Ind vs SA odi 1st ODI: భారత్- దక్షిణాఫ్రికా తొలి వన్డేలో రాంచీ పిచ్ ఎవరికి అనుకూలం? టాస్ కీలకం
India vs south africa 1st ODI | భారత్-దక్షిణాఫ్రికా ODI సిరీస్ ఆదివారం ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ రాంచీ వేదికగా జరుగుతుంది. ఈ డే అండ్ నైట్ వన్డే మ్యాచులో టాస్ కీలకం కానుంది.

Ind vs SA odi 1st ODI: రాంచీ: టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-0 తేడాతో భారత జట్టును ఓడించింది. ఇప్పుడు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఆదివారం, నవంబర్ 30న వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మొదటి వన్డే మ్యాచ్ రాంచీలోని జెఎస్‌సిఎ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది.
ఈ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే వన్డే మ్యాచ్‌లో తలపడ్డాయి, ఆ మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. గెలుపు ఓటములు ఆటలో భాగమే. అయితే మొదటి వన్డే మ్యాచ్ సందర్భంగా రాంచీ వాతావరణం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.
ఆదివారం రాంచీలో వాతావరణం ఎలా ఉంటుంది?
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్ సందర్భంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండవచ్చు. ఆదివారం, నవంబర్ 30న రాంచీలో గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మ్యాచ్ సమయంలో ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయి. మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశం తక్కువ. గంటకు 9 కి.మీ వేగంతో చల్లటి గాలులు వీచే అవకాశం ఉంది. మ్యాచ్ డే-నైట్ కావడంతో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంటుంది. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ఎక్స్ ఫ్యాక్టర్ కావచ్చు. దీనివల్ల సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం కష్టమవుతుంది.
పిచ్ ఎలా ఉంటుంది?
రాంచీ మైదానంలో కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లు వికెట్లు తీస్తారు. అయితే పిచ్, బంతి పాతబడిన కొద్దీ స్పిన్నర్లకు హెల్ప్ అవుతుంది. అదే సమయంలో రాత్రి సమయంలో ఆట పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రాత్రి వేళ మంచు కురవకపోతే స్పిన్నర్లు బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయిస్తారు. అయితే మొదటి వన్డే మ్యాచ్ సందర్భంగా సాయంత్రం తరువాత మంచు కురిసే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఛేజింగ్ చేసే జట్టు బ్యాటర్లు షాట్లు ఆడటం సులభం అవుతుంది.
భారత పిచ్‌లపై ఇప్పటివరకూ భారత్, దక్షిణాఫ్రికా మధ్య 32 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమ్ ఇండియా 18 సార్లు నెగ్గగా, దక్షిణాఫ్రికా 14 సార్లు విజయం సాధించాయి.





















