David Warne: జాన్సన్ ఇప్పుడేం అంటావ్ , మిచెల్‌ను ఆడుకుంటున్న వార్నర్ ఫ్యాన్స్
David Warner Fans Trolled Mitchell: తొలి టెస్ట్ తొలి రోజే వార్నర్ విధ్వంసం సృష్టించడంతో వార్నర్ పై పెదవి విరిచిన ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఫేర్ వెల్ టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగిపోయాడు. పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ తొలి రోజే భారీ సెంచరీ బాదేశాడు. వార్నర్ విధ్వంసంతో తొలి టెస్ట్‌లో తొలిరోజు పాక్‌పై కంగారులు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వార్నర్... వన్డే తరహా ఆటతీరుతో చెలరేగిపోయాడు. 211 బంతుల్లో 16 ఫోర్లు, నాలుగు సిక్సులతో 164 పరుగులు చేసి తాను ఎంతటి విలువైన ఆటగాడినో క్రికెట్ ప్రపంచానికి మరోసారి చాటిచెప్పాడు. వార్నర్ భారీ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కంగారులు అయిదు వికెట్లకు 346 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచారు. తొలి టెస్ట్ తొలి రోజే వార్నర్ విధ్వంసం సృష్టించడంతో... వార్నర్ ఎంపికపై.. ఫేర్‌వెల్ సిరీస్‌పై పెదవి విరిచిన ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్‌ను... నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
సెంచరీ చేసిన తరువాత వార్నర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా వార్నర్ ప్లైయింగ్ కిస్ ఇచ్చాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ జాన్సన్ ఇది నీకోసమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వార్నర్ తన ఆటతీరుతోనే మిచెల్ జాన్సన్‌కు సమాధానం చెప్పాడని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. జాన్సన్‌ను నోటితో ప్రశ్న సంధిస్తే... వార్నర్ బ్యాటుతో సమాధానం చెప్పాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఫేర్‌వెల్ సిరీస్‌లో అద్భుతంగా ఆడుతున్న వార్నర్.. తనకు ఇంకా ఆడే నైపుణ్యం ఉన్నా రిటైర్‌మెంట్ ఇస్తున్నాడని... మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై ఇటీవల ఆస్ట్రేలియా (Australia Cricketer) మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వార్నర్ ఏమైనా హీరోనా అంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఘనంగా వీడ్కోలు పలకడానికి వార్నర్ అర్హుడు కాదని జాన్సన్ అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు డేవిడ్ వార్నర్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో వార్నర్‌పై మిచెల్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీలో చివరి టెస్టు ఆడాలని ఉందని వార్నర్ బహిరంగంగా చెప్పడంపై కూడా మిచెల్ జాన్సన్ విమర్శలు గుప్పించాడు. 2018లో దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ చేస్తూ దొరికిపోయిన వార్నర్‌కు ఎందుకు ఘనంగా వీడ్కోలు పలకాలని ఆసిస్ మాజీ పేసర్ ప్రశ్నించాడు. దీనిపై తాజాగా డేవిడ్ వార్నర్ స్పందించాడు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉందంటూ వార్నర్ వ్యాఖ్యానించాడు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ముందుకు సాగడమే తనకు తెలుసని వార్నర్ స్పష్టం చేశాడు.
తన టెస్ట్ కెరీర్‌కు తప్పకుండా అద్భుతమైన ముగింపు లభిస్తుందని భావిస్తున్నానని ఆకాంక్షించాడు. తన తల్లిదండ్రుల గొప్ప పెంపకంలో తాను పెరిగానని... ప్రతి రోజూ కష్టపడుతూనే ఉన్నానని గుర్తు చేసుకుంటూ వార్నర్ భావోద్వేగానికి గురయ్యాడు, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాక.. చాలా విమర్శలు ఎదుర్కోక తప్పదన్న వార్నర్... అందులోనూ కొన్ని సానుకూల అంశాలు ఉంటాయన్నాడు. మరోవైపు డేవిడ్ వార్నర్‌కు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మద్దతుగా నిలిచాడు. తాము ఒకరికొకరం అండగా ఉండాల్సిన అవసరం ఉందని కమిన్స్ తెలిపాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌కు సుదీర్ఘమైన కెరీర్ ఉందని.... మిచెల్ జాన్సన్ వ్యాఖ్యల వెనుక రహస్యమేంటో తనకు తేలీదని ఆసిస్ కెప్టెన్ తెలిపాడు. ఇప్పుడు ఆసీస్ క్రికెట్‌కు సంబంధించి అద్భుతమైన క్షణాలను ఆస్వాదించాల్సిన సమయమని అన్నాడు.