IND vs PAK, Asia Cup 2023: నేనొచ్చేశా! - ఇండియా, పాక్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి - నిలిచిన ఆట
అనుకున్నదే అయింది. చిరకాల ప్రత్యర్థుల పోరుకు షాకిస్తానని ముందే హెచ్చరించిన వరుణుడు అన్నంత పనిచేశాడు.
IND vs PAK, Asia Cup 2023: ప్రేక్షకులు ఇంకా సీట్లలో కుదురుకోకముందే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లో వరుణుడు ఆహ్వానం అందని చుట్టంలా ఏదో కొంపలు మునిగిపోయినట్టు వచ్చేశాడు. తెలంగాణలో రైతులు ‘నీ జాడ లేక నెలరోజులైతాంది. జర మమ్ముల చూడు’ అని ప్రాధేయపడుతున్నా పట్టించుకోని వరుణుడు లంకలో మాత్రం వద్దని వారించినా పిలవని అతిథిలా వచ్చేశాడు. కోట్లాది మంది అభిమానులు టీవీలు, మొబైల్స్ పట్టుకుని ఆసక్తికరంగా చూస్తున్న వేళ వారి ఆశలను అడియాసలు చేస్తూ.. ‘హాయ్.. నన్ను మరిచిపోయేరేమో.. గుర్తుంచుకోండి’ అంటూ ఆగమేఘాల మీద ఓ మేఘాన్ని కురిపించాడు.
ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. మ్యాచ్ ప్రారంభమయ్యే (3 గంటలకు) సమయానికి వర్షం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇదివరకే తెలిపింది. నేడు ఉదయం నుంచి అక్కడక్కడా చినుకులు కురుస్తున్నా భారీ వర్షం అయితే పడలేదు. టాస్ వేసే సమయంలో కూడా వాతావరణం బాగానే ఉంది. కానీ మ్యాచ్ ఆరంభమై నాలుగు ఓవర్లు పడ్డాయో లేదో వరుణుడు ఏదో ఎత్తిపోయినట్టు లంకలో వాలిపోయాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు.
More covers in the ground, rain has arrived again. pic.twitter.com/pmXLWkVpld
— Johns. (@CricCrazyJohns) September 2, 2023
వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి భారత్.. 4.2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. రోహిత్ శర్మ.. 18 బంతులాడి రెండు బౌండరీల సాయంతో 11 పరుగులతో నాటౌట్‌గా ఉండగా మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. 8 బంతులాడి ఇంకా ఖాతా తెరవలేదు. షాహీన్ అఫ్రిది, నసీమ్ షా లు పాక్ బౌలింగ్ దాడిని ప్రారంభించారు.
Rohit Sharma - An ODI Great. pic.twitter.com/7yk41oQoqA
— Johns. (@CricCrazyJohns) September 2, 2023
కొద్దిసేపు కురిసిన వర్షం ప్రస్తుతానికి తగ్గింది. అయితే పిచ్ మీద కవర్లు ఇంకా తొలగించలేదు. నేటి సాయంత్రం వరకూ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయని హెచ్చరికలున్న నేపథ్యంలో వరుణుడు ఈ మ్యాచ్‌ను సజావుగా సాగనిస్తాడా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
వన్డేలలో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు టీమ్‌గా ఉన్న పాకిస్తాన్.. నాలుగేండ్ల తర్వాత భారత్‌తో వన్డే ఆడుతున్నది. చివరిసారిగా ఈ రెండు జట్లూ 2019 వన్డే వరల్డ్ కప్ (భారత్‌దే విజయం) లో తలపడ్డాయి. వన్డేలలో పాకిస్తాన్ చివరిసారి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గెలిచింది. ఆసియా కప్‌లో కూడా వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై పాక్ గెలిచి తొమ్మిదేండ్లు దాటింది. ఆసియా కప్ (వన్డేలు) లో భారత్.. పాకిస్తాన్‌పై చివరిసారి 2014లో గెలిచింది. 2018లో ఇరు జట్లూ రెండు సార్లూ తలపడగా రెండింటిలోనూ భారత్‌నే విజయం వరించింది.
ఇరు జట్లూ వన్డే వరల్డ్ కప్‌కు సన్నాహకంగా ఆసియా కప్‌కు బరిలోకి దిగుతున్న విషయం విదితమే. భారత బ్యాటింగ్ వర్సెస్ పాకిస్తాన్ బౌలింగ్‌గా నేటి మ్యాచ్ జరుగనుంది. బలాబలాపరంగా చూస్తే ఇరు జట్లలోనూ సమర్థవంతమైన ఆటగాళ్లకు కొదవలేదు. ఆటగాళ్లతో పాటు మ్యాచ్ చూసే కోట్లాది అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పొందాలని చూస్తుండగా వరుణుడు శాంతించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial