India Tour Of England: భారత్, ఇంగ్లాండ్ జట్లకు ఆడిన క్రికెటర్ ఎవరు? అతడి కుమారుడు సైతం భారత్‌కు కెప్టెన్‌గా సేవలు
భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ 2025 నుండి పటౌడీ ట్రోఫీ పేరును "సచిన్-ఆండర్సన్ ట్రోఫీ"గా మార్చారు. ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటౌడీ ఇరు జట్లకూ ఆడిన ఏకైక క్రికెటర్.

India Tour of England: టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జూన్ 20వ తేదీన ప్రారంభం కానుంది. ఈసారి ఈ సిరీస్‌లో గెలుపు ఓటముల కోసం జరిగే సిరీస్ మాత్రమే కాదు, క్రికెట్ ప్రపంచంలో చారిత్రాత్మక మార్పులకు సాక్ష్యంగా ఈ సిరీస్ నిలుస్తుంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB), భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) మధ్య జరిగిన చర్చల తర్వాత, ఈ సిరీస్‌లో అందించే “పటౌడి ట్రోఫీ” పేరు మార్చారు. తాజాగా జరగనున్న సిరీస్ ట్రోఫీకి క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్, ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ పేర్లు పెట్టనున్నారు. ఈ సిరీస్‌లో విజేతగా నిలిచే జట్టు “టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ”ని అందుకోనుంది. ఈ టెస్ట్ సిరీస్‌కు క్రికెట్ గాడ్ సచిన్, ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ అండర్సన్ పేరు పెట్టడం విశేషం.
పటౌడి ట్రోఫీ 2007లో ప్రారంభమైంది. అప్పటి నుండి ఇంగ్లాండ్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌ను ఇదే పేరుతో పిలుస్తున్నాం. 18 సంవత్సరాలలో 5 సిరీస్‌ల జరిగాయి. తాజాగా జరగనున్న ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రోఫీ పేరు పద్దెనిమిది సంవత్సరాల తరువాత మార్చారు.
క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక రికార్డు
పటౌడి ట్రోఫీ పేరు పెట్టిన అనంతరం చారిత్రాత్మక పటౌడి కుటుంబానికి చెందిన వ్యక్తి ఇఫ్తిఖర్ అలీ ఖాన్ పటౌడి క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక రికార్డు కలిగి ఉన్నారు. అతను టెస్ట్ క్రికెట్‌లో రెండు దేశాలైన భారత్, ఇంగ్లాండ్ జట్టలకు క్రికెట్ ఆడిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. నవాబ్ పటౌడి సీనియర్‌గా పిలువబడే ఇఫ్తిఖర్ అలీ ఖాన్ పటౌడి, 1932 నుంచి 1934 మధ్య కాలంలో ఇంగ్లాండ్ తరపున 3 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆయన 144 పరుగులు చేశారు. అనంతరం1946లో భారత్ తరపున ఇంగ్లాండ్‌తో 3 టెస్టులు ఆడగా, అతను 55 పరుగులు చేశారు.
అతను ఈ సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఈ సిరీస్‌లో ఇఫ్తిఖర్ అలీ ఖాన్ పటౌడి కెప్టెన్సీలో భారత్ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు వేర్వేరు జాతీయ జట్ల కోసం ఆడిన ఈ రికార్డు మరో ముగ్గురు భారతీయ ఆటగాళ్లకు ఉంది, అయితే ఏ ఆటగాడు కూడా ఇంగ్లాండ్ తరపున ఆడలేదు. ఇంగ్లాండ్, భారత్ జట్ల తరపున టెస్ట్ ఆడిన రికార్డు ఇఫ్తిఖర్ అలీ ఖాన్ పటౌడి పేరిట ఉంది.
అతని కుమారుడే మన్సూర్ అలీ ఖాన్ పటౌడి కూడా భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. భారత క్రికెట్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మన్సూర్ అలీఖాన్ ఒకరు. అతను 1960, 70లలో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించారు. ఈ కాలంలోనే దేశ క్రికెట్‌కు కొత్త గుర్తింపు వచ్చింది. అందుకే 2007 నుంచి భారత్ , ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌ను పటౌడి ట్రోఫీగా నామకరణం చేశారు. తాజాగా ఈ ట్రోఫీని టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీగా మార్చారు.
పటౌడి ట్రోఫీ చరిత్ర..
-పటౌడి ట్రోఫీ పేరిట ఇప్పటివరకు 5 టెస్ట్ సిరీస్‌లు జరిగాయి.
-ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ 3 సార్లు ట్రోఫీని గెలుచుకుంది.
- భారత్ ఒకసారి (2007) విజేతగా నిలిచింది . ఒక సిరీస్ డ్రాగా ముగిసింది.
- విజేతగా నిలిచిన జట్టుకు లభించే ట్రోఫీని జోస్లిన్ బర్టన్ రూపొందించారు. దీన్ని 2012లో లండన్‌లో తొలిసారి ప్రదర్శించారు.
- ఏ జట్టు అయినా పటౌడి ట్రోఫీని శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోవాలంటే వరుస సిరీస్‌లను గెలవాలి. లేక సిరీస్ డ్రాగా ముగిస్తే, గత సిరీస్ విజేతగా నిలిచిన జట్టు వద్దే పటౌడీ ట్రోఫీ ఉంటుంది.





















