Ishan Kishan Record: వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ - 126 బంతుల్లో చితక్కొట్టిన ఇషాన్
Ishan Kishan Record: టీమ్‌ఇండియా యువ కెరటం ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 126 బంతుల్లోనే 200 స్కోరు అందుకున్నాడు.
Ishan Kishan Record:
టీమ్‌ఇండియా యువ కెరటం ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. బంగ్లాదేశ్ బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 126 బంతుల్లోనే 200 స్కోరు అందుకున్నాడు. రోహిత్ శర్మ, సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సరసన చేరాడు. ఛటోగ్రామ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఇషాన్ 131 బంతుల్లో 24 బౌండరీలు, 10 సిక్సర్లు బాదేసి 210 పరుగులు సాధించాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు దొరికింది. ఝార్ఖండ్ డైనమైట్ ఈ అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు. శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగాడు. సీనియర్ ఆటగాడు ఇబ్బంది పడుతున్న తరుణంలో నిలకడగా బ్యాటింగ్ చేశాడు. పిచ్‌ను అర్థం చేసుకున్న వెంటనే బౌండరీలు బాదడం మొదలుపెట్టాడు. గత రెండు వన్డేల్లో టీమ్‌ఇండియా బ్యాటర్లను వణికించిన బౌలర్లకు అతడు చుక్కలు చూపించాడు. ఒక సిక్సర్, ఏడు బౌండరీలతో 49 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
View this post on Instagram
ఆత్మవిశ్వాసం పెరిగాక ఇషాన్ కిషన్ మరింత రెచ్చిపోయాడు. షకిబ్, ఇబాదత్, తస్కిన్ సహా బౌలర్లందరికీ తన ఊచకోతను పరిచయం చేశాడు. కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. కేవలం 85 బంతుల్లోనే కెరీర్లో తొలి సెంచరీ అందుకున్నాడు. అప్పటికీ తన ఆకలి తీరలేదు. గాయపడ్డ సింహం మాదిరిగా బ్యాటుతో గాండ్రించాడు. 16 బౌండరీలు, 8 సిక్సర్లతో 103 బంతుల్లోనే 150 మైలురాయికి చేరుకున్నాడు. మరోవైపు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అండతో వడివడిగా డబుల్ సెంచరీ వైపు అడుగులేశాడు. ముస్తాఫిజుర్ వేసిన 34.6వ బంతికి సింగిల్ తీసి ఎలైట్ కబ్ల్‌లో అడుగుపెట్టాడు. 126 బంతుల్లోనే ద్విశతకం అందుకున్నాడు. యంగెస్ట్, ఫాస్టెస్ట్ డబుల్ సెంచూరియన్‌గా రికార్డు సృష్టించాడు. రెండో వికెట్‌కు 190 బంతుల్లోనే 290 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.
View this post on Instagram
Ishan Kishan departs after scoring a stupendous 210 👏💯💯
— BCCI (@BCCI) December 10, 2022
Live - https://t.co/ZJFNuacDrS #BANvIND pic.twitter.com/oPHujSMCtY