Pandya vs Pooran: నా బౌలింగ్‌లో చితక బాదు! పూరన్‌కు పాండ్య సవాల్.. రిప్లై మామూలుగా లేదు!
Pandya vs Pooran: టీమ్‌ఇండియాతో సిరీసులో నికోలస్ పూరన్ రెచ్చిపోయాడు. అయితే హార్దిక్ పాండ్య అతడికి సవాల్ విసిరాడని రీసెంట్‌గా తెలిసింది.
Pandya vs Pooran:
టీమ్‌ఇండియాతో సిరీసులో నికోలస్ పూరన్ (Nicholas Pooran) రెచ్చిపోయాడు. వరుస సిక్సర్లు, బౌండరీలతో చెలరేగాడు. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. దాదాపుగా విండీస్ గెలిచిన అన్ని మ్యాచుల్లోనూ అతడే కీలకంగా మారాడు. తన బౌలింగ్‌ను చితకబాదితే బాదనివ్వండి అని హార్దిక్ పాండ్య (Hardik Pandya) అతడికి సవాల్ విసిరాడని రీసెంట్‌గా తెలిసింది. అందుకు తగ్గట్టే నిక్ ఆఖరి టీ20లో విజృంభించాడు. 3-2తో సిరీస్ గెలిపించాడు.
ఐదు టీ20ల సిరీసులో నికోలస్ పూరన్ అద్భుతంగా ఆడాడు. మొత్తం సిరీసులో 141.94 స్ట్రైక్‌రేట్, 35.20 సగటుతో విజృంభించాడు. 11 బౌండరీలు, 11 సిక్సర్ల సాయంతో 176 పరుగులు చేశాడు. తొలి రెండు మ్యాచుల్లో అతడి ధాటికి తట్టుకోలేని పాండ్య సేన 0-2తో వెనకబడింది. అయితే మూడో మ్యాచులో టీమ్‌ఇండియా పుంజుకుంది. అందుకు కారణం నికోలస్‌ను అడ్డుకోవడమే. ఆ తర్వాతే హార్దిక్ పాండ్య అతడికి సవాల్ విసిరాడు. తన బౌలింగ్ చితక బాదితే ఇబ్బందేమీ లేదన్నట్టుగా మాట్లాడాడట.
'అనువు, ఒకవేళ నికోలస్ పూరన్ చితకబాదాలని అనుకుంటే నా బౌలింగ్‌లో ఆ పని చేయొచ్చు. మా ప్లాన్ అదే. నేను అలాంటి పోటీని ఇష్టపడతాను. లైన్ అండ్ లెంగ్త్ కుదరకపోతే పూరన్ అడ్వాంటేజీ తీసుకుంటాడని తెలుసు. నాలుగో మ్యాచులో అతడు చితకబాదుతాడనే అనుకున్నాను. అలాగే వికెట్ ఇస్తాడని భావించాను' అని హార్దిక్ పాండ్య అన్నాడు.
నికోలస్ పూరన్ ఐదో టీ20లో బాగా ఆడటం వల్లే వెస్టిండీస్ గెలిచింది. 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ పోటీలో అతడు 35 బంతుల్లోనే 47 పరుగులు సాధించాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యకు బదులిచ్చినట్టుగానే అతడు ఇన్‌స్టాలో స్టోరీ పెట్టాడు. రెండు సిక్సర్లు బాదుతున్న వీడియోను పోస్టు చేశాడు.
'నేను క్రీజులోకి వచ్చినప్పుడే మూమెంటమ్ చేజారింది. పరిస్థితులను అనుకూలంగా మలచలేకపోయాను. సవాళ్లు ఎదుర్కోవడం, మెరుగయ్యేందుకు ప్రయత్నించడాన్ని మేం నమ్ముతాం. ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. మా బృందంలో కుర్రాళ్లు ఎలా ఉన్నారో తెలుసు. తప్పిదాలు సరిదిద్దుకోవడానికి చాలా సమయం ఉంది. కొన్నిసార్లు ఓడిపోవడమూ మంచిదే' అని ఐదో మ్యాచ్ తర్వాత హర్దిక్ పాండ్య అన్నాడు.
'ఆఖరి పది ఓవర్లలోనే మేం ఓడిపోయాం. క్రీజులోకి వచ్చినప్పటి నుంచీ పరిస్థితులను అనుకూలంగా మలచలేకపోయాను. సమయం తీసుకున్నా ముగించలేకపోయాను. ఒక బృందంగా మేం సవాళ్లను ఎదుర్కోవడం ముఖ్యం. ఇవన్నీ మేం నేర్చుకోవాల్సిన మ్యాచులు. మేమంతా కలిసి ఒక బృందంగా చర్చించుకొనే కఠిన దారిలో పయనిస్తాం. ఒక సిరీసు ఓడిపోయినంత మాత్రాన ఇబ్బందేం లేదు. మాకు అసలైన లక్ష్యమే ముఖ్యం' అని అని పాండ్య పేర్కొన్నాడు.
వెస్టిండీస్‌తో (IND vs WI) జరిగిన ఐదో టీ20లో టీమ్‌ఇండియా పరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది. ఆ తర్వాత వెస్టిండీస్ 18 ఓవర్లలోనే రెండు వికెట్లు చేజార్చుకొని టార్గెట్ ఛేజ్ చేసింది. 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది. కరీబియన్లలో బ్రాండన్ కింగ్ (85: 55 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు), నికోలస్ పూరన్ (47: 35 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) రాణించారు. భారత్‌లో సూర్యకుమార్ యాదవ్ (61: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్. తిలక్ వర్మ (27: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అతడికి సహకారం అందించాడు.