Ruturaj Gaikwad on Rinku Singh: ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో..! రింకూకు బాగా తెలుసు!
Ruturaj Gaikwad on Rinku Singh: నయా ఫినిషర్ రింకూ సింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడు బ్యాటింగ్ చేస్తుంటే స్టాండ్స్‌లోని అభిమానులు 'రింకూ.. రింకూ.. రింకూ' అంటూ నినాదాలు చేస్తున్నారు.
Ruturaj Gaikwad on Rinku Singh:
టీమ్‌ఇండియా నయా ఫినిషర్ రింకూ సింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడు బ్యాటింగ్ చేస్తుంటే స్టాండ్స్‌లోని అభిమానులు 'రింకూ.. రింకూ.. రింకూ' అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో అతడికి బాగా తెలుసని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అంటున్నాడు. ఫినిషర్‌గా ఎదగాలని భావించేవాళ్లు అతడి నుంచి నేర్చుకోవాలని సలహా ఇస్తున్నాడు. రెండో టీ20లో ఐర్లాండ్‌పై గెలిచాక గైక్వాడ్ మాట్లాడాడు.
'ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత రింకూ సింగ్ అందరికీ ఫేవరెట్‌గా మారాడు. ఈ సీజన్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడెంతో పరిణతి ప్రదర్శించాడు. అతడు మొదటి బంతి నుంచే అటాక్ చేయడు. తనకు కావాల్సినంత సమయం తీసుకుంటాడు. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుంటాడు. అందుకు తగ్గట్టే చెలరేగుతాడు' అని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.
రింకూ సింగ్ నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయని రుతురాజ్ ప్రశంసించాడు. యంగ్‌స్టర్స్ అతడిని చూసి నేర్చుకోవాలని సూచించాడు. 'ఫినిషర్‌గా ఎదగాలని కోరుకుంటున్న కుర్రాళ్లు రింకూ సింగ్‌ను చూసి నేర్చుకోవాలి. పరిస్థితులను బట్టి ఆటగాడు తగినంత సమయం తీసుకోవాలి. ఆ తర్వాత దూకుడుగా ఆడి నష్టాన్ని పూడ్చాలి. ట్రిగ్గర్ ఎప్పుడు నొక్కాలో రింకూకు బాగా తెలుసు. అతడు సరైన సమయంలో అటాక్ చేస్తాడు. రెండో టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది అతడికెంతో సాయం చేస్తుందని అనుకుంటున్నా' అని గైక్వాడ్ వెల్లడించాడు.
ఐర్లాండ్‌తో రెండో టీ20లో రింకూ సింగ్ చెలరేగాడు. మిడిలార్డర్లో వచ్చి 21 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. రెండు బౌండరీలు, మూడు సిక్సర్లు బాదేశాడు. 180 స్ట్రైక్‌రేట్‌తో అటాక్ చేశాడు. శివమ్ దూబె (22 నాటౌట్)తో కలిసి 28 బంతుల్లోనే 55 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఓపెనర్ రుతురాజ్ (58) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సంజూ శాంసన్ (40) రాణించాడు.
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘనవిజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు సాధించింది. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 33 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను కూడా 2-0తో సొంతం చేసుకుంది.
టీమిండియా బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ (58: 43 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ సెంచరీ సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ (40: 26 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), రింకూ సింగ్ (38: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) రాణించారు. ఐర్లాండ్ బ్యాటర్లలో ఆండ్రూ బాల్‌బిర్నీ (72: 51 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు.