Keshav Maharaj: అయోధ్య వస్తా, రామయ్యను దర్శించుకుంటా!
Ayodhya Ram Mandir: దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్ మరోసారి అయోధ్య రామయ్యపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. భవిష్యత్తులో తన కుటుంబ సమేతంగా అయోధ్య రామ ఆలయానికి వస్తానని తెలిపాడు.
South Africa Cricketer Keshav Maharaj Comments On Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ తన సంతోషాన్ని వ్యక్తం చేసిన దక్షిణాఫ్రికా క్రికెటర్ (South Africa) కేశవ్ మహరాజ్(Keshav Maharaj)... మరోసారి అయోధ్య(Ayodhya) రామయ్యపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. భవిష్యత్తులో తన కుటుంబ సమేతంగా అయోధ్య రామ ఆలయానికి వస్తానని కేశవ్ మహరాజ్ తెలిపాడు. మైదానంలో బ్యాటింగ్‌కు దిగే సమయంలో రామ్ సియా రామ్ పాటను ప్రవేశ గీతంగా ఎందుకు ఉపయోగిస్తున్నాడో కూడా వివరించాడు. దురదృష్టవశాత్తూ షెడ్యూల్ కారణంగా ఆలయ ప్రారంభోత్సవానికి రాలేకపోయానని.... కానీ భవిష్యత్తులో కచ్చితంగా అయోధ్య వెళ్లి దర్శించుకుంటానని కేశవ్ మహరాజ్ తెలిపాడు. తన కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో తీర్థయాత్రకు భారత్ వెళ్లాలనుకుంటున్నారని... . అందుకు అయోధ్యే సరైందన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ బృందం తనకు సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దేవుడిపై తన విశ్వాసం చాలా ధృఢమైందన్న కేశవ్ మహరాజ్.. ఆయన ఎల్లప్పుడు తనను సరైన దారిలో నడిపించి ఈ స్థానంలో నిలిపాడని నమ్ముతానని అన్నాడు. తాను శ్రీ రాముడు, హనుమంతుడి భక్తుడినని... రామ్ సియా రామ్ పాట వింటే తనలో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయని ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్ తెలిపాడు. బ్యాటింగ్‌కు దిగే సమయంలో ఆ పాట వేయాలని సిబ్బందికి సూచించానని వెల్లడించాడు.
అప్పట్లోనే పోస్ట్
అయోధ్యలో రామమందిర (Ayodhya Ram Mandir) ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేశవ్ మహరాజ్(Keshav Maharaj) సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. ఈ అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోతుందని, దేశవ్యాప్తంగానే కాకుండా దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలకు కూడా శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరగాలని కోరుకుంటున్నానన్నారు . అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు.
పూర్వీకులు భారతీయులే...
కేశవ్ పూర్వీకులు భారత్ నుంచి ఉపాధి నిమిత్తం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. కేశవ్ తండ్రి ఆత్మానందం కూడా క్రికెట్ ఆడినా వర్ణవివక్ష కారణంగా ఎదగలేకపోయాడు. తొలి నాళ్లలో సీమ్ బౌలర్, ఆల్‌రౌండర్ అయిన కేశవ్.. తర్వాత స్పిన్నర్ అవతారం ఎత్తాడు. 2016లో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాత టీ20ల్లోకి అడుగుపెడుతూనే సౌతాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కేశవ్ దక్షిణాఫ్రికాలోనే పుట్టిపెరిగినప్పటికీ.. హిందూ సంప్రదాయాలను పాటిస్తాడు. హనుమాన్ భక్తుడైన అతడి బ్యాట్‌పై ఓం గుర్తు ఉంటుంది. అతడి భార్య లెరీసాకు కూడా భారత మూలాలు ఉన్నాయి. ఆమె కథక్ డ్యాన్సర్ కూడా. టెస్టుల్లో కేశవ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీరాముని పాటలు వినిపించాయి. అప్పుడు కేశవ్ స్పందిస్తూ.. తాను ఎప్పుడు మైదానంలోకి దిగినా ఇలాంటి పాటలు వినిపించేలా చేశారని ఆనందం వ్యక్తం చేశాడు.