Leicestershire vs India: అర్థ సెంచరీతో మెరిసిన తెలుగు తేజం కేఎస్ భరత్ - మొదటిరోజు భారత్ స్కోరు ఎంతంటే?
లీచెస్టర్ షైర్‌తో జరుగుతున్న మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా మొదటిరోజు ఆట ముగిసేసరికి 60.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.
లీచెస్టర్ షైర్‌తో జరుగుతున్న మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. మొదటిరోజు ఆట ముగిసేసరికి 60.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (70 బ్యాటింగ్: 111 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్), మహ్మద్ షమీ (18 బ్యాటింగ్: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నారు.
ఓపెనర్లు రోహిత్ శర్మ (25: 47 బంతుల్లో, మూడు ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (21: 28 బంతుల్లో, మూడు ఫోర్లు) జట్టు స్కోరు 50 పరుగులు చేరేసరికి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (0: 11 బంతుల్లో), హనుమ విహారి (3: 23 బంతుల్లో) కేవలం ఒక్క పరుగు వ్యవధిలోనే అవుట్ కావడంతో టీమిండియా 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
రవీంద్ర జడేజా (13: 13 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. విరాట్ కోహ్లీ (33: 69 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా రోమన్ వాకర్ తనను పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ (23: 32 బంతుల్లో, నాలుగు ఫోర్లు), ఉమేష్ యాదవ్ (6: 4 బంతుల్లో, ఒక ఫోర్) కూడా వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యారు.
అనంతరం మహ్మద్ షమీ, కేఎస్ భరత్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. లీచెస్టర్‌షైర్ బౌలర్లలో రోమన్ వాకర్ ఐదు వికెట్లు తీయగా... విల్ డేవిస్ రెండు, ప్రసీద్ కృష్ణ ఒక వికెట్ తీశారు. భారత ఆటగాళ్లలో ఛతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసీద్ కృష్ణ లీచెస్టర్‌షైర్ తరఫున ఆడారు.
View this post on Instagram