(Source: ECI/ABP News/ABP Majha)
Jasprit Bumrah: అట్లుంటది మరి బుమ్రాతోని, టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి
IND Vs ENG: నిప్పులు చెరిగే బంతులతో బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. వైజాగ్ టెస్ట్‌లో స్పిన్నర్లకు, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బుమ్రా ప్రదర్శన అబ్బురపరిచింది.
అతి తక్కువ బంతుల్లో
వైజాగ్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఓ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. మొత్తం 6,781 బంతులు వేసి, 150 వికెట్లు తీశాడు బుమ్రా. అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు తీసిన భారత బౌలర్లలో బుమ్రా తర్వాత వరుసగా ఉమేశ్ యాదవ్ (7661), మహ్మద్ షమీ (7755), కపిల్ దేవ్ (8378), రవిచంద్రన్ అశ్విన్ (8380) ఉన్నారు. మ్యాచుల పరంగా చూస్తే.. బుమ్రా 34 టెస్ట్ మ్యాచ్‌లలో 150 వికెట్లు పూర్తి చేశాడు.
మ్యాచ్‌ల పరంగా వేగంగా 150 టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు
రవిచంద్రన్ అశ్విన్ 29 మ్యాచ్‌లు
రవీంద్ర జడేజా 32 మ్యాచ్‌లు
ఎరపల్లి ప్రసన్న 34 మ్యాచ్‌లు
అనిల్ కుంబ్లే –34 మ్యాచ్‌లు
జస్ప్రీత్ బుమ్రా –34 మ్యాచ్‌లు
హర్భజన్ సింగ్ –35 మ్యాచ్‌లు
బీఎస్ చంద్రశేఖర్ –36 మ్యాచ్‌లు
రెండో ఇన్నింగ్స్ కీలకం
వైజాగ్ టెస్ట్‌లో టీమిండియా(India) పట్టు బిగించే దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) డబుల్ సెంచరీతో 396 పరుగులు చేసిన రోహిత్ సేన... అనంతరం ఇంగ్లాండ్(England) జట్టును 253 పరుగులకే కుప్పకూల్చింది. బుమ్రా(Bumrah) పదునైన బంతులతో బ్రిటీష్ జట్టు పతనాన్ని శాసించాడు. ఆరు వికెట్లు నేలకూల్చి టీమిండియా విజయావకాశాలను మెరుగుపర్చాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఒక్క వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 13, జైస్వాల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్ జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు చేస్తుందన్న దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.