IND vs NZ 2nd T20: సమమా! సమర్పణమా! నేడు భారత్- న్యూజిలాండ్ రెండో టీ20
IND vs NZ 2nd T20: నేడు లఖ్ నవూ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 జరగనుంది. మొదటి మ్యాచ్ ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలనుకుంటోంది.
IND vs NZ 2nd T20: ప్రస్తుతం టీమిండియా జట్టుపై టీ20 సిరీస్ ఓటమి కత్తి వేలాడుతోంది. హార్దిక్ పాండ్య పగ్గాలు చేపట్టాక ఒక్క పొట్టి సిరీస్ కోల్పోని భారత్ ఇప్పుడు సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి రెట్టించిన ఉత్సాహంతో తొలి టీ20లో బరిలోకి దిగిన టీమిండియాకు ఆ జట్టు షాకిచ్చింది. మొదటి మ్యాచ్ లో అన్ని విభాగాల్లో విఫలమైన భారత్ ను.. సమష్టి ప్రదర్శన చేసిన కివీస్ ఓడించింది. నేడు ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. దీంట్లోనూ ఓడిపోతే టీమిండియా సిరీస్ కోల్పోతుంది. కాబట్టి సిరీస్ ను సమం చేయాలంటే పాండ్య అండ్ కో తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే.
టాపార్డర్ మెరవాల్సిందే
తొలి టీ20 వైఫల్యంలో భారత్ టాపార్డర్ ది ప్రధాన పాత్ర అని చెప్పుకోవాలి. 176 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా మొదటి ముగ్గురి బ్యాటర్ల వాటా 11 పరుగులు మాత్రమే అంటే వారి వైఫల్యం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వన్డేల్లో చెలరేగిన శుభ్ మన్ గిల్ టీ20ల్లో మాత్రం ఆశించినంతగా రాణించడంలేదు. ఇక శ్రీలంకతో చివరి వన్డేలో డబుల్ సెంచరీ మినహా ఇషాన్ కిషన్ ప్రదర్శన అత్యంత సాధారణం. కివీస్ తో వన్డేల్లోనూ అతను ఆకట్టుకోలేదు. రాహుల్ త్రిపాఠి ఆడింది 2 మ్యాచులే కాబట్టి అతనిపై అప్పుడే ఒక అంచనాకు రాలేం. అయితే సిరీస్ ఓటమి ముప్పు తప్పించుకోవాలంటే వీరు ముగ్గురూ రాణించాల్సిందే. ఇక వన్డేల్లో విఫలమైన సూర్యకుమార్ తనకు నప్పిన టీ20ల్లో ఫాంలోకి వచ్చేశాడు. అక్షర్ పటేల్ గైర్హాజరీలో వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండ్ మెరుపులు మెరిపించాడు. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రదర్శన కూడా భారత్ ను ఆందోళనపరుస్తోంది. వ్యక్తిగతంగా, నాయకత్వ పరంగా పాండ్య అంతగా మెప్పించడంలేదు.
బౌలింగ్ బెంగ తీరేనా!
బౌలింగ్ విషయానికొస్తే..... మొదట ప్రత్యర్థిని కట్టడిచేసి ఆ తర్వాత పట్టువిడిచే పాత అలవాటును భారత్ ఇంకా వదిలిపెట్టినట్లు అనిపించడంలేదు. తొలి మ్యాచ్ లో కివీస్ ఓపెనర్లు దూకుడుగా ఆడినప్పటికీ.. మధ్య ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడిచేశారు. అయితే మళ్లీ చివరికొచ్చేసరికి పట్టువదిలారు. దీంతో కివీస్ పోరాడే స్కోరును సాధించింది. ఇక భారత యువ బౌలర్ అర్హదీప్ సింగ్ లయ ఆందోళన కలిగిస్తోంది. అతను వికెట్లు పడగొట్టకపోగా ధారాళంగా పరుగులిస్తున్నాడు. ఇక ఉమ్రాన్ మాలిక్ ఒక్క ఓవర్ వేసి 16 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో పాండ్య ఇక అతనికి బంతినివ్వలేదు. స్పిన్నర్ల ప్రదర్శన మాత్రం బాగుంది. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే తొలి మ్యాచ్ లో గెలిచి ఉత్సాహంతో ఉన్న కివీస్ ను నిలువరించాలంటే బౌలింగ్ దళం సమష్టిగా సత్తా చాటాలి.
రెట్టించిన ఉత్సాహంతో న్యూజిలాండ్
వన్డేల్లో వైట్ వాష్ కు గురైన న్యూజిలాండ్.. తొలి టీ20లో సమష్టిగా పోరాడి గెలిచింది. తొలి టీ20లో ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్ లు బ్యాట్ తో రాణించారు. వారికి మిగిలిన వారు తోడైతే భారత్ ముందు భారీ లక్ష్యం ఉంటుంది. ఇక ఆ జట్టు బౌలర్లందరూ సమష్టిగా రాణించారు. ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడి జట్టుకు విజయాన్నిందించారు. వన్డేల్లో క్లీన్ స్వీప్ అయిన కివీస్ జట్టు టీ20 సిరీస్ అయినా గెలవాలనే లక్ష్యంతో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ లో ఆ జట్టు మరింత పట్టుదలగా ఆడుతుందనడంలో సందేహంలేదు.
పిచ్ ఎలా ఉందంటే
రెండో టీ20కి ఆతిథ్యమిస్తున్న లఖ్ నవూ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ చివరిసారిగా 11 నెలల క్రితం టీ20 మ్యాచ్ జరిగింది. అప్పుడు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 199 పరుగులు చేసింది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కు మొగ్గు చూపే అవకాశముంది.
భారత్ తుది జట్టు (అంచనా)
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ , మైఖేల్ బ్రేస్‌వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.
The #Kiwis drew first blood in the 1st T20I, but 🇮🇳 is set to turn the tables leading us to a tie-breaker. 🤯
— Star Sports (@StarSportsIndia) January 28, 2023
Will the #MenInBlue turn up their prowess to 💯?
Tune-in to the 2nd Mastercard #INDvNZ T20I, Jan 29, 6:00 PM, on Star Sports & Disney+Hotstar.#BelieveInBlue #Madhubala pic.twitter.com/NoggbNjnCP