Quinton de Kock ODI Retirement: డికాక్ షాక్! వన్డేలకు రిటైర్మెంట్ - సఫారీ ప్రపంచకప్ జట్టిదే
Quinton de Kock ODI Retirement: సఫారీ సూపర్‌స్టార్ క్వింటన్ డికాక్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నాడు.
Quinton de Kock ODI Retirement:
సఫారీ సూపర్‌స్టార్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నాడు. అయితే 2024 టీ20 ప్రపంచకప్ వరకు పొట్టి క్రికెట్‌కు అందుబాటులో ఉంటాడని తెలిసింది.
క్వింటన్ డికాక్ టెస్టు ఫార్మాట్‌కు రిటైర్‌మెంటు ప్రకటించి రెండేళ్లైనా అవ్వలేదు. అంతలోనే వన్డేలకు దూరమవుతున్నాడు. ఇందుకు ప్రత్యేక కారణాలేమీ లేవు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఫ్రాంచైజీ టీ20 క్రికెట్ లీగులు ఆడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది.
బిగ్‌బాష్ లీగులో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ డికాక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సీజన్ డిసెంబర్ 10 నుంచి 5 వరకు జరుగుతుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా.. భారత్‌లో పర్యటించనుంది. డిసెంబర్ 10 నుంచి 21 మధ్య టీమ్‌ఇండియాతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అంటే వీటికి అతడు అందుబాటులో ఉండనట్టే!
సోమవారం సీఎస్‌ఏ, డికాక్ మధ్య చర్చలు జరిగాయని సమాచారం. రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరింది. సెంట్రల్ కాంట్రాక్టుల్లో అతడి పేరు ఉండటంతో టీ20లకు అందుబాటులో ఉంటాడని తెలిసింది. బీబీఎల్‌కు అందుబాటులో ఉండటంతో పాటు దక్షిణాఫ్రికా తరఫున టీ20లు ఆడేందుకు అంగీకరించారు. కాగా సెప్టెంబర్ 7 నుంచి జరిగే దక్షిణాఫ్రికా వన్డేలను అతడు ఆడనున్నాడు. ఇప్పటి వరకు 140 వన్డేలు ఆడిన డికాక్ 44.85 సగటుతో 5966 పరుగులు చేశాడు. 17 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు చేశాడు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును ప్రకటించింది. తెంబా బవుమాను కెప్టెన్‌గా ప్రకటించింది.
దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బవుమా, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, రెజా హెండ్రిక్స్, మార్కో జన్‌సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగల, కేశవ్ మహరాజ్, అయిడెన్ మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోకియా, కాగిసో రబాడ, తబ్రైజ్ శంషీ, రసి వాన్ డర్ డుసెన్