IND vs SL 2nd ODI: స్నానం చేసి.. భోజనం తిని.. సేదతీరి.. బ్యాటింగ్‌కు రావొచ్చన్న రాహుల్!
IND vs SL 2nd ODI: ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం వల్ల తన ఆటను మరింత బాగా అర్థం చేసుకున్నానని కేఎల్ రాహుల్ అన్నాడు. మ్యాచ్ పరిస్థితులకు తగినట్టు ఆడుతున్నానని పేర్కొన్నాడు.
IND vs SL 2nd ODI, KL Rahul:
ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం వల్ల తన ఆటను మరింత బాగా అర్థం చేసుకున్నానని కేఎల్ రాహుల్ అన్నాడు. మ్యాచ్ పరిస్థితులకు తగినట్టు ఆడుతున్నానని పేర్కొన్నాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు రావడం వల్ల సేదతీరే సమయం దొరుకుతోందని వెల్లడించాడు. జట్టు అవసరాలను బట్టి బ్యాటింగ్ స్థానాలు మార్చుకుంటున్నానని వివరించాడు. శ్రీలంకపై సిరీస్ గెలిచాక అతడు మీడియాతో మాట్లాడాడు.
శ్రీలంకతో రెండో వన్డేలో టీమ్‌ఇండియా విజయం సాధించింది. 216 పరుగుల లక్ష్య ఛేదనలో పదో ఓవర్‌కే 62/3తో కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
'ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం వల్ల ఓ ఉపయోగం ఉంది! త్వరగా బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం లేదు. చక్కగా స్నానం చేసి, భోజనం తిని, సేద తీరొచ్చు. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. మిడిలార్డర్లో రావడం వల్ల నా ఆటపై మరింత అవగాహన పెరిగింది. బంతి పాతదవ్వడంతో నేరుగా స్పిన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా నేనలా ఆడను. నేనెక్కడ బ్యాటింగ్ చేయాలో రోహిత్ శర్మ ముందే చెప్తాడు. అందుకే ఆ పొజిషన్‌ను సవాల్‌గా తీసుకొని ఆడతాను' అని రాహుల్ అన్నాడు.
'మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. లంకపై ఒత్తిడి పెంచారు. 200-220కే ఆలౌటైతే ఛేదించడం సులభంగా ఉంటుంది. ఓవర్‌కు 3-4 పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. లంకేయులు బంతితో చక్కగా పోరాడారు. త్వరగా వికెట్లు పడగొట్టి మాపై ఒత్తిడి పెంచారు. అయితే మిడిల్‌లో మా ఆటను ఆస్వాదించాను. శ్రేయస్, హార్దిక్, అక్షర్‌తో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాను. కొన్నేళ్లుగా బ్యాటింగ్ ఆర్డర్ మారుతుండటంతో నాపై ఒత్తిడేమీ లేదు. జట్టు కూర్పును బట్టి ముందు వెనక వస్తుంటాను. ఇలా పంపిస్తున్నారంటే నాపై విశ్వాసం ఉంచినట్టే కదా' అని రాహుల్ పేర్కొన్నాడు.
'మొదట తుది జట్టులో ఉండటమే నా లక్ష్యం. అందుకే జట్టు అవసరాల మేరకు ఆడతాను. తొలి టెస్టులో నేను ఆరో స్థానంలో రావడం గుర్తుంది. ఆ తర్వాత ఓపెనింగ్ చేశాను. 2019 ప్రపంచకప్‌లో ఆరో స్థానంలో వచ్చాను. శిఖర్ గాయపడటంతో మళ్లీ ఓపెనింగ్ చేశాను. ఐదో, నాలుగు స్థానాల్లో ఆడుతున్నాను. వికెట్ కీపింగూ చేస్తున్నాను. ఇదంతా నాకు సరదాగా అనిపిస్తోంది. కఠిన పరిస్థితుల్లో రాణించేందుకు సాయపడుతోంది' అని రాహుల్ వెల్లడించాడు.
View this post on Instagram