IND vs WI 1st T20I: అరుదైన రికార్డుకు చేరువలో హార్థిక్ పాండ్యా - తొలి టీ20లో సాధిస్తే చరిత్రే
పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా.. టీ20లలో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.
IND vs WI 1st T20I: వెస్టిండీస్ టూర్‌లో భారత జట్టు నేటి నుంచి టీ20 సిరీస్ ఆడనున్నది. టెస్టులు, వన్డేలు ముగియడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు జట్టుతో లేకుండానే హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని యువ భారత్.. విండీస్‌తో ఢీకొనబోతుంది. నేటి మ్యాచ్‌లో మరో రెండు వికెట్లు తీస్తే టీమిండియా సారథి హార్ధిక్ పాండ్యా అరుదైన రికార్డును సాధిస్తాడు.
ట్రినిడాడ్ వేదికగా జరుగబోయే నేటి తొలి టీ20లో పాండ్యా.. రెండు వికెట్లు తీస్తే టీ20లలో 150 వికెట్లు సాధిస్తాడు. 2016 నుంచి భారత జట్టుకు ఆడుతున్న ఈ స్టార్ ఆల్ రౌండర్.. ఇప్పటివరకు టీ20ల (అంతర్జాతీయ, ఐపీఎల్, దేశవాళీ కలిపి)లో 148 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ స్థాయిలో 71 వికెట్లు పడగొట్టిన పాండ్యా.. ఐపీఎల్‌లో 53 వికెట్లు తీశాడు. దేశవాళీలలో 23 వికెట్లు సాధించాడు. పరుగుల పరంగా హార్ధిక్.. ఇప్పటివరకూ 4,348 పరుగులు సాధించాడు. తొలి టీ20లో రెండు వికెట్లు తీయగలిగితే.. ఈ ఫార్మాట్‌లో 4 వేల పరుగులు చేసి 150 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కుతాడు.
కుల్దీప్ కూడా..
హార్ధిక్‌తో పాటు మరో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కూడా ఓ రికార్డు ఊరిస్తోంది. టీ20లలో ఇప్పటివరకూ 46 వికెట్లు తీసిన కుల్దీప్.. నేటి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయగలిగితే 50 వికెట్లు సాధించినవాడవుతాడు. అయితే నేటి మ్యాచ్‌లో అతడు భారత్ తరఫున తుది జట్టులో ఉంటాడా..? లేడా..? అన్నది కొద్దిసేపట్లో తేలనుంది. ఒకవేళ మ్యాచ్ ఆడి నాలుగు వికెట్లు సాధిస్తే అప్పుడు కుల్దీప్.. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా యాభై వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు. ఈ రికార్డు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉంది. చాహల్.. 34 మ్యాచ్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. కుల్దీప్ ఇప్పటిదాకా భారత్ తరఫున 28 మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించి 46 వికెట్లు తీశాడు. మరి నేటి మ్యాచ్‌లో హార్ధిక్, కుల్దీప్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి.
మ్యాచ్, లైవ్ వివరాలు:
- భారత్ - వెస్టిండీస్ మధ్య తొలి టీ20 ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో నేటి (గురువారం) రాత్రి 8 గంటలకు మొదలుకానుంది.
- ఈ మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్‌లో లైవ్ చూడొచ్చు. వెబ్ సైట్స్, మొబైల్స్ అయితే ఫ్యాన్ కోడ్ (సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి), జియో సినిమా (ఇది ఉచితమే)లలో వీక్షించొచ్చు.
జట్లు :
వెస్టిండీస్ : రోమన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, జాన్సన్ ఛార్లెస్, రోస్టన్ ఛేజ్, షిమ్రన్ హెట్‌మెయర్, జేసన్ హోల్డర్, షై హోప్, అకీల్ హోసెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్‌కాయ్, నికోలస్ పూరన్, రొమారియా షెపర్డ్, ఒడియన్ స్మిత్, ఒషేన్ థామస్
ఇండియా : ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్, ముకేష్ కుమార్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial