అన్వేషించండి
Advertisement
India vs South Africa: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ చరిత్ర , వన్డే సిరీస్ టీమిండియా కైవసం
India vs South Africa 3rd ODI Highlights: సఫారీ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. 2018 తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ గెలిచి రికార్డు సృష్టించింది.
సఫారీ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. 2018 తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ గెలిచి రికార్డు సృష్టించింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఘన విజయంతో భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్ దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్... సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. తిలక్ వర్మ కూడా అర్ధ శతకంతో సత్తా చాటడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. అనంతరం 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 78 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి... వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. సాయి సుదర్శన్-రజత్ పాటిదార్ ఓపెనర్లుగా బరిలోకి దిగి టీమిండియాకు పర్వాలేదనిపించే ఆరంభం ఇచ్చారు. ఉన్నంతవరకూ ధాటిగా బ్యాటింగ్ చేసిన రజత్ పాటిదార్ 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సుతో 22 పరుగులు చేసి అవుటయ్యాడు. తొలి రెండు వన్డేల్లో అర్ధ శతకాలతో చెలరేగిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో 49 పరుగుల వద్ద టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ కె.ఎల్. రాహుల్‌తో కలిసి సంజు శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కె.ఎల్. రాహుల్ 35 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో 101 పరుగుల వద్ద భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. రాహుల్ అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్‌వర్మతో కలిసి సంజు శాంసన్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరూ సౌతాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జట్టు స్కోరును ముందుకు నడిపించారు. తొలి రెండు మ్యాచుల్లో నిరాశ పరిచిన సంజు శాంసన్ కీలకమైన ఈ మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు.
సంజు శాంసన్.. సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. నాలుగో వికెట్‌కు శాంసన్-తిలక్ వర్మ ఇద్దరూ 116 పరుగులు జోడించారు. ఆ తర్వాత 77 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి అవుటయ్యాడు. తిలక్ వర్మను మహరాజ్ అవుట్ చేశాడు. తిలక్ వర్మ అవుటైనా సంజు శాంసన్ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. 110 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సులతో సెంచరీ సాధించాడు. అనంతరం 114 బంతుల్లో 108 పరుగులు చేసి సంజు శాంసన్ అవుటయ్యాడు. అక్షర్ పటేల్ మూడు బంతుల్లో ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. చివర్లో రింకూసింగ్ 27 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 38 పరుగులు, వాషింగ్టన్‌సుందర్ 9 బంతుల్లో 14 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రింక్స్ మూడు, బర్గర్ 2, విలియమ్స్ ఒక వికెట్ తీశారు.
అనంతరం 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. మరోసారి ప్రొటీస్‌కు మంచి ఆరంభమే దక్కింది. హెండ్రిక్స్, జోర్జీ తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ఈ జోడిని అర్ష్‌దీప్‌సింగ్ విడదీశాడు. రెండో వన్డేలో శతకంతో చెలరేగిన జోర్జీ ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ను భయపెట్టాడు. 87 బంతుల్లో 81 పరుగులు చేసి సౌతాఫ్రికాను విజయం దిశగా నడిపించాడు. కానీ జోర్జీ మినహా సఫారీ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ మాక్రమ్ మాత్రమే 36 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాటర్లందరూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో సఫారీ జట్టు 218 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఆవేశ్ ఖాన్ 2, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సంజు శాంసన్ ఎంపికయ్యాడు. తొలి వన్డేలో అయిదు వికెట్లు, రెండు వన్డేలో ఒకటి... మూడో వన్డేలో నాలుగు వికెట్లతో మొత్తం 10 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion