IND vs SL ODI: శ్రీలంకతో వన్డే సిరీస్ కు వేళాయే- కెప్టెన్ కు సవాల్ గా మారనున్న తుది జట్టు ఎంపిక
IND vs SL ODI: శ్రీలంకతో టీ20 సిరీస్ ను విజయంతో ముగించిన టీమిండియా... వన్డేలకు సిద్ధమైంది. జనవరి 10 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
IND vs SL ODI: శ్రీలంకతో టీమిండియా టీ20 సిరీస్ ముగిసింది. అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన యువ భారత్ 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఇక లంకతో వన్డే సిరీస్ కు సిద్ధమైంది భారత్. దీనికోసం సీనియర్లు తిరిగి జట్టులోకి రానున్నారు. పొట్టి ఫార్మాట్ కు దూరమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ లు శ్రీలంకతో వన్డేలకు జట్టులోకి వచ్చారు. అలాగే శ్రేయస్ అయ్యర్, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లు తమ సత్తా చాటడానికి రెడీగా ఉన్నారు. మంగళవారం (జనవరి 10) వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
తొలి వన్డే కోసం తుది జట్టును ఎంచుకోవడం కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో ప్లేయింగ్ ఎలెవన్ లో ఎవరిని తీసుకోవాలనే డైలమా ఉంది. ముఖ్యంగా 3 విషయాల్లో నిర్ణయం తీసుకోవడం రోహిత్ కు సవాలే
- సూర్యకుమార్ లేదా శ్రేయస్ అయ్యర్
- బౌలింగ్ కలయిక
- రోహిత్ తో ఓపెనింగ్ ఎవరు (ఇషాన్ కిషన్ లేదా శుభ్ మన్ గిల్)
రోహిత్ కు తోడుగా ఓపెనింగ్ ఎవరు?
రోహిత్ శర్మ తిరిగి రావటంతో అతనికి తోడుగా ఓపెనింగ్ ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ ఇద్దరు అందుబాటులో ఉన్నారు. 50 ఓవర్ల ఫార్మాట్ లో గిల్ నిలకడగా ఆడుతున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న గిల్ 15 వన్డేల్లో 55 కన్నా ఎక్కువ సగటు కలిగి ఉన్నాడు. ఇక ఇషాన్ బంగ్లాదేశ్ తో జరిగిన చివరి వన్డేలో మెరుపు ద్విశతకం సాధించి పోటీలోకి వచ్చాడు. అయితే నిలకడలేమి ఇషాన్ సమస్యగా మారింది. వీరిద్దరిలో గిల్ కే ఓపెనర్ గా కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నిర్ణయం ద్రవిడ్, రోహిత్ చేతుల్లో ఉంది.
సూర్యకుమార్ లేదా శ్రేయస్ అయ్యర్
ప్రస్తుతం టీమిండియాలో నెంబర్ 4 స్థానానికి పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో వైట్ బాల్ ఫార్మాట్లో అత్యుత్తమ ఆటగాళ్లు ఆ స్థానంలో పోటీకి ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ లు నాలుగో స్థానం కోసం అందుబాటులో ఉన్నారు. శ్రీలంకతో చివరి టీ20 లో అద్భుత శతకం సాధించిన సూర్యకుమార్ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. కాబట్టి వన్డేల్లో నూ నెం. 4 స్థానానికి పోటీగా ఉన్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో అత్యంత నిలకడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 2022లో ఈ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. వన్డే ఫార్మాట్ లో శ్రేయస్ విజయవంతమైన ఆటగాడు. 15 ఇన్నింగ్సుల్లో 724 పరుగులు చేశాడు. వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కెప్టెన్ కు సవాలే.
బౌలింగ్ కలయిక
మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వన్డే జట్టులోకి తిరిగొచ్చారు. అలాగే అర్హదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లు ఉన్నారు. కాబట్టి రోహిత్ కు చాలా బౌలింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ , అక్షర్ పటేల్ లు స్క్వాడ్ లో ఉన్నారు. టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైన అక్షర్... యుజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ లతో పోటీకి ఉన్నాడు. ఇక సీనియర్లు బుమ్రా, షమీ లతో కలిసి పేస్ బౌలింగ్ పంచుకునేందుకు అర్హదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్ లలో రోహిత్ ఎవరిని ఎంచుకుంటాడో చూడాలి.
శ్రీలంకతో వన్డేలకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్ , కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్హదీప్ సింగ్.
Starting the year right 🏆🇮🇳 pic.twitter.com/Kb46lOALhT
— Surya Kumar Yadav (@surya_14kumar) January 7, 2023