SA vs AUS: మరోసారి బద్దలైన గుండె, బ్యాడ్‌లక్ జట్టుకు గుడ్‌లక్ రాలేదు
South Africa vs Australia: ప్రపంచకప్ సెమీస్‌లో ఇప్పటికే నాలుగుసార్లు సెమీఫైనల్లో పరాజయం పాలైన ప్రొటీస్ మరోసారి ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో పరాజయం పాలైంది.
AUS Vs SA Semi Final In ODI World Cup 2023 : ప్రపంచకప్‌లో బ్యాడ్ లక్ టీమ్‌గా పేరుపడిన దక్షిణాఫ్రికా(South Africa)కు మరోసారి నాకౌట్ మ్యాచ్ కలిసి రాలేదు. ప్రపంచకప్ సెమీస్‌లో ఇప్పటికే నాలుగుసార్లు సెమీఫైనల్లో పరాజయం పాలైన ప్రొటీస్ మరోసారి ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో పరాజయం పాలైంది. కోటి ఆశలతో భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన సఫారీలు... సాధికార విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టారు. భారత్ తర్వాత అత్యధిక విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ బెర్తు ఖాయం చేసుకున్నారు. కానీ కీలకమైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మరోసారి ఒత్తిడికి చిత్తయింది. ఒత్తిడిలో దక్షిణాఫ్రికా మెరుగ్గా ఆడలేదన్న అంచనాలను నిజం చేస్తూ మరోసారి సఫారీ జట్టు చేతులెత్తేసింది. ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను(Australia) చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. నాకౌట్ మ్యాచ్‌లో అద్భుతంగా పోరాడినా ఓటమిపాలై అభిమానులను నిర్వేదంలో ముంచెత్తింది.
ప్రపంచకప్ చరిత్రలో ఓ సెమీస్‌లో లాన్స్ క్లుసెనర్ చివరి బంతికి రనౌట్ కావడం... మరో సెమీస్‌లో ఏబీ డివిలియర్స్ పరాజయంతో కంటతడి పెట్టుకున్న క్షణాలను ప్రపంచ క్రికెట్ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇప్పుడు వీటన్నింటినీ బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాలని భావించిన దక్షిణాఫ్రికా మరోసారి ఫైనల్ చేరలేదు. 1992లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికా ఇంటి ముఖం పట్టింది. 1999లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ టైగా ముగియడం ఇలా మహా సంగ్రామంలో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడింది. గత చరిత్రను ఈ ప్రపంచకప్‌లో అధిగమిస్తారని భావించినా ఈసారి అలాటిందేమీ జరగలేదు. దక్షిణాఫ్రికా మరోసారి నాకౌట్ దురదృష్టాన్ని అధిగమించలేకపోయింది.
బవుమా సారథ్యం పెను భారంగా మారిన వేళ దక్షిణాఫ్రికా నాకౌట్‌లో ఆస్ట్రేలియా ముందు తేలిపోయింది. గత తొమ్మిది ప్రపంచకప్‌లలో అయిదు సార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా ముందు ప్రొటీస్ పప్పులు ఒడకలేదు. ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ 12 సార్లు జరగగా అందులో అయిదు టైటిళ్లు ఆస్ట్రేలియా దగ్గరే ఉన్నాయి. కాబట్టి మరోసారి కప్పును సాధించే అవకాశాన్ని కంగారులు అంత తేలిగ్గా వదిలిపెట్టరన్న అంచనాలే నిజమయ్యాయి. ఈసారి దక్షిణాఫ్రికా ఫైనల్ చేరుతుందని అభిమానులు అందరూ గంపెడాశలు పెట్టుకున్న అలాంటిదేమీ జరగలేదు.
ఈ ప్రపంచకప్‌లో దూకుడైన ఆటతీరుతో దక్షిణాఫ్రికా ఆకట్టుకుంది. వరుస విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా ఆటతీరు చూసిన అభిమానులు ఈసారి ఆ జట్టు అద్భుతాలు సృష్టిస్తుందని భావించారు. కానీ కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఎప్పుడు తడబడే సౌతాఫ్రికా మరోసారి అదే అలవాటును పునరావృతం చేసింది. డికాక్, క్లాసెన్, డసెన్, మార్‌క్రమ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా కీలక సమయంలో వీరందరూ చేతులెత్తేశారు. డేవిడ్ మిల్లర్ ఒక్కడే తన జట్టును కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించాడు. కానీ ఆస్ట్రేలియాకు ఆ పోరాటం సరిపోలేదు. ఈ మ్యాచ్ ఫలితంతో దక్షిణాఫ్రికా జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం మాత్రం ఉంది. బవుమా కెప్టెన్సీపై మాత్రమే కాకుండా ఆటతీరుపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంతో కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా కూడా బవూమాపై వేటు తప్పకపోవచ్చు. కానీ ఈసారి దక్షిణాఫ్రికా ఫైనల్ చేరితే టీమిండియా- సౌతాఫ్రికా ఫైనల్ చూద్దామనుకున్న వారికి ఈ మ్యాచ్‌లో సఫారీల పరాజయంతో తీవ్ర నిరాశ ఎదురైంది. కానీ ప్రపంచకప్‌లో దురదృష్ట జట్టు అనే ముద్రను సఫారీ జట్టు ఎప్పుడు తుడిచేసుకుంటుందో అన్న ఆందోళన మాత్రం అభిమానులను వెంటాడుతూనే ఉంది.