Yuzvendra Chahal Record: చరిత్ర సృష్టించిన చహల్ - మరో వికెట్ తీస్తే తోపు రికార్డు సొంతం
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అరుదైన ఘనతను అందుకున్నాడు.
Yuzvendra Chahal Record: పదేండ్ల క్రితం ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఈ లీగ్‌లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన డ్వేన్ బ్రావో రికార్డు (183)ను సమం చేశాడు. రాబోయే మ్యాచ్‌లలో చహల్ ఒక్క వికెట్ పడగొట్టినా అది చరిత్రే అవుతుంది.
ఈ సీజన్ (2023)కు ముందు చహల్ ఐపీఎల్‌లో 166 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసినవారిలో మూడో స్థానంలో ఉండేవాడు. ఇక 2023లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఈ రాజస్తాన్ స్పిన్నర్ 183 వికెట్లకు చేరుకున్నాడు. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్‌ను ఔట్ చేయడంతో అతడు ఈ ఘనతను అందుకున్నాడు.
నిన్నటి మ్యాచ్‌లో చహల్ 4 ఓవర్లు విసిరి 29 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా 183 వికెట్లు తీయడానికి బ్రావోకు 161 మ్యాచ్‌లు అవసరం కాగా చహల్ 142 మ్యాచ్‌లలోనే ఈ ఫీట్‌ను చేరుకున్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ -5 బౌలర్లు :
1. డ్వేన్ బ్రావో - 183
2. యుజ్వేంద్ర చహల్ - 183
3. పియుష్ చావ్లా - 174
4. అమిత్ మిశ్రా - 172
5. అశ్విన్ - 171
You made us believe, Yuzi. 🙏💗 pic.twitter.com/Z5TOKJxdJc
— Rajasthan Royals (@rajasthanroyals) May 7, 2023
ఐపీఎల్-16 సీజన్ ప్రారంభానికి ముందు టాప్ -5లో బ్రావో తర్వాత లసిత్ మలింగ.. 170 వికెట్లతో రెండో స్థానంలో ఉండేవాడు. కానీ తాజా సీజన్‌లో పీయూష్ చావ్లా, అమిత్ మిశ్రాలు అంచనాలకు మించి రాణిస్తున్నారు. అశ్విన్ కూడా మలింగను దాటేశాడు. తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఉన్న టాప్ - 5 బౌలర్లలో ఒక్క బ్రావో తప్ప మిగిలిన నలుగురు భారతీయులే కావడం గమనార్హం.
చహల్ ప్రస్థానం..
2013లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చహల్ తొలుత ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. కానీ చహల్‌కు గుర్తింపు వచ్చింది మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తోనే. 2014 సీజన్ నుంచి 2021 వరకూ 9 సీజన్ల పాటు ఆర్సీబీ తరఫున ఆడిన చహల్.. 113 మ్యాచ్‌లలో 130 వికెట్లు పడగొట్టాడు. కానీ 2022 సీజన్‌కు ముందు ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు. వేలంలో రాజస్తాన్ రాయల్స్ చహల్ ను దక్కించుకుంది. ఈ రెండు సీజన్లలో ఇప్పటివరకు 28 మ్యాచ్ లు ఆడిన అతడు.. 44 వికెట్లు పడగొట్టాడు. చహల్ అత్యధికంగా 2015 సీజన్ లో 27 వికెట్లు తీశాడు. సన్ రైజర్స్ తో ఓడిన రాజస్తాన్ తమ తర్వాతి మ్యాచ్ ను మే 11న ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీసినా చహల్ కొత్త చరిత్ర సృష్టిస్తాడు.
Mujhe kya? Main toh chatur chaalaak chanchal Chahal hoon... pic.twitter.com/k2gucnZ2VQ
— Rajasthan Royals (@rajasthanroyals) May 7, 2023