(Source: ECI/ABP News/ABP Majha)
Mitchell Starc: వస్తున్నా నేనే వస్తున్నా! - ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - వచ్చే ఏడాది ఆడతానంటున్న ఆసీస్ స్టార్ పేసర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గుడ్ న్యూస్ చెప్పాడు.
Mitchell Starc: జాతీయ జట్టు ప్రయోజనాలే ముఖ్యం అని ఇన్నాళ్లు గిరిగీసుకున్న ఆసీస్ స్టార్ పేసర్, లెఫ్టార్మ్ బౌలర్ మిచెల్ స్టార్క్ సంచలన ప్రకటన చేశాడు. సుమారు ఐదు సీజన్లుగా ఐపీఎల్ వేలానికి (మొత్తంగా ఆటకు 8 సీజన్లు) దూరంగా ఉన్న స్టార్క్ వచ్చే సీజన్‌లో మాత్రం ఆడేందుకు సిద్ధమని ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ తర్వాత అత్యధికమంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ లీగ్‌లో భాగస్వాములవుతారు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడేందుకు ఉత్సాహం చూపే ఆసీస్ ప్లేయర్లకు తాను భిన్నం అని స్టార్క్ చాలాసార్లు ప్రూవ్ చేశాడు. కానీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
ఆస్ట్రేలియాకు చెందిన విల్లో టాక్ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ ఐపీఎల్‌లో మిమ్మల్ని చూడొచ్చా..? అన్న ప్రశ్నకు స్టార్క్ సమాధానమిస్తూ.. ‘తప్పకుండా.. నేను వచ్చే ఏడాది (2024) ఐపీఎల్‌లోకి తిరిగివస్తా..’ అని బదులిచ్చాడు. వచ్చే ఏడాది అమెరికా వేదికగా జరుగబోయే టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు ఉత్సాహం చూపిస్తున్న స్టార్క్.. అందుకు ఐపీఎల్‌ను ఒక సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాడు.
చివరిసారి ఎప్పుడు..?
ఐపీఎల్‌లో స్టార్క్ 2015లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఏడాది విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన స్టార్క్.. 14 మ్యాచ్‌లు ఆడాడు. అదే ఏడాది ఆస్ట్రేలియా ఆడిన వన్డే వరల్డ్ కప్ (గెలిచింది ఆసీసే) టీమ్‌లో సభ్యుడిగా ఉన్న స్టార్క్.. ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్ నెగ్గడంలోనూ కీలక పాత్ర పోషించాడు. కానీ 2015లో అడిలైడ్ వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో గాయపడ్డ స్టార్క్ తర్వాత ఐపీఎల్‌తో పాటు స్వదేశంలో జరిగే బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్), ఇతర టీ20 టోర్నీలకూ దూరంగా ఉన్నాడు. పూర్తిగా టెస్టు క్రికెట్ మీద దృష్టి సారించిన స్టార్క్.. ఐపీఎల్‌లో 2016 సీజన్ మధ్యలోనే గాయం కారణంగా దూరమయ్యాడు. 2018 వేలంలో అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసింది. కానీ టోర్నీ ప్రారంభానికి ముందే గాయం కారణంగా అతడు ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. అప్పట్నుంచి మళ్లీ అతడు ఐపీఎల్ వేలంలో పాల్గొనలేదు. మొత్తంగా ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌లు ఆడిన స్టార్క్.. 34 వికెట్లు పడగొట్టాడు.
Mitchell Starc confirms his participation in the 2024 IPL auction.
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2023
Welcome back to IPL, Starc...!!! pic.twitter.com/74jDcYgSUs
ఆస్ట్రేలియా తరఫున ఇంతవరకూ 82 టెస్టులు ఆడిన స్టార్క్.. 333 వికెట్లు పడగొట్టాడు. 110 వన్డేలు ఆడిన అతడు.. 219 వికెట్లు తీశాడు. ఆసీస్ తరఫున 58 టీ20లు ఆడి 73 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా 2015లో గెలిచిన వన్డే వరల్డ్ కప్‌తో పాటు 2021 లో గెలిచిన టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది భారత్‌తో ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచిన జట్లలో స్టార్క్ సభ్యుడిగా ఉన్నాడు. మరి ఐపీఎల్ - 2024 ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన స్టార్క్‌ను వేలంలో ఏ జట్టు దక్కించుకుంటుంది..? అతడు ఏ మేరకు ప్రభావం చూపగలడు..? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial