Shakib Al Hasan - IPL 2023: కేకేఆర్‌కు వరుస షాకులు ఈ సీజన్ నుంచి తప్పుకున్న బంగ్లా ఆల్ రౌండర్
IPL 2023: బంగ్లాదేశ్ వెటరన్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్, ఐపీఎల్ లో తాను ప్రాతినిథ్యం వహించే కోల్కతా నైట్ రైడర్స్‌కు షాకిచ్చాడు.
Shakib Al Hasan - IPL 2023: ఐపీఎల్-16ను ఓటమితో మొదలుపెట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సీజన్‌లో వరుసగా షాకులు తాకుతున్నాయి. ఈ సీజన్‌లో కేకేఆర్ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఫస్టాఫ్ (తొలి ఏడు మ్యాచ్‌లు)కు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు టీ20లలో సారథిగా వ్యవహరిస్తున్న షకిబ్ అల్ హసన్ కూడా ఈ ఎడిషన్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. జాతీయ జట్టు విధుల నేపథ్యంలో షకిబ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
వాస్తవానికి షకిబ్.. ఐపీఎల్ లో తొలి రెండు మ్యాచ్ లకు మాత్రమే అందుబాటులో ఉండడని, తర్వాత టీమ్ తో కలుస్తాడని గతంలో ఫ్రాంచైజీ భావించింది. స్వదేశంలో బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తో పాటు టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత (ఏప్రిల్ 8) కేకేఆర్‌తో కలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ షకిబ్ మాత్రం ఫ్రాంచైజీకి షాకిచ్చాడు. ఈ సీజన్ మొత్తం నుంచి తాను తప్పుకుంటున్నట్టు తెలిపాడు.
ఎందుకు..?
షకిబ్ సీజన్ నుంచి తప్పుకోవడానికి బంగ్లాదేశ్ జాతీయ జట్టు విధులే కారణం. నేటి (మంగళవారం) నుంచి ఐర్లాండ్ తో టెస్టు మ్యాచ్ ఆడనున్న బంగ్లాదేశ్ జట్టు మళ్లీ మే లో ఐర్లాండ్ టూర్‌కు వెళ్లాల్సి ఉంది. దీంతో అక్కడ ఆ జట్టుతో మూడు వన్డేలు ఆడనుంది. వీటి కోసం మళ్లీ ఐపీఎల్ నుంచి వెళ్లడం, మే 15 తర్వాత తిరిగి జట్టుతో కలవడం ఎందుకనుకున్నాడో ఏమో గానీ.. ఈ సీజన్ కు తాను దూరంగా ఉంటున్నట్టు కేకేఆర్ యాజమాన్యానికి కూడా తెలియజేశాడు. కాగా.. షకిబ్ స్థానంలో కేకేఆర్ ఇంకా రిప్లేస్మెంట్ ప్రకటించలేదు.
కేకేఆర్‌కు ఇబ్బందే..
అసలే రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రూపంలో కీలక బ్యాటర్ ను కోల్పోయిన కేకేఆర్ కు ఇది ఎదురుదెబ్బే. షకిబ్ బంతితో పాటు బ్యాట్ తోనూ రాణించగల సమర్థుడు. అసలే కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ లో అనుభవరాహిత్యం కొట్టిచ్చినట్టు కనిపిస్తున్నది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 192 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్ 29కే మూడు వికెట్లు కోల్పోయింది. అఫ్గాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ మంచి బ్యాటరే అయినా అతడికి సరైన జోడీ లేదు. అనుకుల్ రాయ్ కు అనుభవరాహిత్యం. వెంకటేశ్ అయ్యర్ కాస్త ఫర్వాలేదనిపించినా నితీశ్ రాణా త్వరగా ఆడాలనే తాపత్రయంలో ఔటయ్యాడు. కేకేఆర్ భారీ ఆశలు పెట్టుకున్న రింకూ సింగ్ కూడా విఫలమయ్యాడు. ఇక షకిబ్ తో పాటు లిటన్ దాస్ సైతం ఈ సీజన్ లో ఆడతాడో లేదో అనుమానంగానే ఉంది. ప్రస్తుతం ఐర్లాండ్ తో ఆడుతున్న టెస్టులో అతడు కూడా సభ్యుడిగా ఉన్నాడు. అతడు కూడా షకిబ్ మాదిరిగానే నిర్ణయం తీసుకుంటే ఇక కేకేఆర్‌కు కష్టాలు తప్పవు.
బీసీసీఐ అసంతృప్తి!
ఐపీఎల్ వేలం సమయంలో సీజన్ కు అందుబాటులో ఉంటామని చెప్పి తర్వాత గైర్హాజరు అవుతున్న ఆటగాళ్లు, సంబంధిత క్రికెట్ బోర్డులపై బీసీసీఐ గుర్రుగా ఉందని సమాచారం. ఈ సీజన్ కు ముందు జరిగిన వేలంలోనే బీసీసీఐ.. అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు వాళ్ల క్రికెటర్లు అందుబాటులో ఉంటారా..? ఉండరా..? అన్న సమాచారం కోరింది. అప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ).. తమ ఆటగాళ్లు పరిమిత స్థాయిలో అందుబాటులో ఉంటారని చెప్పి కూడా ఇప్పుడు ఇలా చేయడంపై బోర్డు అసహనం వ్యక్తం చేస్తున్నది.