Rohit Sharma: ఆ ఓటమిని జీర్ణించుకోలేం కానీ... తొలిసారి పెదవి విప్పిన రోహిత్
Rohit Sharma on WC Final: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సారధి రోహిత్ శర్మ తొలిసారి స్పందించాడు. ఫైనల్ మ్యాచ్‌లో పరాజయం తర్వాత తాను ఎదుర్కొన్న సంఘర్షణనను బయటపెట్టాడు.
కోట్ల మంది భారత అభిమానుల హృదయాలు ముక్కలు చేస్తూ... కోటీ మంది ఆశలు గల్లంతు చేస్తూ ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. ఆశలను.. ఆనందాలను.. అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్ సేనను ఫైనల్లో మట్టికరిపించి ఆరోసారి కంగారులు ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నారు. అయితే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి చవిచూశాక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఓటమితో అభిమానుల గుండెలను రోహిత్ సేన కోత పెట్టింది. పుష్కర కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత జట్టు కల కలగానే మిగిలిపోయింది. ఆ టైంలో భారత క్రికెటర్ల మొహాలు చూస్తే వాళ్లు ఎంత బాధ పడ్డారో స్పష్టంగా కనిపించింది. ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సారధి రోహిత్ శర్మ తొలిసారి స్పందించాడు. ఫైనల్ మ్యాచ్‌లో పరాజయం తర్వాత తాను ఎదుర్కొన్న సంఘర్షణనను బయటపెట్టాడు. ఫైనల్ జరిగిన సుమారు 20 రోజుల తర్వాత రోహిత్ శర్మ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
ప్రపంచకప్ ఫైనల్ తర్వాత చాలా రోజుల వరకు దీని నుంచి ఎలా బయటపడాలో తనకు తెలియలేదని రోహిత్ శర్మ తెలిపాడు. కానీ కుటుంబం, స్నేహితులు తనను ముందుకు నడిపించారని అన్నాడు. ప్రపంచకప్ ఫైనల్ ఓటమిని జీర్ణించుకోవడం తేలిక కాదని.. దాన్నని మర్చిపోయి ముందుకు సాగడం కూడా సాధ్యం కాదని రోహిత్ శర్మ అన్నాడు. అన్నింటినీ మర్చిపోయి ముందుకు సాగడమే జీవితమన్న హిట్‌మ్యాన్.. అది చాలా కష్టమైన పని అని నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి ప్రపంచకప్ మ్యాచ్‌లు చూస్తూనే తాను పెరిగానని. ఫైనల్ మ్యాచ్ గెలవడమే అన్నింటికంటే గొప్ప బహుమతని తనకు బాగా తెలుసుని అన్నాడు. ఆ ఓటమి నుంచి కోలుకుని ముందుకెళ్లడం చాలా కష్టమైందని.. ఫైనల్ మ్యాచ్ తర్వాత తాను ఎదుర్కొన్న సంఘర్షణను హిట్ మ్యాన్ వివరించాడు. ఇదే సమయంలో ప్రపంచకప్ టోర్నీ మొత్తం భారతజట్టుకు మద్దతుగా నిలిచిన అభిమానులకు రోహిత్ శర్మ కృతజ్ఞతలు తెలియజేశాడు.
వన్డే ప్రపంచకప్ జరిగిన నెలన్నర రోజులపాటు అభిమానులు తమతో నడిచారని... వారు జట్టును బాగా ప్రోత్సహించారని కూడా రోహిత్ గుర్తు చేసుకున్నాడు. అన్నిరోజులు దేనికోసమైతే విరామం లేకుండా కష్టపడ్డాతమో అది దొరకనప్పుడు, దేనికోసమైతే కలలు కన్నామో అది నెరవేరనప్పుడు నిరాశ కలుగుతుందని రోహిత్ నిర్వేదం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ గెలిచేందుకు టీమ్ మొత్తం శాయశక్తులా కృషి చేసిందన్న రోహిత్ శర్మ... జట్టులోని ప్లేయర్ల ప్రదర్శన పట్ల తాను గర్వపడుతున్నానని చెప్పాడు.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఏం తప్పు జరిగిందని ఎవరైనా అడిగితే..తమ వైపు నుంచి చేయాల్సిందంతా చేశామని స్పష్టంగా చెప్పగలని రోహిత్ అన్నాడు. ప్రపంచకప్ ఫైనల్ వరకూ మేము ఆడిన ఆట.. ప్రజలకు సంతోషాన్ని, గర్వాన్ని ఇస్తుందని అనుకుంటున్ననని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ ట్రోఫీని సగర్వంగా పైకి ఎత్తాలని తమతోపాటు వారు కూడా బలంగా కోరుకున్నారు. మ్యాచ్ కోసం ఎక్కడికి వెళ్లినా తమకు మద్దతుగా నిలిచారని వారందరికీ రోహిత్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులను తాము నిరాశపరిచామని.. కానీ అభిమానులు మమ్మల్ని చూసి గర్వపడుతున్నామని చెప్పడం తనకు అమిత సంతోషాన్ని ఇచ్చిందని రోహిత్ అన్నాడు.