IND vs PAK, Asia Cup 2023: అబ్ ఆయేగా మజా - దాయాదుల పోరు అంటేనే లొల్లి మినిమం ఉంటది - గత చరిత్రా ఘనమే
ఆసియా కప్ మొదలై నాలుగు రోజులు కావొస్తున్నా ఎక్కడా ఉలుకు పలుకు లేకుండా చప్పగానే సాగుతోంది. కానీ టోర్నీకి నేడే అసలైన ఊపు రానుంది.
IND vs PAK, Asia Cup 2023: నాలుగు రోజులైంది ఆసియా కప్ మొదలై.. పాకిస్తాన్ నేపాల్‌ను ఓడించింది. శ్రీలంక బంగ్లాదేశ్‌పై గెలిచింది. అయినా అవి ఏదో నామ్ కే వాస్తే మ్యాచ్‌ల మాదిరే జరిగాయి. ఇంకా చెప్పుకుంటే ఈ రెండు మ్యాచ్‌లు దాదాపు ఖాళీ స్టేడియాల్లోనే జరిగాయి. ఆసియా కప్ ఆగస్టు 31నే మొదలైనా దానిపై చడీచప్పుడు లేదు. కానీ నేటితో ఆ కరువు తీరబోతుంది. టీవీ, మొబైల్స్ టీఆర్పీ రేటింగులు నింగిని తాకేలా.. అభిమానుల హోరులో పల్లెకెలె స్టేడియం హోరెత్తేలా, ఆటగాళ్ల మధ్య అసలైన టగ్ ఆఫ్ వార్ జరిగేలా.. బంతికి బ్యాట్‌కు సమానమైన సమరం నేడు తెరలేవనుంది. భారత్ - పాక్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది.
భారత్ - పాక్ మ్యాచ్ అంటేనే ఎమోషన్స్ పీక్స్‌లో ఉంటాయి. రాజకీయ, సరిహద్దు కారణాల రీత్యా దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో ఏడాదికో రెండేండ్లకో ఐసీసీ, ఆసియా కప్‌లలో జరిగే మ్యాచ్‌లే దిక్కు అవుతున్నాయి. ఆడేది తక్కువ మ్యాచ్‌లే అయినా ఆటగాళ్లు అందించే వినోదం అంతా ఇంతా కాదు. మరి ఇంత హై ఓల్టేజ్ మ్యాచ్‌లో వాదాలు, వివాదాలు లేకుంటే ఎలా..? గతంలో ఇటువంటి వాటికి లోటే లేదు. అందులో మచ్చుకు కొన్ని ఇవిగో..
మియందాద్ వర్సెస్ కిరణ్ మోరె..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ - పాక్ మ్యాచ్. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తుండగా క్రీజులో జావేద్ మియందాద్. వికెట్ల వెనుకాల కిరణ్ మోరె వికెట్ కీపర్. టెండూల్కర్ బౌలర్. 26వ ఓవర్‌లో సచిన్ వేసిన బంతి మియాందాద్ ప్యాడ్లకు తాకింది. టెండూల్కర్‌తో పాటు మోరె కూడా ఔట్ కోసం అప్పీల్ చేశారు. అంపైర్ నిరాకరించడంతో సచిన్, మోరె నిరాశగా ఎవరిస్థానాల్లోకి వాళ్లు వెళ్లారు. సచిన్ తర్వాత బంతిని విసిరేందుకు సిద్ధంగా ఉండగా.. మియందాద్, సచిన్‌ను ఆపి మరి మోరెతో వాగ్వాదానికి దిగాడు. అదే బంతికి పరుగు తీయబోయి ఆగాడు. కానీ ఆ తర్వాత క్రీజు వద్దకు వెళ్లి మోరెను హేళన చేస్తూ జంప్‌లు చేశాడు. నాటి సారథి అజారుద్దీన్ దీనికి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత అంపైర్లు కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మియందాద్‌ను శ్రీనాథ్ బౌల్డ్ చేశాడు.
వెంకటేశ్ ప్రసాద్ వర్సెస్ అమీర్ సోహైల్..
1996 వన్డే వరల్డ్ కప్ లో వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ చేస్తుండగా పాక్ బ్యాటర్ అమీర్ సోహైల్ ఓ బంతిని ఆఫ్ సైడ్ బౌండరీకి తరలించాడు. అక్కడితో ఊరుకోక ప్రసాద్‌ను చూస్తూ.. ‘అదిగో చూడు. నువ్వు వేసిన బాల్ బౌండరీకి ఎలా వెళ్తుందో చూడు..’ అన్నట్టుగా బ్యాట్ పెట్టి మరీ ప్రసాద్‌ను అవమానించాడు. కానీ తర్వాత బంతికే ప్రసాద్.. అమీర్ పనిపట్టాడు. ఆ బంతికి మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది.
The Attitude, Aggression 🔥🔥
— Michael Scofield (@ScofieldReddy) October 14, 2021
Gambhir vs K Akmal #HappyBirthdayGautamGambhir #HappyBirthdayGG #gautamgambhir pic.twitter.com/7JumWm18Y4
గంభీర్ వర్సెస్ పాకిస్తాన్..
మిగిలిన భారత ఆటగాళ్లతో పోలిస్తే కాస్త దూకుడుగా ఉండే గౌతం గంభీర్.. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటేనే రెచ్చిపోయేవాడు. క్రీజులోనే కాదు.. ఫీల్డ్‌లో పాక్ ఆటగాళ్లతో వాగ్వాదానికి కూడా ముందుండేవాడు. షాహిద్ అఫ్రిది, కమ్రన్ అక్మల్‌తో అతడు పలుమార్లు వాగ్వాదానికి దిగాడు. 2007లో భారత్ - పాక్ మ్యాచ్‌లో భాగంగా అఫ్రిది వేసిన ఓ బంతిని గంభీర్ బౌండరీగా మలచడంతో వాగ్వాదం మొదలైంది. కయ్యాలమారి అఫ్రిది.. తన బౌలింగ్‌లో ఫోర్ కొట్టినందుకు గొడవకు దిగాడు. గంభీర్ ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. అంపైర్‌తో గొడవ సద్దుమణిగింది.
ఆసియా కప్‌లో కూడా..
2010 ఆసియా కప్‌లో భాగంగా.. గంభీర్‌తో పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ గొడవకు దిగాడు. సయీద్ అజ్మల్ వేసిన బంతిని ఆడే క్రమంలో గొడవకు పునాది పడింది. బంతి బ్యాట్ కు తాకిందని పాక్ ఫీల్డర్లు అప్పీల్ చేశారు. కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కానీ వికెట్ల వెనుక అక్మల్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. అసలే ఫైర్ మీదుండే గంభీర్‌కు ఇది మరింత చికాకు తెప్పించింది. ఇద్దరు కొట్టుకునే స్థాయిదాకా వెళ్లారు. కానీ గంభీర్‌ను ధోని శాంతింపజేయగా.. పాక్ ఆటగాళ్లు అక్మల్‌ను పక్కకు తీసుకెళ్లడంతో అంపైర్లు ఊపిరి పీల్చుకున్నారు.
భజ్జీ వర్సెస్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్..
గంభీర్ - అక్మల్‌లు వాదులాడుకున్న మ్యాచ్‌లోనే టీమిండియా టర్బోనేటర్ హర్భజన్ సింగ్.. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయభ్ అక్తర్ మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అక్తర్ బౌలింగ్‌లో భజ్జీ భారీ సిక్సర్ కొట్టడం పాక్ పేసర్‌కు కోపం తెప్పించింది. కావాలని ఉద్దేశపూర్వకంగానే అక్తర్ గొడవకు దిగాడు. ‘నీ యవ్వ తగ్గేదేలే’ అన్నట్టుగా భజ్జీ కూడా మాటకు మాట అన్నాడు. చివర్లో భజ్జీ.. మహ్మద్ అమీర్ బౌలింగ్ లో భారీ సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ తర్వాత అక్తర్ వైపు కోపంగా చూశాడు. అక్తర్ మాత్రం.. ‘చాలు చాలులే ఇక వెళ్లు’ అన్నట్టుగా సైగ చేశాడు.
Asia Cup 2010 #INDvPAK Match At Dambulla was lit
— 🥳🥳🥳🥳🥳 (@MayankAnand014) September 18, 2018
India Chased Down 267 Batting Second on a Tuff Wicket against a Superb Bowling attack@GautamGambhir 83 (97)@msdhoni 56 (71)
& @harbhajan_singh with Second Last Ball Six to seal it
Bhajji Vs Akhtar 😂👌
Gambhir Vs Akmal 🔥 pic.twitter.com/Jw9leBBycP
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial