IPL 2023: భువీ కాళ్లు పట్టుకున్న వార్నర్ భాయ్ - ఈ వీడియో చూస్తే కళ్లు చెమ్మగిల్లాల్సిందే!
ఐపీఎల్-2023 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భువీ - వార్నర్ ల బాండింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
IPL 2023: ఐపీఎల్‌లో కొన్ని జట్లకు వారి సారథులన్నా.. ఆ టీమ్‌లోని ఆటగాళ్లన్నా ప్రత్యేకమైన ఎమోషన్ ఉంటుంది. చెన్నైకి ధోని, ఆర్సీబీకి కోహ్లీ, ముంబైకి రోహిత్.. ఈ కోవలోకి వచ్చేవాడే డేవిడ్ వార్నర్. సన్ రైజర్స్ అభిమానులు ‘వార్నర్ భాయ్’ అని ముద్దుగా పిలుచుకునే అతడు గతేడాది నుంచి ఆరెంజ్ ఆర్మీతో లేకున్నా వార్నర్ మీద ఉన్న అభిమానం మాత్రం అలాగే ఉంది. సన్ రైజర్స్ అభిమానులతో పాటు టీమ్ మేట్స్‌తో కూడా వార్నర్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది.
హైదరాబాద్ - ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్‌కు వచ్చిన వార్నర్.. టాస్ కోసమని గ్రౌండ్ లోకి వచ్చాడు. అదే సమయంలో కొంత దూరంలో టీమిండియా వెటరన్ పేసర్, హైదరాబాద్ కు పదేండ్ల పాటు బౌలింగ్ బాధ్యతలు మోస్తున్న భువనేశ్వర్ కనిపించాడు. భువీని చూడగానే వార్నర్ పరిగెత్తుకుంటూ వెళ్లి.. అతడి రెండు కాళ్ల మీద పడ్డాడు. భువీ వద్దని వారించినా వినలేదు. ఆ తర్వాత మనసారా భువీని హత్తుకున్నాడు.
This visual is all 🧡 💙!
— IndianPremierLeague (@IPL) April 24, 2023
Follow the match ▶️ https://t.co/ia1GLIWu00#TATAIPL | #SRHvDC | @SunRisers | @DelhiCapitals | @BhuviOfficial | @davidwarner31 pic.twitter.com/t9nZ95dyJ7
వార్నర్ చర్యకు కంగుతిన్న భువీ కూడా తన మాజీ కెప్టెన్‌ను హగ్ చేసుకున్నాడు. ఇదంతా రెండు జట్ల ఆటగాళ్లు , ఉప్పల్ లో అప్పుడప్పుడే వస్తూ సీట్లలో కూర్చుంటున్న వేలాది ప్రేక్షకుల మధ్య జరిగింది. ఈ వీడియోను ఐపీఎల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. ‘దిస్ విజువల్ ఈజ్ ఆల్’ సన్ రైజర్స్, ఢిల్లీల జెర్సీల రంగులు కలిసేలా లవ్ సింబల్ లను అటాచ్ చేసింది.
ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియో చూశాక ఆరెంజ్ ఆర్మీ అభిమానుల కళ్లల్లో తెలియకుండానే నీళ్లు తిరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా అభిమానులే ఈ పోస్ట్ కింద కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. వార్నర్ - భువీ కలిసి సన్ రైజర్స్ తరఫున 2014 నుంచి 2021 వరకూ ఆడారు. వార్నర్ కెప్టెన్సీలో భువీ మెరుగైన ప్రదర్శనలు చేశాడు. సన్ రైజర్స్ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్ల రికార్డులు వీళ్ల పేరిటే ఉన్నాయి. 2016, 2017, 2019 లో వార్నర్ ఆరెంజ్ క్యాప్ లు గెలుపొందగా 2016, 2017లో భువీ పర్పుల్ క్యాప్ విన్నర్ గా ఉన్నాడు.
వార్నర్ కు సన్ రైజర్స్ తో ఎంత అనుబంధముందో ఉప్పల్ తో కూడా అంతే అనుబంధముంది. ఉప్పల్ లో 31 మ్యాచ్ లు ఆడిన వార్నర్.. 1,602 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలున్నాయి. సుమారు 8 ఏండ్ల పాటు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఉన్న వార్నర్.. ఎస్ఆర్‌హెచ్ అభిమానులకు ఎంతగా కనెక్ట్ అయ్యాడో సోషల్ మీడియా ఖాతాలు ఉన్న ప్రతిఒక్కరికీ తెలుసు. మనవాడు కాకపోయినా మనవాడి కంటే మిన్నగా వార్నర్.. సన్ రైజర్స్ అభిమానులతో కలిసిసోయాడు.