World Cup 2023 Prize Money: విశ్వవిజేతగా నిలిస్తే జాక్ పాట్ కొట్టినట్టే! - వరల్డ్ కప్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
ODI World Cup 2023 Prize Money: వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టు జాక్‌పాట్ కొట్టనుంది. ఐసీసీ శుక్రవారం ప్రైజ్ మనీ వివరాలను ప్రకటించింది.
World Cup 2023 Prize Money: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో యేటా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రైజ్‌మనీ గత కొన్నాళ్లుగా రూ. 20 కోట్లు అంటేనే నోరెళ్లబెట్టే క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐసీసీ కళ్లు చెదిరే న్యూస్ చెప్పింది. వచ్చే నెలలో భారత్ వేదికగా జరుగబోయే 13వ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఫైనల్‌లో గెలిచి విశ్వవిజేతగా నిలిచిన జట్టుతో పాటు రన్నరప్, సెమీఫైనలిస్టు, గ్రూప్ స్టేజ్ జట్లకు అందజేసే ప్రైజ్ మనీ వివరాలను ప్రకటించింది. మొత్తంగా ఈ టోర్నీకి ప్రైజ్‌మనీని 10 మిలియన్ యూఎస్ డాలర్లుగా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 83 కోట్లు. ఇందులోంచే విశ్వవిజేతతో పాటు పరాజితులకూ పంచనున్నారు.
విజేతకు ఎంత..?
10 మిలియన్ యూఎస్ డాలర్ల ప్రైజ్‌మనీ నుంచి నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగబోయే ఫైనల్‌లో గెలిచే విజేతకు దక్కేది 40 లక్షల యూఎస్ డాలర్లు. మన కరెన్సీలో ఇది రూ. 33 కోట్ల (రూ. 33 కోట్ల 17 లక్షలు) పైమాటే.
రన్నరప్‌కు..?
ఇదే ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచే జట్టుకు 20 లక్షల యూఎస్ డాలర్లు దక్కనుంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 16 కోట్లు (రూ. 16 కోట్ల 58 లక్షలు)గా ఉంది.
ICYMI, the breakdown of prize money allocation for #CWC23 has been announced 💰https://t.co/8CEXjrW4Bn
— ICC (@ICC) September 23, 2023
- సెమీఫైనలిస్ట్‌లకు 8 లక్షల యూఎస్ డాలర్లు (రూ. 6 కోట్లు) దక్కనుంది.
- గ్రూప్ స్టేజ్‌లో నిష్క్రమించిన జట్లకు ఒక లక్ష యూఎస్ డాలర్లు (ఒక్కో టీమ్‌కు రూ. 82 లక్షలు) అందనుంది.
- గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్ గెలిచిన జట్టుకు అందేది 40 వేల యూఎస్ డాలర్లు (రూ. 33 లక్షల 17 వేలు).
ICC World Cup 2023 prize money:
— CricketMAN2 (@ImTanujSingh) September 22, 2023
•Winner - 33 Crores.
•Runner up - 16 Crores.
•Two Semifinalists - 6 Crores each.
•All Group stage teams - 82 Lakhs each. pic.twitter.com/8vWkL3mQDM
అక్టోబర్ 5న నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలుకాబోయే ఈ మెగా టోర్నీ నవంబర్ 19న ఇదే వేదికలో ముగుస్తుంది. భారత్‌లోని పది నగరాలలో మొత్తం పది జట్లు పోటీ పడబోయే ఈ మెగా టోర్నీలో 48 మ్యాచ్‌లు జరుగనున్నాయి. అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌ను ఢీకొననుంది. అక్టోబర్ 8న భారత్ వరల్డ్ కప్ వేటను ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా ఆరంభించనుంది. 13వ వన్డే వరల్డ్ కప్ ఎడిషన్ అయిన ఈ మెగా టోర్నీలో ఆతిథ్య భారత్‌తో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, సౌతాఫ్రికాలు నేరుగా అర్హత సాధించగా జూన్‌లో నిర్వహించిన క్వాలిఫయింగ్ టోర్నీలో శ్రీలంక, నెదర్లాండ్స్ స్థానం దక్కించుకున్నాయి. వరల్డ్ కప్‌లో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ మ్యాచ్ అయిన భారత్ - పాకిస్తాన్ పోరు అక్టోబర్ 14న జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం వేయి కండ్లతో వేచి చూస్తోంది.