WTC: ఫలితం తేలకముందే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఇండియా- కివీస్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే!
WTC Finals: ఈ ఏడాది జూన్‌లో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌కు భారత్ అర్హత సాధించింది. అహ్మదాబాద్ టెస్టు రిజల్ట్‌తో సంబంధం లేకుండానే ఫైనల్స్‌కు వెళ్లింది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా.. ప్రస్తుతం అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు ఫలితం తేలదని తేలిపోయినా టీమిండియాకు మాత్రం గుడ్‌న్యూస్ దక్కింది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్.. జూన్‌లో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ - శ్రీలంకల మధ్య క్రిస్ట్‌చర్చ్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో లంకేయులు ఓడిపోవడంతో భారత్ ఫైనల్ బెర్త్ ఖాయమైంది. 2021లో కూడా భారత్.. డబ్ట్యూటీసీ ఫైనల్స్ ఆడిన విషయం తెలిసిందే. కానీ అప్పుడు ఇదే కివీస్ చేతిలో భారత్ ఓడింది. ఇప్పుడు మాత్రం కివీస్ విజయంతో భారత్ తుది పోరుకు అర్హత సాధించింది.
న్యూజిలాండ్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే..
అహ్మదాబాద్ టెస్టుకు ముందు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడుతుందా..? లేదా..? అన్నది అనుమానంగానే ఉండింది. ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత ఆ అనుమానం మరింత రెట్టింపైన విషయం తెలిసిందే. ఈ టెస్టు ఫలితంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్స్ బెర్త్ ముడిపడి ఉండటంతో అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఒకవేళ మనం ఓడినా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక గెలవకూడదు. ప్రతీ టీమిండియా అభిమాని కోరిక ఇదే. వాళ్ల అభీష్టానికి అనుగుణంగానే కివీస్.. శ్రీలంకను ఓడించింది. ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన టెస్టులో కివీస్.. లంకను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. ఫలితంగా భారత్... తుది పోరుకు అర్హత సాధించినట్టైంది.
కివీస్‌కు ఉత్కంఠ విజయం..
క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 355 పరుగులు చేయగా కివీస్ 373 రన్స్ చేసింది. అనంతరం లంక రెండో ఇన్నింగ్స్ లో 302 పరుగులకే ఆలౌట్ అయింది. 285 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్.. మ్యాచ్ ఆఖరి సెషన్ చివరి బంతి వరకూ విజయం కోసం పోరాడింది. చివరి ఓవర్లో కివీస్ విజయానికి 8 పరుగులు అవసరం కాగా.. తొలి రెండు బంతుల్లో రెండు పరుగులొచ్చాయి. మూడో బంతికి హెన్రీ రనౌట్ అయ్యాడు. నాలుగో బంతికి కేన్ మామ (విలియమ్సన్) బౌండరీ బాదాడు. ఐదో బంతికి సింగిల్. చివరి బంతికి బైస్ రూపంలో ఓ పరుగు తీసిన కివీస్.. థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ ఓటమితో లంక.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.
Kane Williamson finishes it for New Zealand - they're 1-0 in the series.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 13, 2023
A Test match to remember! pic.twitter.com/CDl7QtDkKe
ఆదుకున్న కేన్ మామ..
కివీస్ రెండో ఇన్నింగ్స్ లో కేన్ విలియమ్సన్ ఇన్నింగ్సే హైలైట్. ఓపెనర్లు టామ్ లాథమ్ (25) తో పాటు డెవాన్ కాన్వే (5) విఫలమైనా విలియమ్సన్ మాత్రం.. 194 బంతులాడి 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 121 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడికి తోడుగా తొలి ఇన్నింగ్స్‌ల్ సెంచరీ హీరో డారిల్ మిచెల్ (81) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత అతడు ఔటైనా లోయరార్డర్ సాయంతో విలియమ్సన్ పని పూర్తి చేశాడు.