ODI World Cup 2023: వీసాలు రాలే - దుబాయ్‌కు పోలే - నేరుగా భాగ్యనగరానికే రానున్న బాబర్ గ్యాంగ్
వన్డే వరల్డ్ కప్‌లో ఆడేందుకు గాను బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఇంకా భారత వీసాలు మంజూరు కాలేదు.
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌కు ఏదీ కలిసిరావడం లేదు. ఆసియా కప్ తర్వాత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు, నసీమ్ షా ఇంజ్యూరీ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) టెక్నికల్ కమిటీ నుంచి మహ్మద్ హఫీజ్ తప్పుకోవడం వంటి షాకులతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు తాజాగా భారత్ వచ్చేందుకు ఇంకా వీసాలు మంజూరుకాలేదు. ప్రపంచకప్ ఆడేందుకు గాను మిగిలిన అన్ని జట్ల (భారత్ మినహా 9 దేశాలు) ఆటగాళ్లకూ వీసాలు రాగా ఒక్క పాకిస్తాన్ క్రికెటర్లకు మాత్రం ఇప్పటికీ రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
వాస్తవానికి ఈనెల 29న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగబోయే వార్మప్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ టీమ్ దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసింది. యూఏఈలో వచ్చే వారం టీమ్ బాండింగ్‌ను ఏర్పాటుచేసింది. దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్‌లో వాలి ఇక్కడ వార్మప్ మ్యాచ్ ఆడాలనేది ముందుగా సిద్ధం చేసుకున్న ప్లాన్. కానీ భారత్ వీసాలలో సందిగ్దంతో బాబర్ గ్యాంగ్ దుబాయ్ ట్రిప్‌ను క్యాన్సిల్ చేసుకుంది. వీసాల సమస్య ముగిశాక నేరుగా హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే కివీస్‌తో మ్యాచ్ ఆడనుందని పాక్ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
Pakistan unveil squad for the World Cup campaign 🇵🇰💪
— Pakistan Cricket (@TheRealPCB) September 22, 2023
More details ➡️ https://t.co/hanhk17ACZ#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/HY9cWDGnQn
2016 తర్వాత ఇదే మొదటిసారి..
ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్యల నేపథ్యంలో భారత్ - పాక్‌లు చాలాకాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం పక్కనబెట్టాయి. 2008లో ముంబైలో ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్ 2012లో చివరిసారిగా ఇక్కడ పర్యటించింది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఆడుతుండటం ఇదే రెండోసారి మాత్రమే. 2016లో టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు వచ్చిన పాక్.. మళ్లీ ఏడేండ్లకు భారత్‌లో అడుగుపెడుతోంది. అయితే ఇవి రెండూ ఐసీసీ టోర్నీలే కావడం గమనార్హం.
వన్డే వరల్డ్ కప్ జట్టు ఎంపిక..
శుక్రవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే తమ 15 మంది సభ్యులను ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే యువ పేసర్ నసీమ్ షా భుజం గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. చాలాకాలం తర్వాత హసన్ అలీ వన్డే జట్టులోకి వచ్చాడు. షహీన్ అఫ్రిది నేతృత్వంలోని పేస్ బృందంపై పాకిస్తాన్ భారీ ఆశలు పెట్టుకుంది. బ్యాటర్లుగా బాబర్, రిజ్వాన్, ఇమామ్, ఫకర్, అఘా సల్మాన్‌లు కీలక పాత్ర పోషించనున్నారు.
🚨 Our squad for the ICC World Cup 2023 🚨#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/pJjOOncm56
— Pakistan Cricket (@TheRealPCB) September 22, 2023
పాకిస్తాన్ జట్టు : బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసమ మీర్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిది, మహ్మద్ వసీం