Jos Buttler: బట్లర్‌కు షాకిచ్చిన బీసీసీఐ - మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత - కారణమిదే!
IPL 2023: ఐపీఎల్‌లో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌కు మ్యాచ్ ఫీజులో పది శాతం కోత పడింది.
![Jos Buttler: బట్లర్‌కు షాకిచ్చిన బీసీసీఐ - మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత - కారణమిదే! IPL 2023 Rajasthan Royals Opener Jos Buttler Fined 10 Percent Of His Match fees For breaching code of conduct Jos Buttler: బట్లర్‌కు షాకిచ్చిన బీసీసీఐ - మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత - కారణమిదే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/42e35a78adf6329078330373f2d4c76b1683876520609689_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jos Buttler Fined: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ గెలిచినా రాజస్తాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ జోస్ బట్లర్‌కు బీసీసీఐ షాకిచ్చింది. ఐపీఎల్‌లో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అతడికి మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నట్టు ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. బట్లర్ లెవల్ 1 అఫెన్స్‌ను అతిక్రమించినందుకు జరిమానా ఎదుర్కున్నాడు.
కారణమిదే..
కోల్‌కతా నైట్ రైడర్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య గురువారం ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో బట్లర్.. హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్లో రనౌట్ అయ్యాడు. హర్షిత్ వేసిన షార్ట్ లెంగ్త్ బాల్‌ను బట్లర్ పాయింట్ దిశగా ఆడాడు. అయితే అతడు రన్ తీయడానికి ముందుకు మూమెంట్ ఇచ్చి బాల్ ను చూస్తూ అక్కడే ఉండిపోయాడు. కానీ జైస్వాల్ అప్పటికే సగం క్రీజు దాటాడు. దీంతో చేసేదేమీ లేక బట్లర్ నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపునకు పరిగెత్తినా రనౌట్ అవక తప్పలేదు.
రనౌట్ కావడంతో బట్లర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. పెవలియన్‌కు వెళ్లే క్రమంలో బట్లర్.. బౌండరీ లైన్ వద్ద ఉండే రోప్స్‌ను తన బ్యాట్ తో బలంగా కొట్టాడు. తాను ఔట్ అయినందుకు గానీ ఆ కోపాన్ని రోప్స్ మీద చూపించాడు. ఫీల్డ్ లో ఇలాంటివి చేస్తే అది ఐపీఎల్ లోని కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 అఫెన్స్ (నేరం) కిందకి వస్తుంది. అందుకే బట్లర్ కు మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించినట్టు బీసీసీఐ తెలిపింది.
A mix up in the middle and Jos Buttler is Run Out and departs for a duck.
— IndianPremierLeague (@IPL) May 11, 2023
Live - https://t.co/jOscjlr121 #TATAIPL #KKRvRR #IPL2023 pic.twitter.com/w9ijHeP46X
గతంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి (చెన్నైతో మ్యాచ్‌లో) కూడా బీసీసీఐ ఇదే తరహా జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ ఆ మ్యాచ్ లో సీఎస్కే ఆటగాడు శివమ్ దూబే ఔట్ అయ్యాక కాస్త అతిగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది కూడా నిబంధనలను అతిక్రమణ కిందకే వస్తుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీకి పది శాతం కోత విధించింది బీసీసీఐ. ఆ తర్వాత కూడా కోహ్లీ ఓ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేసినందుకు రూ. 24 లక్షలు, లక్నోతో ఈనెల1న జరిగిన మ్యాచ్ లో నవీన్ ఉల్ హక్, గౌతం గంభీర్ లతో వాగ్వాదానికి దిగినందుకు గాను మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా ఎదుర్కున్న విషయం తెలిసిందే.
ఇక కోల్‌కతా - రాజస్తాన్ మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేసింది. లక్ష్యాన్ని రాజస్తాన్ రాయల్స్ 13.1 ఓవర్లలోనే దంచేసింది. ఆ జట్టు యువ సంచలనం యశస్వి జైస్వాల్.. 47 బంతుల్లోనే 13 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 98 పరుగులతో నాటౌట్ గా నిలిచి రాజస్తాన్‌కు ఈజీ విక్టరీని అందించాడు. ఈ మ్యాచ్ లో జైస్వాల్.. 13 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకుని కెఎల్ రాహుల్, పాట్ కమిన్స్ ల పేరిట ఉన్న రికార్డు (14 బంతుల్లో అర్థ సెంచరీ)ను బ్రేక్ చేశాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)