Cheteshwar Pujara: సైలెన్స్ బ్రేక్ చేసిన పుజారా! వేటు వేయడంపై ట్విటర్లో పోస్ట్!
Cheteshwar Pujara: టీమ్‌ఇండియా నుంచి తప్పించడంపై చెతేశ్వర పుజారా స్పందించాడు. తనదైన రీతిలో సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు.
Cheteshwar Pujara:
టీమ్‌ఇండియా నుంచి తప్పించడంపై చెతేశ్వర పుజారా స్పందించాడు. తనదైన రీతిలో సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. వెస్టిండీస్ సిరీస్‌కు ఎంపిక చేయకపోయినప్పటికీ తానెప్పుడూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు. బ్యాటు, బంతి, లవ్ సింబల్స్ పెట్టాడు.
వెస్టిండీస్ సిరీస్‌కు సెలక్టర్లు రెండు రోజుల క్రితమే జట్టును ప్రకటించారు. కొన్ని కీలక మార్పులు చేశారు. యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఒకప్పుడు వెన్నెముకగా నిలిచిన చెతేశ్వర్ పుజారాను జట్టులోంచి తప్పించారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో అతడు అంచనాల మేరకు రాణించలేదు. మిడిలార్డర్లో వికెట్లను నిలపాల్సిన బాధ్యత తీసుకోలేదు. దాంతో టీమ్‌ఇండియా తక్కువ స్కోరుకే రెండు సార్లూ ఆలౌటైంది. దాంతో అతడిని విండీస్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. బహుశా అతడిక పునరాగమనం చేయడం కష్టమే!
సాధారణంగా పుజారా అతి తక్కువగా మాట్లాడతాడు. సెలక్షన్ కమిటీ, జట్టు యాజమాన్యం నిర్ణయాలపై బహిరంగంగా మాట్లడడు. తనకు అప్పగించిన పనిచేయడమే లక్ష్యంగా ఉంటాడు. మీడియా ముందు అనవసరంగా స్పందించడు. ఈసారీ అలాగే చేశాడు. మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ట్విటర్లో పోస్టు చేశాడు. దానికి ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. కేవలం బ్యాటు, బంతి, లవ్ ఎమోజీలను పెట్టాడు. అంటే మీరు ఎంపిక చేసినా.. చేయకపోయినా నేను ఆడటాన్ని ప్రేమిస్తూనే ఉంటానని చెప్పకనే చెప్పాడు.
🏏 ❤️ pic.twitter.com/TubsOu3Fah
— Cheteshwar Pujara (@cheteshwar1) June 24, 2023
నయావాల్ చెతేశ్వర్ పుజారాను జట్టులోంచి తప్పించడం ఇదే మొదటి సారి కాదు. దక్షిణాఫ్రికా సిరీసు సమయంలోనూ ఇలాగే చేశారు. 40-50 బంతులాడీ 10 పరుగులైనా చేయకపోవడం, స్ట్రైక్ మరీ తక్కువగా ఉండటంతో అతడిని తొలగించారు. అయితే కౌంటీ క్రికెట్లో సెంచరీలు బాదేసి మళ్లీ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పుడు విండీస్ సిరీసుకు తీసుకోకపోవడంతో దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. వెస్ట్‌జోన్ నుంచి దులీప్ ట్రోఫీ ఆడనున్నాడు. మొదటి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తేనే తిరిగి అతడు పునరాగమనం చేయడం సాధ్యమవుతుంది.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో పుజారా కేవలం 35 పరుగులే చేశాడు. తొలి ఇన్నింగ్సులో 14, రెండో ఇన్నింగ్సులో 27తో నిరాశపరిచాడు. పైగా అతడికి 35 ఏళ్లు నిండాయి. అతడిని తప్పించడంతో మూడో స్థానంలో ఎవరో ఒక యువ ఆటగాడు ఆడాల్సిందే. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేస్తున్నాడు. సందర్భాన్ని బట్టి రాణిస్తున్నాడు. అయితే ఎడమచేతి వాటం బ్యాటర్ యశస్వీ జైశ్వాల్‌ను రోహిత్‌కి జోడీగా ఆడిస్తే గిల్ కీలకమైన మూడో ప్లేస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కె), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైశ్వాల్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వి), ఇషాన్ కిషన్ (వి), హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్