ODI World Cup 2023: టీమిండియాతో అంత ఈజీ కాదు, కివీస్ స్టార్ బౌలర్ వ్యాఖ్యలు
World Cup Semi Final Match News: న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ టీం ఇండియాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. నాకౌట్ మ్యాచ్ ఆడబోతున్న భారత్‌ను ఎదుర్కోవడం అతిపెద్ద సవాల్ అన్నాడు.
New Zealand vs India Semifinal Match News: ప్రపంచకప్‌లో సెమీఫైనల్ బెర్తులు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో క్రికెట్ అభిమానులు నాకౌట్ మ్యాచ్‌ల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్.. భారత్ తలపడనుండడం దాదాపుగా ఖరారైనట్లే. ఈ ప్రపంచకప్‌లో భీకర ఫామ్‌లో అజేయంగా ముందుకు సాగుతున్న టీమిండియాతో కివీస్ నాకౌట్‌లో తలపడనుంది. 2019 ప్రపంచకప్‌లో కివీస్ చేతిలో ఓడిన టీమిండియా ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ అభిమాని కోరుకుంటున్నాడు. ఈ దశలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోట్లాది మంది అభిమానుల మద్దతుతో సొంతగడ్డపై నాకౌట్ మ్యాచ్ ఆడబోతున్న భారత్‌ను ఎదుర్కోవడం అతిపెద్ద సవాల్ అని బౌల్డ్ అన్నాడు. తిరుగులేని ఫామ్‌లో ఉన్న రోహిత్ సేనను ఆపడం అంత తేలికేం కాదని ఒప్పుకున్నాడు. టీమిండియా ప్రస్తుతం చాలా సానుకూలంగా ఆడుతోందని.. కచ్చితంగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ అందరిలో ఉత్కంఠ రేపబోతోందని అన్నాడు. ప్రపంచకప్ సెమీస్‌లో ఎలా టీమిండియాను ఎలా ఎదుర్కోవాలో తమకు స్పష్టమైన వ్యూహం ఉందని కూడా చెప్పాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీస్ నవంబర్ 15న జరగనుంది. లీగ్ దశలో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించింది. అయితే నాకౌట్ బలహీనత టీమిండియాను వేధిస్తోంది.
2019 సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. న్యూజిలాండ్ విధించిన 240 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక 221 పరుగులకే కుప్పకూలింది. 18 పరుగుల తేడాతో ఓడిపోయి కోహ్లీ సేన ఇంటిదారిపట్టింది. 72 బంతుల్లో 50 పరుగులు చేసిన ధోని రనౌట్ కావడంతో మ్యాచ్ కివీస్ గెలిచింది. ఆ పరాజయంతో ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో సహా టీమిండియా క్రికెటర్లు కంటతడి పెట్టారు. కోట్లాది మంది అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇప్పుడీ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. ఈ మ్యాచ్‌లో గెలిచి 2019 ప్రపంచకప్ పరాభవానికి లెక్క సరిచేయాలని కోట్లాది మంది భారత అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక శ్రీలంకతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లేలా..అఫ్గాన్‌కు సెమీస్ ద్వారాలు మూసుకుపోయేలా శ్రీలంకపై ఏకపక్ష విజయం సాధించింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు రాణించడంతో లంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. అనంతరం డేవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డేరిల్ మిచెల్ రాణించడంతో 23.2 ఓవర్లలో అయిదు వికెట్లే కోల్పోయి కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. దాదాపు 160 బంతులు మిగిలి ఉండగానే కివీస్ విజయం సాధించడంతో దాదాపుగా పాక్, అఫ్గాన్ సెమీస్ అవకాశాలు ముగిసినట్లే కనిపిస్తోంది. ఇంగ్లండ్‌పై పాకిస్థాన్, దక్షిణాఫ్రికాపై అఫ్గాన్ భారీ విజయం సాధించి అద్భుతం సృష్టిస్తే తప్ప న్యూజిలాండ్ సెమీస్ చేరడం ఖాయమైనట్లే.
శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించడంతో పాక్ సెమీస్ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. శ్రీలంకపై కివీస్ 160 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి పాకిస్థాన్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఒకవేళ ఇప్పటికీ పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి. ఆ అద్భుతం ఏంటంటే పాకిస్థాన్.. ఇంగ్లండ్ మధ్య శనివారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత పాక్ బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో భారీ విజయం సాధించాలి. లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే 284 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాలి. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే పాకిస్థాన్ ఇప్పటివరకూ చేయని అద్భుతమే చేయాలి.