SA Vs AUS: నాకౌట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తడ"బ్యాటు" , ఆస్ట్రేలియా ముందు 213 పరుగుల లక్ష్యం
ODI World Cup 2023: : ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మరోసారి తడబడింది. ఆస్ట్రేలియాతో జరగుతున్న సెమీఫైనల్‌లో తక్కువ స్కోరుకే సఫారీలు పరిమితమయ్యారు.
SA Vs AUS, Innings Highlights: ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) మరోసారి తడబడింది. ఆస్ట్రేలియా(Australia)తో జరగుతున్న సెమీఫైనల్‌లో తక్కువ స్కోరుకే సఫారీలు పరిమితమయ్యారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగిపోయిన వేళ... ప్రొటీస్ 49.4 ఓవర్లలో 212 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా 150 పరుగులైనా చేస్తుందా అని అభిమానులు అనుమాన పడ్డ డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా పిచ్ పరిస్థితులకు తగ్గట్లు మిల్లర్ అద్భుతంగా పోరాడాడు. అద్భుత శతకంతో ఆస్ట్రేలియా ముందు పోరాడే స్కోరును ఉంచాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి మిల్లర్ అవుటయ్యాడు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచుల్లో సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా మిల్లర్ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా 212 పరుగులు చేస్తే అందులో 101 పరుగులు మిల్లర్ చేశాడంటే అతని పోరాటం అర్థం చేసుకోవచ్చు.
పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్న గత రికార్డును దృష్టిలో పెట్టుకుని టాస్ గెలవగానే దక్షిణాఫ్రికా కెప్టెన్ బవూమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అది ఎంత పెద్ద తప్పుడు నిర్ణయమో ప్రొటీస్‌కు తొలి ఓవర్‌లోనే అర్థమైంది. తొలి ఓవర్ ఆఖరి బంతికి బవుమాను స్టార్క్ బలికొన్నాడు. 4 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయని బవుమా కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఒక్క పరుగుకే దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ప్రొటీస్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. సఫారీ బ్యాటర్లు పూర్తి డిఫెన్సిఫ్ మూడ్‌లోకి వెళ్లిపోవడంతో పరుగులు రావడం గగనమైపోయింది. ఈ తరుణంలో ఓపిక కోల్పోయిన డికాక్ 14 బంతుల్లో మూడు పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న డికాక్ అవుట్ అవ్వడంతో 8 పరుగులకే సఫారీలు రెండో వికెట్ కోల్పోయారు. ఆ తర్వాత కూడా దక్షిణాఫ్రికా కథ ఏమీ మారలేదు.
ఆదుకుంటారని గంపెడు ఆశలు పెట్టుకున్న మార్క్రమ్, డస్సెన్ వెంటవెంటనే అవుట్ అవ్వడంతో దక్షిణాఫ్రికా పనైపోయింది. 31 బంతుల్లో 6 పరుగులు చేసిన డస్సెన్, 20 బంతుల్లో 10 పరుగులు చేసి మార్‌క్రమ్ అవుటైపోయారు. దీంతో 24 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక సఫారీలు 100 పరుగుల లోపు ఆలౌట్ కావడం ఖాయమని అభిమానులు అంతా సిద్ధమైపోయారు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండడంతో సఫారీల పనైపోయిందనుకున్నారు. కానీ డేవిడ్ మిల్లర్, క్లాసెన్ ఆపద్భాందువులయ్యారు. ముఖ్యంగా మిల్లర్ కడదాక క్రీజులో నిలబడి ఒక్కో రన్ పేరుస్తూ స్కోరు బోర్డును కదిలించాడు. ఇక వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతున్న దశలో 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసిన క్లాసెన్‌ను హెడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. క్లాసెన్ అవుటవ్వగానే తొలి బంతికే జాన్సన్ కూడా హెడ్ బౌలింగ్ అవుటైపోయాడు. ఆ తర్వాత కొయేట్జీ సహకారంతో మిల్లర్ స్కోరు బోర్డును నడిపించాడు.
కానీ కొయెట్జీ 39 బంతుల్లో 19 పరుగులు చేసి అవుటైపోయాడు. ఆ తర్వాత కాసేపటికే మిల్లర్ భారీ సిక్సుతో సెంచరీ చేశాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి మిల్లర్ అవుటయ్యాడు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచుల్లో సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా మిల్లర్ రికార్డు సృష్టించాడు. మిల్లర్ పోరాటంతో ప్రొటీస్ 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది . ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 3, హాజిల్ వుడ్ 2, కమిన్స్ 3, హెడ్ 2 వికెట్లు తీశారు. ఆడమ్ జంపాను మిల్లర్ టార్గెట్ చేశాడు. దీంతో జంపా 7 ఓవర్లలోనే 55 పరుగులు ఇచ్చాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఈ స్వల్ప స్కోరును దక్షిణాఫ్రికా బౌలర్లు కాపాడుకుంటారేమో చూడాలి.