరీబియన్ స్టార్ ప్లేయర్స్ అందుబాటులో ఉండటం సందేహంగా మారింది.
ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ జట్టు జింబాబ్వేలో ఉంది. హరారేలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ అర్హత టోర్నీని ఆడుతోంది. దాంతో జులై 9వ తేదీ వరకు అక్కడే ఉండాల్సి వస్తోంది. జులై 7వ తేదీన చివరి సూపర్ 6 మ్యాచ్ ఆడుతుంది. టోర్నీ నుంచి నిష్క్రమించింది కాబట్టి వెంటనే కరీబియన్ దీవులకు చేరుకునే అవకాశం ఉంది.
భారత్ పర్యటనకు వెస్టిండీస్ సన్నాహక జట్టు
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, ఎన్‌క్రుమా బోనర్, టగెనరైన్ చందర్‌పాల్, రఖీమ్ కార్న్‌వాల్, జోషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవమ్ హడ్జ్, అకీమ్ జోర్డాన్, జెయిర్ మెక్‌అలిస్టర్, కిర్క్ మెకెన్జీ, మార్కినో మిండ్లే, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్