WTC 2025-27: టీమిండియాతో టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు ప్రకటన.. రీ-ఎంట్రీ ఇస్తున్న ఆటగాళ్లు!
2025-27 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ను ఇంగ్లాండ్ టూర్ తో భారత్ ఆరంభించనుంది. 45 రోజులపాటు సాగే ఈ సిరీస్ లో భారత్ 5 టెస్టులను ఆడనుంది. ఈ సిరీస్ కు గిల్ తొలిసారి కెప్టెన్సీ వహిస్తున్నాడు.

WTC 2025-27 Cycle Updates: టీమిండియాతో ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు 14 మందితో కూడిన బృందాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టులో పలువురు ఆటగాళ్లు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ముఖ్యంగా జామీ ఒవర్టన్ గాయం నుంచి కోలుకుని ఈ టెస్టుకు అందుబాటులో ఉంటున్నాడు. అలాగే ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో దుమ్ము రేపిన జాకబ్ బెతెల్ కూడా పిలుపు వచ్చింది. వీరి రాకతో ప్లేయింగ్ లెవన్ ఎంపికపై టీమ్ మేనేజ్మెంట్ లో చిన్నగా తలనొప్పి మొదలైంది. వైట్ బాల్ క్రికెట్ లో రెగ్యులర్ ఆటగాడైన ఓవర్టన్ 2022లో న్యూజిలాండ్ పై అరంగేట్రం చేశాడు. ఆ టెస్టులో రెండు వికెట్లతో పాటు 97 పరుగులు చేసి, తాను ఆల్ రౌండర్ నని ఘనంగా చాటాడు. అయితే తొలి టెస్టుకు తను ఫుల్ ఫిట్ నెస్ తో ఉన్నాడా..? లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో తను చేతిలేలి గాయంతో బాధపడ్డాడు. దాని నుంచి ఎప్పుడు కోలుకుని ఫుల్ ఫిట్ గా అవుతాడో క్లారిటీ లేదు. ప్రస్తుతం అతని పరిస్థితిని మెడికల్ టీమ్ అబ్జర్వ్ చేస్తున్నట్లు క్రికెట్ బోర్డు తెలిపింది. ఇక కౌంటీల్లో తనతోపాటే ఆడే మరో పేసర్ గస్ అట్కిన్సన్ ఈ స్క్వాడ్ లోకి గాయం కారణంగా ఎంపికవలేదు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన ఏకైక టటెస్టులో తను తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు.
ఇద్దరు పేసర్లకు చోటు..
భారత్ తో మ్యాచ్ కు మరో ఇద్దరు పేసర్లకు చోటు కల్పించారు. క్రిస్ వోక్స్ తోపాటు బ్రైడెన్ కార్స్ ను జట్టులోకి ఎంపిక చేశారు. అనుభవం కల వోక్స్.. మంచి బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇక కార్స్ కూడా ఆల్ రౌండర్ గా ఇప్పుడిప్పుడే నిరూపించుకుంటున్నాడు. ఇక వోక్స్ రాకతో శామ్ కుక్ డగౌట్ కే పరిమితమయ్యే అవకాశముంది. మరో ఎండ్ లో బెతెల్ రాకతో టాపార్డర్ లో ఒలీ పోప్, ఓపెనర్ జాక్ క్రాలీ స్థానాలకు ముప్పు ఎదురయ్యే అవకాశముంది. తను న్యూజిలాండ్ పై అరంగేట్రం చేసి 52కిపైగా సగటుతో మూడు అర్థ సెంచరీలు సాధించాడు. అయితే ఇటీవలే జరిగిన జింబాబ్వేపై టెస్టులో ఈ ఇద్దరు సెంచరీలు చేయడం ఊరట. అనుభవానికి పెద్ద పీట వేస్తే, ఈ ఇద్దరికే తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. ఇక ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ హెడీంగ్లీతో జరుగనున్న సంగతి తెలిసిందే.
భారత్ తో తొలి టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు స్క్వాడ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రుక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓల్లి పోప్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జాష్ టంగ్, క్రిస్ వోక్స్.



















