(Source: ECI/ABP News/ABP Majha)
India vs Pakistan: వర్షం వల్ల పాకిస్తాన్ బతికిపోయింది కానీ! అక్తర్ కామెంట్స్ - బాబర్ తీరుపై ఆగ్రహం
భారత్ - పాక్ మధ్య కొలంబో వేదికగా నిన్న అర్థాంతరంగా ఆగిన సూపర్ - 4 మ్యాచ్‌లో వర్షం కారణంగా ఆట ఆగిపోవడం వల్ల పాకిస్తాన్ బతికిపోయిందని అక్తర్ అన్నాడు.
India vs Pakistan: ఆసియా కప్- 2023లో భాగంగా శనివారం భారత్ - పాకిస్తాన్ మధ్య కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా 24 ఓవర్ల ఆటే సాధ్యమైంది. అయితే వర్షం కురిసే సమయానికి భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. గ్రూప్ స్టేజ్‌లో భారత్‌ను కాపాడిన వరుణుడు సూపర్ - 4లో మాత్రం పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరించాడని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయభ్ అక్తర్ అన్నాడు. నిన్న వర్షం వల్ల మ్యాచ్ ఆగిన తర్వాత అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన ట్విటర్ వేదికగా అక్తర్ మాట్లాడుతూ.. ‘అందరికీ హాయ్.. నేను మీ అక్తర్. నేను ఇక్కడి (కొలంబో)కి భారత్ - పాక్ మ్యాచ్ చూడటానికి వచ్చాను. కానీ ఇవాళ వర్షం మమ్మల్ని బతికించింది. గ్రూప్ స్టేజ్‌లో వర్షం భారత్‌కు హెల్ప్ చేస్తే ఇప్పుడు ఆ అదృష్టం పాక్‌కు వరించింది..’ అని అన్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటంతో ఆగిపోయిన దగ్గర్నుంచే ఆట తిరిగి మొదలవుతుందని, రిజర్వ్ డే నాడు అయినా మ్యాచ్ పూర్తిగా జరగాలని అక్తర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Well. I don't see this starting again. Colombo ki baarish is crazy pic.twitter.com/KiY8Mbzl77
— Shoaib Akhtar (@shoaib100mph) September 10, 2023
బాబర్ నిర్ణయంపై గుర్రు..
కొలంబోలో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న బాబర్ ఆజమ్‌పై షోయభ్ అక్తర్ విమర్శలు గుప్పించాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించినా బాబర్ మాత్రం తొలుత బౌలింగ్ తీసుకోవడం తెలివైన నిర్ణయం కాదని చెప్పాడు. కాగా నిన్నటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. పల్లెకెలెలో పాక్ పేస్ త్రయం షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లు భారత టాపార్డర్‌ను వణికించినా నిన్న మాత్రం వాళ్ల ఆటలు సాగలేదు.
పాక్ తురుపు ముక్క షహీన్‌తో పాటు నసీమ్ షా ను ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉతికారేశారు. పాక్ పేసర్లపై రివర్స్ ఎటాక్‌కు దిగి వీరబాదుడు బాదడంతో పది ఓవర్లకే బాబర్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్‌ను బరిలోకి దించాల్సి వచ్చింది. షాదాబ్ ఖాన్‌ను రోహిత్ ఆటాడుకున్నాడు. ఈ ఇద్దరి దూకుడుతో 14 ఓవర్లలోనే సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లు ఆ తర్వాత మాత్రం తడబడ్డారు. అయితే రోహిత్, గిల్ నిష్క్రమించినా వారి స్థానాలలో వచ్చిన విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్‌లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటమే గాక ఓపెనర్ల దూకుడును కొనసాగించారు. ఆదివారం వర్షం కారణంగా ఆట ఆగిపోయే సమయానికి భారత జట్టు.. 24.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ (17 నాటౌట్), విరాట్ కోహ్లీ (7 నాటౌట్) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ (56), గిల్ (58) అర్థ సెంచరీలు సాధించారు.
Beautiful weather in Colombo. pic.twitter.com/GrofUuQeRF
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2023
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial