ODI World Cup: సఫారీ + శ్రీలంక = 754, ప్రపంచకప్‌లో ఆ తర్వాత టాప్ స్కోర్లు ఇవే!
ODI World Cup: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో రికార్డుల పర్వం మొదలైంది. దక్షిణాఫ్రికా, శ్రీలంక కలిపి ఏకంగా 754 పరుగులు చేశాయి. ఈ నేపథ్యంలో రెండు జట్లూ కలిసి చేసిన టాప్-5 స్కోర్లేంటో చూసేద్దామా!
ODI World Cup:
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో రికార్డుల పర్వం మొదలైంది. ఆరంభం నుంచే అదరగొట్టేందుకు అన్ని జట్లూ ప్రయత్నిస్తున్నాయి. సరికొత్త వ్యూహాలు రచించుకుంటున్నాయి. టీ20ల పుణ్యమో ఏమో వన్డేల్లోనూ పరుగుల వరద పారుతోంది. శనివారం దక్షిణాఫ్రికా, శ్రీలంక కలిపి ఏకంగా 754 పరుగులు చేశాయి. మెగాటోర్నీ చరిత్రలో ఇవే అత్యధిక పరుగులు కావడం విశేషం. ఈ నేపథ్యంలో రెండు జట్లూ కలిసి చేసిన టాప్-5 స్కోర్లేంటో చూసేద్దామా!
దక్షిణాఫ్రికా vs శ్రీలంక - 754 పరుగులు
ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లోనే ఈరికార్డు నమోదైంది. 2023, అక్టోబర్ 7న దక్షిణాఫ్రికా, శ్రీలంక దిల్లీలో తలపడ్డాయి. మొదట డికాక్ (100), రసివాన్ డర్ డుసెన్ (108), అయిడెన్ మార్‌క్రమ్ (106) సెంచరీతో సఫారీలు 428/5 స్కోర్ చేశారు. ఛేదనలో కుశాల్ మెండిస్ (76), చరిత్ అసలంక (79), దసున్ శనక (68) దూకుడుగా ఆడటంతో శ్రీలంక 326కు ఆలౌటైంది. ఈ మ్యాచులో 15 వికెట్లు పడ్డాయి.
ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ - 714
ఈ మ్యాచ్ 2019, జూన్ 20న నాటింగ్‌హామ్‌లో జరిగింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట 5 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (166) ఊచకోత కోశాడు. ఛేదనలో బంగ్లాదేశ్ బాగా పోరాడింది. తమీమ్ ఇక్బాల్ (62), ముష్ఫికర్ రహీమ్ (102), మహ్మదుల్లా (69) ఆకట్టుకున్నారు. దాంతో 50 ఓవర్లకు 333/8 తో బంగ్లా ఓటమి పాలైంది.
ఆస్ట్రేలియా vs శ్రీలంక - 688 పరుగులు
స్వదేశంలో 2015, మార్చి 8న జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా రెచ్చిపోయింది. మొదట గ్లెన్ మాక్స్‌వెల్ (102; 53 బంతుల్లో), స్టీవ్ స్మిత్ (72), షేన్ వాట్సన్ (67) దంచికొట్టడంతో ఆసీస్ 376/9తో నిలిచింది. ఛేదనలో శ్రీలంక 312కు ఆలౌటైంది. అయితే తుది వరకు గెలుపు కోసమే ప్రయత్నించింది. కుమార సంగక్కర (104), తిలకరత్నె (62), దినేశ్ చండిమాల్ (52) ఊరమాస రేంజులో బ్యాటింగ్ చేశారు.
ఇంగ్లాండ్ vs పాకిస్థాన్ - 682 పరుగులు
చివరి ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఎంత భీకరంగా ఆడిందో అందరికీ తెలిసిందే. 2019, జూన్ 3న నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్, పాకిస్థాన్ తలపడ్డాయి. మొదట మహ్మద్ హఫీజ్ (84), బాబర్ ఆజామ్ (63), సర్ఫరాజ్ అహ్మద్ (55) బ్యాటింగ్‌తో పాక్ 348/8 పరుగులు చేసింది. ఛేదనలో ఇంగ్లాండ్ దాదాపుగా గెలిచినంత పనిచేసింది. జో రూట్ (107), జోస్ బట్లర్ (103) సెంచరీలతో చెలరేగడంతో 334/9కి పరిమితమైంది.
భారత్ vs ఇంగ్లాండ్ - 676 పరుగులు
స్వదేశంలో 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. ఫిబ్రవరి 27న బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా భారత్, ఇంగ్లాండ్ తలపడ్డాయి. మొదట సచిన్ తెందూల్కర్ (120), గౌతమ్ గంభీర్ (51), యువరాజ్ సింగ్ (58) బ్యాటింగ్‌తో భారత్ 338కి ఆలౌటైంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ అద్భుతం చేసింది. ఈ స్కోరును సమం చేసింది. ఆండ్రూ స్ట్రాస్ (158), ఇయాన్ బెల్ (69) కష్టపడ్డారు.