India vs Sri Lanka T20: సిరీస్ నుంచి సంజూ ఔట్! జితేశ్ శర్మతో రిప్లేస్ చేస్తున్న బీసీసీఐ!
India vs Sri Lanka T20: శ్రీలంకతో రెండో టీ20కి ముందు టీమ్‌ఇండియాకు షాక్! వికెట్ కీపర్ సంజూ శాంసన్ గాయపడ్డాడు. పూర్తి సిరీసుకు దూరమయ్యాడు.
India vs Sri Lanka T20:
శ్రీలంకతో రెండో టీ20కి ముందు టీమ్‌ఇండియాకు షాక్! వికెట్ కీపర్ సంజూ శాంసన్ గాయపడ్డాడు. పూర్తి సిరీసుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో విదర్భ వికెట్ కీపర్ జితేశ్ శర్మను ఎంపిక చేసినట్టు బోర్డు తెలిపింది.
వాంఖడే వేదికగా జరిగిన తొలి టీ20లో బౌండరీ సరిహద్దు వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా సంజూ శాంసన్ గాయపడ్డాడు. అతడి ఎడమ మోకాలికి గాయమైంది. 'అతడిని స్కానింగ్ కోసం ఆస్పత్రికి తరలించాం. ముంబయిలోని బీసీసీఐ వైద్య బృందం అతడికి విశ్రాంతి అవసరమని సూచించింది. వారి అభిప్రాయం మేరకు ఎన్‌సీయేకు పంపించాం. సెలక్షన్ కమిటీ సంజూ శాంసన్ స్థానంలో జితేశ్ శర్మను ఎంపిక చేసింది' అని బీసీసీఐ ప్రకటించింది.
దేశవాళీ క్రికెట్లో జితేశ్ శర్మకు అనుభవం ఉంది. ప్రస్తుతం విదర్భకు వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. మిడిలార్డర్లో వచ్చి బంతిని బలంగా బాదగలడు. ఇండియన్ ప్రీమియర్ లీగులో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో విధ్వంసాలు సృష్టించడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అరంగేట్రం మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 17 బంతుల్లోనే 26 బాదేసి ఔరా అనిపించాడు. 12 మ్యాచులాడి 10 ఇన్నింగ్సుల్లో 234 పరుగులు సాధించాడు. దిల్లీ క్యాపిటల్స్‌పై చేసిన 44 (34 బంతుల్లో) టాప్ స్కోర్. ఇప్పటికే రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ టీ20 జట్టులో లేకపోవడంతో జితేశ్‌కు అవకాశం దక్కింది. పైగా 5, 6 స్థానాల్లో వచ్చి హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉంది.
2014, ఫిబ్రవరి 27న జితేశ్ విదర్భ తరఫున లిస్ట్-ఏల్లో అరంగేట్రం చేశాడు. 2013-14 సీజన్లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. 2018-19 విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచుల్లోనే 298 పరుగులు చేశాడు. తన జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ప్రదర్శన నచ్చడంతో గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది రంజీల్లోనూ అడుగుపెట్టనున్నాడు.
NEWS - Sanju Samson ruled out of the remainder of T20I series.
— BCCI (@BCCI) January 4, 2023
The All-India Senior Selection Committee has named Jitesh Sharma as replacement for Sanju Samson.
More details here - https://t.co/0PMIjvONn6 #INDvSL @mastercardindia
View this post on Instagram