Rohit Sharma: బంగ్లా టైగర్స్‌పై గెలుపు సులువేం కాదు - ఆఖరి వరకు భయపెడతారన్న రోహిత్
IND vs BAN ODI Series: వన్డే ప్రపంచకప్ గురించి ఇప్పుడే ఆలోచించడం తొందరపాటే అవుతుందని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బంగ్లా టైగర్స్ ను ఓడించడమే తమ లక్ష్యమని చెప్పాడు.
Rohit Sharma Press Conference: వన్డే ప్రపంచకప్ గురించి ఇప్పుడే ఆలోచించడం తొందరపాటే అవుతుందని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. భవిష్యత్తులో జరిగే పెద్ద టోర్నీని దృష్టిలో పెట్టుకొనే ప్రతి సిరీస్ ఆడతామని పేర్కొన్నాడు. ప్లానింగ్ సైతం దానిని బట్టే ఉంటుందన్నాడు. బంగ్లాదేశ్ పై సిరీస్ గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు. తొలి వన్డేకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు. ప్రత్యర్థి కెప్టెన్ లిటన్ దాస్‌తో కలిసి ట్రోఫీని ఆవిష్కరించాడు.
View this post on Instagram
ప్రపంచకప్‌నకు సంబంధించి తనకు, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఫెయిర్ ఐడియా ఉందని రోహిత్ అన్నాడు. ఇప్పటికైతే బంగ్లాదేశ్‌పై ట్రోఫీ గెలవడమే తమకు ముఖ్యమని పేర్కొన్నాడు. 'నిజమే, మేం ఆడే ప్రతి సిరీస్ భవిష్యత్తులో మెగా టోర్నీకి సన్నాహకంగానే ఉంటుంది. వన్డే ప్రపంచకప్‌కు ఇంకా 8-9 నెలలు ఉంది. ఇప్పటికైతే అంత దూరం ఆలోచించడం లేదు. ఒక జట్టుగా మాపై మేం దృష్టి సారిస్తాం. ఇలాంటి కాంబినేషన్, అలాంటి కాంబినేషన్ అని ఇప్పుడే నిర్ణయించుకోం' అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.
టీమ్‌ఇండియా చివరిసారిగా 2015లో బంగ్లాదేశ్‌లో పర్యటించింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ పేస్ బౌలింగ్‌కు ఇబ్బంది పడి సిరీస్‌ను చేజార్చుకుంది. 'మా రెండు జట్ల మధ్య ఆసక్తికరమైన శత్రుత్వం ఉంది. ఏడెనిమిదేళ్లుగా బంగ్లాదేశ్ ఎంత భిన్నంగా ఆడుతుందో తెలిసిందే. వారు సవాల్‌గా మారారు. వాళ్లపై మాకు సులభ విజయాలేం లేవు. బంగ్లాపై గెలవాలంటే మేం అద్భుతమైన క్రికెట్ ఆడాలి. వారితో తలపడ్డ ప్రతిసారీ ఆఖరి వరకు పోరాడాల్సి వస్తోంది. టీ20 ప్రపంచకప్‌లోనూ ఇలాగే జరిగింది. 2015లో మేం సిరీస్ ఓడిపోయాం. ఆ తర్వాత వారు మరింత మెరుగయ్యారు. వారిపై గెలవాలంటే మేం అత్యుత్తమ క్రికెట్ ఆడాల్సిందే' అని రోహిత్ అన్నాడు.
బంగ్లా అభిమానులు తమ జట్టుకు ఎంతో అండగా ఉంటారని హిట్‌మ్యాన్ వెల్లడించాడు. తమ జట్టు గెలుపుకోసం ఎంతగా ప్రోత్సహిస్తారో తెలిసేందేనన్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ఆడేటప్పుడూ తమకు ఇలాంటి అనుభవాలే ఎదురవుతుంటాయన్నాడు. ఆ ప్రభావం తమపై ఉండదని, ప్రత్యర్థులపై విజయాలు సాధిస్తూనే ఉంటామని వెల్లడించాడు.
View this post on Instagram