Sanju Samson: 'నేను అదృష్టవంతుడినే' - సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Sanju Samson: ప్రతి ఏటా ఐపీఎల్‌లో సంజు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జాతీయ జట్టులోకి వస్తాడు. ఆ తర్వాత ఒకటి, రెండు మ్యాచుల్లో విఫలమవుతాడు. వెంటనే సెలక్టర్లు అతడిపై వేటు వేస్తారు.
Sanju Samson: టీమిండియాలో దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుచ్చే పేరు సంజు శాంసన్. అవకాశాలు వేగంగా రావడం.. వచ్చినంత వేగంగా పోవడం శాంసన్ కెరీర్‌లో ఇప్పటికే చాలాసార్లు జరిగింది. ప్రతి ఏటా ఐపీఎల్‌లో సంజు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జాతీయ జట్టులోకి వస్తాడు. ఆ తర్వాత ఒకటి, రెండు మ్యాచుల్లో విఫలమవుతాడు. వెంటనే సెలక్టర్లు అతడిపై వేటు వేస్తారు. చాలాసార్లు ఇదే రిపీట్ అయింది. సంజు శాంసన్‌కు మద్దతుగా అభిమానులు సెలక్షన్ కమిటీపై చాలాసార్లు విమర్శలు కూడా చేశారు. సంజుకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు.
సంజూ శాంసన్‌ను గత కొన్ని నెలలగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్ జట్టులో కూడా శాంసన్‌కు చోటు దక్కలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు కూడా శాంసన్‌ను భారత సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం సంజూను ఎంపిక చేయకపోవటాన్ని తప్పుబట్టాడు. ఇలా శాంసన్ కెరీర్‌లో ఈ దురదృష్టవంతుడు అనే మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. తొలిసారిగా ఈ అన్ లక్కీ ప్లేయర్ అనే వ్యాఖ్యలపై సంజు శాంసన్ స్పందించాడు. ప్రస్తుతం క్రికెటర్‌గా తాను ఉన్న స్థాయిపట్ల సంజూ శాంసన్ సంతృప్తి వ్యక్తం చేశాడు.
ప్రజలు, అభిమానులు తనను అన్ లక్కీ క్రికెటర్ అంటుంటారని... కానీ అలాంటిదేమీ లేదని సంజూ శాంసన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తాను ఎక్కడైతే ఉన్నానో.. అది తాను అనుకున్న స్థాయి కంటే చాలా ఎక్కువంటూ ప్రకటించాడు. అందరూ తనను దురదృష్టవంతుడైన క్రికెటర్ అని అంటారని, కానీ తాను అదృష్టవంతుడినేనని తెలిపాడు. అనుకున్న దానికంటే తాను ఎక్కువే సాధించానని కూడా సంజు శాంసన్ వెల్లడించాడు.
ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ 'ఐ యామ్ విత్ ధన్య వర్మ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్శను ఉద్దేశించి శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ఎల్లప్పుడూ తనకు సపోర్ట్‌గా ఉంటాడని శాంసన్ చెప్పుకొచ్చాడు. తనకు రోహిత్ భాయ్ నుంచి ఎప్పుడూ మద్దతు ఉంటుందని... హిట్ మ్యాన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని సంజు తెలిపాడు. తన దగ్గరకు వచ్చి అప్యాయంగా మాట్లాడే వ్యక్తుల్లో రోహిత్ మొదటి స్ధానంలో ఉంటాడని తెలిపాడు. తన బ్యాటింగ్ స్టైల్ బాగుంటుందని రోహిత్ ఓ సారి అన్నాడని... కానీ ముంబై ఇండియన్స్‌పై ఎక్కువ సిక్సర్లు కొట్టావని నవ్వుతూ అన్నాడని సంజూ శాంసన్ గుర్తు చేసుకున్నాడు.
2021లో వన్డేలలో అరంగేట్రం చేసిన సంజూ శాంసన్ ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడి 390 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ చివరిసారిగా ఈ ఏడాది ఆగస్టులో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ఆడాడు. ఆసియాకప్ 2023 కోసం రిజర్వ్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికవ్వలేదు. 2013 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ద్వారా ఐపీఎల్‍లోకి ఎంట్రీ ఇచ్చిన సంజు శాంసన్.. ఆ ఏడాదే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. 2021 సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో కేరళ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. శాంసన్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ 2023లో కేరళ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply