IND Vs PAK Asia Cup 2022: పాక్‌పై పాండ్యా పంజా - ఐదు వికెట్లతో భారత్ ఘనవిజయం - ఇంకో వారంలో మళ్లీ పాక్‌తో మ్యాచ్?
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది.
చిరకాల ప్రత్యర్థిపై టీమిండియా పంజా విసిరింది. ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 147 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం టీమిండియా 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసియా కప్‌లో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌తో తలపడనుంది. ఆగస్టు 31వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 4వ తేదీన జరిగే సూపర్-4 మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ మళ్లీ తలపడనున్నాయి.
గెలిపించిన జడేజా, పాండ్యా
148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (0: 1 బంతి) తాను ఎదుర్కొన్న మొదటి బంతికే అవుటయ్యాడు. అయితే విరాట్ కోహ్లీ (35: 34 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (12: 18 బంతుల్లో, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. రెండో వికెట్‌కు 7.4 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ రోహిత్ శర్మను అవుట్ చేసి మహ్మద్ నవాజ్ పాకిస్తాన్‌కు కీలక వికెట్ అందించాడు. అనంతరం విరాట్ కోహ్లీ కూడా నవాజ్ బౌలింగ్‌లోనే రోహిత్ తరహాలోనే అవుటయ్యాడు. దీంతో భారత్ 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
అనంతరం సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా మరో వికెట్ పడకుండా కాసేపు ఆడారు. నాలుగో వికెట్‌కు 36 పరుగులు జోడించిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ (18: 18 బంతుల్లో, ఒక ఫోర్) అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 89 పరుగులకు చేరుకుంది. మరో వైపు సాధించిన రన్‌రేట్ కూడా 10 పరుగులకు చేరుకోవడంతో ఒత్తిడి బాగా పెరిగింది. ఈ దశలో రవీంద్ర జడేజా (35: 29 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33: 17 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) స్కోరును ముందుకు నడిపించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. అయితే చివరి ఓవర్లో ఏడు పరుగులు చేయాల్సిన దశలో రవీంద్ర జడేజా అవుట్ కావడంతో తిరిగి ఉత్కంఠ నెలకొంది. అయితే పాండ్యా ఎటువంటి పొరపాటు లేకుండా మ్యాచ్‌ను ముగించాడు.
అదరగొట్టిన టీమిండియా బౌలర్లు
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన బాబర్ అజాం (10: 9 బంతుల్లో, రెండు ఫోర్లు), మహ్మద్ రిజ్వాన్ (43: 42 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) దూకుడుగా ఆడలేకపోయారు. తొలి ఓవర్ నుంచే భువనేశ్వర్ కట్టదిట్టంగా బంతులేశాడు. మూడో ఓవర్లోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను భువీ ఔట్ చేయడంతో 19 పరుగుల వద్ద పాకిస్థాన్ తొలి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఫకార్ జమాన్‌తో (10: 6 బంతుల్లో, రెండు ఫోర్లు) కలిసి మహ్మద్ రిజ్వాన్ స్కోరు బోర్డును కదిలించాడు.
అవేష్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో ఫకాన్ జమాన్ అవుటయ్యాడు. అనంతరం మహ్మద్ రిజ్వాన్ కు జతకలిసిన ఇఫ్తికార్ అహ్మద్ (28: 22 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకున్న రిజ్వాన్ కూడా బ్యాట్ ఝుళిపించటంతో స్కోరు వేగంగా కదిలింది. అయితే ఈ దశలో హార్దిక్ షార్ట్ పిచ్ బంతితో ఇఫ్తికార్ ను ఔట్ చేశాడు. అప్పటికి స్కోరు 90 పరుగులు మాత్రమే.
అనంతరం హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లోనే కుదురుగా ఆడుతున్న మహ్మద్ రిజ్వాన్ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత పాక్ బ్యాటింగ్ లైనప్ పేకమేడను తలపించింది. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. అర్ష్‌దీప్, భువనేశ్వర్ టెయిలెండర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. అయితే చివర్లో హరీస్ రౌఫ్, దహాని బ్యాట్ ఝళిపించటంతో పాక్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో భువీ నాలుగు, పాండ్యా మూడు, అర్ష్‌దీప్ రెండు, అవేష్ ఖాన్ ఒక వికెట్ సాధించారు.