(Source: Poll of Polls)
Rishabh Pant in IPL: ఏం తేజస్సు బిడ్డ! డీసీ-జీటీ మ్యాచ్ చూసేందుకు వచ్చిన పంత్-ఫోటోలు వైరల్
IPL 2023: టీమిండియా వికెట్ కీపర్, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ గాయం తర్వాత తొలిసారి జనం ముందుకు వచ్చాడు.
Rishabh Pant in IPL: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం మంగళవారం రాత్రి రిషభ్ పంత్ నామస్మరణతో ఊగిపోయింది. నిన్న రాత్రి గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ పంత్ స్టేడియానికి రావడంతో అతడి అభిమానులు పులకరించిపోయారు. గతేడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత జనంలోకి రావడం పంత్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఢిల్లీ క్యాపిటల్స్ - గుజరాత్ జెయింట్స్ మధ్య అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల) స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మ్యాచ్ మొదలయ్యాక స్టేడియానికి వచ్చిన పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కో ఓనర్ పార్థ్ జిందాల్ వెంట తీసుకొచ్చాడు. బీసీసీఐ ఉన్నతాధికారులు కూర్చునే చోట నుంచి పంత్ మ్యాచ్‌ను వీక్షించాడు. ఆట మొదలైన కొద్దిసేపటికే కెమెరాలన్నీ పంత్ వైపునకు తిరిగాయి.
Our 13th Man, our #RP17 🫶#YehHaiNayiDilli #IPL2023 #DCvGTpic.twitter.com/M286lDUHfu
— Delhi Capitals (@DelhiCapitals) April 4, 2023
మెడలో గొలుసు, కళ్లకు అద్దాలు, వైట్ టీషర్ట్ వేసుకుని మ్యాచ్ తిలకించడానికి వచ్చిన పంత్ ను చూడగానే స్టేడియం హోరెత్తిపోయింది. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్న పంత్.. జనంలోకి రావడం ఇదే ప్రథమం. గాయం తర్వాత పంత్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం తప్ప నేరుగా జనం ముందుకు రాలేదు. ఈ మ్యాచ్‌కు ముందే ఢిల్లీ క్యాపిటల్స్.. నేడు పంత్ వస్తున్నాడని చెప్పడంతో అతడిని చూసేందుకు కోట్లా పోటెత్తింది. పంత్ టీవీ తెరలపై కనబడగానే స్టేడియం మొత్తం ‘పంత్.. పంత్’ అని హోరెత్తింది. ఊతకర్ర సాయంతో వచ్చిన పంత్ గ్యాలరీలోకి వచ్చి అందరికీ అభివాదం చేశాడు. పంత్ రాకను కింద టీవీ గ్యాలరీలలోంచి వీక్షించిన టీమ్ మెంటార్ సౌరవ్ గంగూలీ, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ లు ఆ విజువల్స్ చూస్తూ మైమరిచిపోయారు.
Dilli 🫶🏼 Rishabh Pant 🫶🏼 #QilaKotla 😇#YehHaiNayiDilli #IPL2023 #DCvGT @RishabhPant17 pic.twitter.com/hwp72qJkmT
— Delhi Capitals (@DelhiCapitals) April 4, 2023
కాగా లక్నోతో జరిగిన తొలి మ్యాచ్ లో పంత్ జెర్సీని డగౌట్ లో ఉంచిన ఢిల్లీ క్యాపిటల్స్ పై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చనిపోయిన వారికి మాత్రమే అలా చేస్తారని బీసీసీఐ.. ఢిల్లీ ఫ్రాంచైజీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో క్షమాపణలు చెప్పిన క్యాపిటల్స్.. పంత్ తమతో ఉన్నాడనే భావనలో తాము అలా ఉంచామని, ఇకపై అలా చేయమని సంజాయిషీ ఇచ్చుకున్నట్టు సమాచారం.
ఢిల్లీ - జీటీ మ్యాచ్ మొత్తం పూర్తయ్యేవరకూ పంత్ స్టేడియంలోనే ఉన్నాడు. గుజరాత్ ఇన్నింగ్స్ లో ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్.. హార్ధిక్ పాండ్యాను ఔట్ చేయడంతో పార్థ్ జిందాల్ తో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు. ఉన్నంతసేపూ నవ్వుతూ.. ప్రేక్షకులకు అభివాదం చేస్తూ హ్యాపీగా గడిపిన పంత్.. మ్యాచ్ ముగిశాక గుజరాత్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి కాసేపు వారితో ముచ్చటించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
కాగా ఢిల్లీ - గుజరాత్ మధ్య మంగళవారం ముగిసిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులే చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని గుజరాత్.. 18.1 ఓవర్లలోనే ఛేదించింది. సాయి సుదర్శన్ (62 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (31 నాటౌట్) లు రాణించి ఈ సీజన్ లో గుజరాత్ కు వరుసగా రెండో విజయాన్ని అందించారు.