WTC Points Table: టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్లలో పాకిస్తాన్ టాప్ - టీమిండియా ఎక్కడుందంటే?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ 2023-25 పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది.
WTC 2023-25 Points Table Update: శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను పాకిస్తాన్ క్లీన్ స్వీప్ చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కొత్త ఎడిషన్‌లో గ్రాండ్‌గా అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ జట్టు 100 శాతం మార్కులతో మొదటి స్థానంలో ఉంది. మరోవైపు వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగియడంతో టీమిండియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అదే సమయంలో తొలి టెస్టులో పాక్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు రెండు మ్యాచ్‌ల తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ 24 పాయింట్లతో ఉంది. వారి పాయింట్ల శాతం కూడా 100 శాతంగా ఉంది. రెండు మ్యాచ్‌ల తర్వాత భారత జట్టు 16 పాయింట్లతో సాధించింది. వారి పాయింట్ల శాతం 66.67గా ఉంది.
తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన కంగారూ జట్టు మొత్తం 26 పాయింట్లు సాధించింది. వారి పాయింట్ల శాతం 54.17గా ఉంది.
ఇక ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టు కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు ఓటములు, ఒక విజయం, ఒక డ్రాతో 14 పాయింట్లు సాధించింది. వారి పాయింట్ల శాతం 29.17 మాత్రమే.
ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడగా, ఒక మ్యాచ్ డ్రా అయింది. ఒక ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం విండీస్ జట్టు పాయింట్ల శాతం 16.67గా ఉంది.
మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ జట్టు యువ సంచలనం సౌద్ షకీల్ టెస్టు క్రికెట్‌లో అద్భుతాలు చేస్తున్నాడు. ఈ మిడిలార్డర్ బ్యాటర్ తాజాగా 146 ఏండ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను అందుకున్నాడు. శ్రీలంక పర్యటనలో ఉన్న షకీల్.. రెండో టెస్టులో అర్థ సెంచరీ చేయడం ద్వారా.. ఆడిన తొలి ఏడు టెస్టులలోనూ హాఫ్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
2022లో ఇంగ్లాండ్ జట్టుపై అరంగేట్రం చేసిన షకీల్.. ఇప్పటివరకూ ఆడిన ఏడు టెస్టులలోనూ అర్థ సెంచరీలు చేయడం గమనార్హం. అతడి స్కోరు వివరాలను చూస్తే.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో 37, 76.. రెండో టెస్టులో 63, 94, మూడో టెస్టులో 23, 53 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 22,55, రెండో టెస్టులో 125, 32 పరుగులు సాధించాడు. ఇక శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులో డబుల్ సెంచరీ (208), 30 పరుగులు చేసిన షకీల్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఇలా ఆడిన ఏడు టెస్టులలోనూ అర్థ సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
🇮🇳 𝐓𝐞𝐚𝐦 𝐈𝐧𝐝𝐢𝐚 𝐚𝐭 𝐍𝐨.𝟐 𝐩𝐨𝐬𝐢𝐭𝐢𝐨𝐧! After a comfortable series win against WI, this is where we stand in the points table of WTC 2023–25.#WTC25 #WIvIND #INDvWI #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/S8Nfxjhenc
— The Bharat Army (@thebharatarmy) July 25, 2023