Australia Vs West Indies: ఆరు ఓవర్లలోనే ముగిసిన వన్డే మ్యాచ్, ఆసీస్ కొత్త రికార్డు
Australia Vs West Indies: వన్డే క్రికెట్‌లో 1000వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు రికార్డు సృష్టించింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 259 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
మ్యాచ్ సాగిందిలా...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్... ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి కకావికలం అయింది. ఆస్ట్రేలియా బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్ నాలుగు వికెట్లతో కరేబియన్ల పతనాన్ని శాసించాడు. వెస్టిండీస్ బ్యాటర్లలో అలిక్ అథనాజ్ (32), కేసీ కార్తీ (10), రోస్టన్ ఛేజ్ (12) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించగా మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. దీంతో విండీస్ 24.1 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ ఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (41), జోష్ ఇంగ్లిస్ (35) ధాటిగా ఆడడంతో కేవలం 6.5 ఓవర్లలోనే ఆసిస్ విజయతీరాలను చేరింది. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, ఒషానే థామస్ లు చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన వన్డేల్లో ఈ మ్యాచే అతి తక్కువ బంతుల్లో ఫలితం వచ్చిన మ్యాచ్‌గా రికార్డులకు ఎక్కింది.
ఆశలన్నీ షమార్‌పైనే
షమార్ జోసెఫ్(Shamar Joseph)... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు. ఈ విండీస్ సీమర్ నిప్పులు చెరిగే బంతులకు బౌలింగ్ దిగ్గజాలు సైతం సలాం చేస్తున్నారు. కంగారులను వారి గడ్డపైనే గడగడలాడించి.. విండీస్‌కు 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత చారిత్రక విజయాన్ని అందించాడు. గబ్బాలో అద్భుత ప్రదర్శనతో కొత్త చరిత్రకు నాంది పలికాడు. రెండో టెస్ట్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసి, 8 పరుగుల తేడాతో ఆసీస్ ను మట్టికరిపించాడు. ఈ చారిత్రాత్మక గెలుపుతో కరేబియన్ ఆటగాళ్ల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విజయాన్ని కళ్లారా చూసిన వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా ఏకంగా గ్రౌండ్ లోనే భావోద్వేగానికి గురై.. కన్నీరు పెట్టుకున్నాడు. తాను ఆడుతున్న రెండో టెస్ట్ లోనే ఆసీస్ లాంటి మేటి జట్టును బెంబేలెత్తించి... నయా సంచలనంగా మారాడు. ఈ కరేబియన్ స్పీడ్ స్టర్ పై వరల్డ్ వైడ్ గా ప్రశంసల వర్షం కురుస్తోంది. 24 ఏళ్ల ఈ కుర్రాడి పోరాట పటిమకు క్రికెట్ ప్రపంచం ఫిదా అయిపోయింది. స్టార్క్ యార్కర్ బలంగా తాకి షమార్ కాలి బొటన వేలికి గాయమైంది. దీంతో మైదానాన్ని వీడిన అతను.. తర్వాతి రోజు జట్టు కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకుని మైదానంలోకి వచ్చి తన జట్టుకు చరిత్రలో మర్చిపోలేని గెలుపును అందించాడు. టెస్టు క్రికెట్‌ను కాపాడే రక్షకుల్లో ఒకడిగా షమార్‌ను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా అభివర్ణించాడు.