IND vs BAN 1st ODI: రేపే భారత్- బంగ్లా తొలి వన్డే- సీనియర్లు, కుర్రాళ్ల మేళవింపుతో బరిలోకి భారత్!
IND vs BAN 1st ODI: టీమిండియా రేపట్నుంచి బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో మొదటి మ్యాచ్ ఆడనుంది.
IND vs BAN 1st ODI: టీమిండియా రేపట్నుంచి బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో మొదటి మ్యాచ్ ఆడనుంది. భారత్ కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. బంగ్లాకు లిటన్ దాస్ కెప్టెన్సీ చేయనున్నాడు.
న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్న సీనియర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు ఈ సిరీస్ కు అందుబాటులోకి వచ్చారు. అలానే బంగ్లాతో వన్డే మ్యాచులకు టీం మేనేజ్ మెంట్ కొత్త కుర్రాళ్లకు అవకాశమిచ్చింది. రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, కుల్దీప్ సేన్ లాంటి ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నారు. సీనియర్లు, కుర్రాళ్ల మేళవింపుతో భారత్ కాగితంమీద బలంగా కనిపిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ నకు సన్నాహకంగా ఈ మ్యాచులను ఉపయోగించుకోనున్నారు. మరి అందులో ఎంతమేర సఫలీకృతమవుతారో చూడాలి.
ఓపెనింగ్ వారిద్దరేనా!
బంగ్లాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. టెస్టులు, టీ20లు ఆడని ధావన్ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. రానున్న ప్రపంచకప్ లో అతను కీలకం కానున్నాడు. కివీస్ పర్యటనలో ఓ మోస్తరుగా రాణించిన ధావన్.. ఈ సిరీస్ లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. పోటీగా కుర్రాళ్లు సిద్ధంగా ఉన్న తరుణంలో శిఖర్ మరింతగా రాణించాల్సిన అవసరముంది. వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ దిగడం ఖాయమే. నాలుగో స్థానంలో న్యూజిలాండ్ సిరీస్ లో రాణించిన శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అయితే రాహుల్ ను ఆడించాలనుకుంటే అయ్యర్ ను పక్కన పెట్టాల్సిందే. ఆల్ రౌండర్ల కోటాలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లు ఉన్నారు. వీరిద్దరిలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.
భారత్ కు పంత్ 'బెంగ'
టీమిండియాను వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఇతనికి ఎన్ని అవకాశాలిచ్చినా ఉపయోగించుకోలేక పోతున్నాడు. తాజాగా కివీస్ పర్యటనలోనూ దారుణంగా విఫలమయ్యాడు. అయినప్పటికీ పంత్ గత రికార్డులు దృష్టిలో పెట్టుకుని జట్టు యాజమాన్యం, కోచ్, కెప్టెన్ మద్దతుగా నిలుస్తున్నారు. అయితే పంత్ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. పేలవ షాట్ లతో పెవిలియన్ చేరుతున్నాడు. అయినా అతనిపై మరోసారి నమ్మకముంచి బంగ్లాతో సిరీస్ కు ఎంపిక చేశారు. ఇందులో అయినా రిషభ్ రాణిస్తాడో ఎప్పటిలా నిరాశపరుస్తాడో చూడాలి.
బౌలింగ్ దళం ఏం చేస్తుందో!
టీమిండియా బౌలింగ్ లో బుమ్రా లేకపోవడం పెద్ద లోటనుకుంటే.. ఇప్పుడు గాయంతో మరో సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ లు భారత్ ఫాస్ట్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. వీరిలో సిరాజ్ ఒక్కడే మిగిలినవారి కన్నా కొంచెం సీనియర్. మిగతా వారిలో చాహర్, శార్దూల్ కొంచెం పర్లేదు. మిగతా ఇద్దరూ ఇప్పుడిప్పుడే జట్టులోకి వచ్చారు. మరి వీరు ఎలా రాణిస్తారో చూడాలి. ఇక స్పిన్ భారాన్ని అక్షర్, సుందర్, షాబాజ్ అహ్మద్ లు మోయనున్నారు.
Snapshots from #TeamIndia's first training session in Bangladesh ahead of the three-match ODI series.#BANvIND
— BCCI (@BCCI) December 2, 2022
📸 - BCB pic.twitter.com/AXncaYWeup
బంగ్లా ప్రమాదమే
సొంత గడ్డపై బంగ్లాదేశ్ ఎప్పుడూ ప్రమాదకరమైన జట్టే. వన్డేల్లో ఆ జట్టుకు మంచి ఆటగాళ్లు ఉన్నారు. అయితే కెప్టెన్ గా ఎంపికైన తమీమ్ ఇక్బాల్, ఫామ్ లో ఉన్న బౌలర్ తస్కిన్ అహ్మద్ లు దూరమవడం ఆ జట్టుకు లోటే. తమీమ్ స్థానంలో లిటన్ దాస్ బంగ్లా జట్టును నడిపించనున్నాడు. అతను మంచి టచ్ లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ లో భారత్ పై లిటన్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ను టీమిండియా అభిమానులు అంత త్వరగా మరచిపోలేరు. దాస్ తో పాటు అనాముల్ హక్, షకీబుల్ హసన్, ముష్పికర్ రహీం, మహమ్మదుల్లా, ఆఫిఫ్ హొస్సేన్, నురుల్ హసన్ లాంటి బ్యాట్స్ మెన్ తో బలంగానే ఉంది. అలాగే బౌలింగ్ లో ముస్తాఫిజర్ రెహ్మాన్, హసన్ మహమూద్, హసన్ అలీ లాంటి మంచి బౌలర్లు ఆ జట్టుకు అందుబాటులో ఉన్నారు.
తమదైన రోజున ఎంత బలమైన జట్టునైనా మట్టికరిపించడం బంగ్లాదేశ్ నైజం. కాబట్టి టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సిందే.
బంగ్లాదేశ్ జట్టు
అనాముల్ హక్, లిటన్ దాస్(కెప్టెన్), షకీబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హుస్సేన్, మహ్మదుల్లా, నురుల్ హసన్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహ్మద్, ఎబాదోత్ హుస్సేన్, యాసిర్ అలీ, నజ్ముల్ హోస్సాన్, నసుమ్ అహ్మద్.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, రజత్ పటీదార్, కుల్దీప్ సేన్ , షాబాజ్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్.
Litton Kumer Das to lead Bangladesh in ODI series against India.#BCB | #Cricket | #BANvIND pic.twitter.com/3ZdGrdx3w6
— Bangladesh Cricket (@BCBtigers) December 2, 2022