IND vs AUS 4th Test Day 2: ఖవాజా, గ్రీన్ ఔటవ్వకపోతే టీమ్‌ఇండియాకు చుక్కలే - లంచ్‌కు ఆసీస్ 347/4
IND vs AUS 4th Test Day 2: అహ్మదాబాద్ టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది! తొలి ఇన్నింగ్సులో రెండోరోజు, శుక్రవారం భోజన విరామానికి 4 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.
IND vs AUS 4th Test Day 2:
అహ్మదాబాద్ టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది! తొలి ఇన్నింగ్సులో భారీ స్కోరు వైపు పయనిస్తోంది. రెండోరోజు, శుక్రవారం భోజన విరామానికి 4 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (150; 354 బంతుల్లో 20x4) డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. మరో ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (95; 135 బంతుల్లో 15x4) కొరకరాని కొయ్యగా మారాడు. శతకానికి ఐదు పరుగుల దూరంలో నిలిచాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 290 బంతుల్లోనే 177 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీని విడదీయడం టీమ్‌ఇండియా బౌలర్లకు సవాల్‌గా మారింది.
దంచికొడుతున్న ఖవాజా, గ్రీన్
ఓపిక పడితే ఇండియన్ పిచ్‌లపై భారీ స్కోర్లు చేయొచ్చని ఉస్మాన్ ఖవాజా (ఓవర్‌నైట్ స్కోరు 104) నిరూపించాడు. అతడికి కామెరాన్ గ్రీన్ (49) సరైన భాగస్వామిగా నిలిచాడు. వీరిద్దరూ వికెట్ పడకుండా నిలకడగా పరుగులు చేస్తున్నారు. దాంతో ఓవర్‌నైట్ స్కోరు 255/4తో రెండో రోజు ఆట మొదలెట్టిన ఆస్ట్రేలియా ఇప్పుడు టీమ్‌ఇండియాకు చుక్కలు చూపిస్తోంది. క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే గ్రీన్ ఒక పరుగు పూర్తి చేసి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూనే చూడచక్కని షాట్లు బాదేశారు. దాంతో డ్రింక్స్ బ్రేక్‌కు ఆసీస్ 296/4తో నిలిచింది. ఆ తర్వాత ఖావాజా మరింత దూకుడుగా ఆడాడు. అతడు 346 బంతుల్లో 150 మైలురాయిని చేరుకోవడంతో ఆసీస్ 347/4తో లంచ్‌కు వెళ్లింది.
తొలిరోజు ఏం జరిగింది?
కీలకమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ఆడింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. 61 పరుగుల వద్ద భారత్‌కు తొలివికెట్ ట్రావిస్ హెడ్ రూపంలో దొరికింది. కేవలం 44 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ ఏడు బౌండరీలు సాధించాడు. ఇతను 32 పరుగుల స్కోరు వద్ద అవుటయ్యాడు.
ట్రావిస్ హెడ్‌ను రవిచంద్రన్ అశ్విన్ బోల్తా కొట్టించాడు. 16వ ఓవర్ తొలి బంతికే జడేజా క్యాచ్ పట్టి హెడ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. తర్వాత మార్నస్ లబుషేన్‌ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 72 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తన రెండో వికెట్ కోల్పోయింది. మార్నస్ లబుషేన్ (3: 20 బంతుల్లో) వచ్చిన కాసేపటికే వెనుదిరిగాడు.
రెండో సెషన్‌లో భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ అస్సలు వికెట్ ఇవ్వలేదు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. పరుగులు రాకపోయినా ముందు క్రీజులో నిలబడితే చాలు అనే యాటిట్యూడ్ వారిలో కనిపించింది.
ముఖ్యంగా స్పిన్ త్రయం అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను మరింత జాగ్రత్తగా ఆడారు. వీరు ముగ్గురూ మాత్రమే ఇప్పటి వరకు 40 ఓవర్లు బౌల్ చేశారు. ఇందులో కేవలం 82 పరుగులు మాత్రమే వచ్చాయి. అక్షర్ పటేల్ ఎకానమీ అయితే ఏకంగా 1.3 మాత్రమే ఉంది. దీన్ని బట్టి స్పిన్నర్లకు అస్సలు వికెట్ తీసే అవకాశం కూడా ఇవ్వకూడదనే వ్యూహంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగినట్లు అర్థం అవుతోంది.
టీ బ్రేక్ ముగిసిపోగానే భారత్‌కు మంచి బ్రేక్ దొరికింది. విరామం అనంతరం రెండో ఓవర్లోనే క్రీజులో కుదురుకున్న స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేసిన రవీంద్ర జడేజా భారత్‌కు మూడో వికెట్‌ను అందించారు. ఈ మ్యాచ్‌లో తనకు ఇది మొదటి వికెట్. ఈ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ ఇంతవరకు 50 పరుగుల మార్కును దాటలేదు. తన కెరీర్‌లో వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో అర్థ సెంచరీ చేయకపోవడం స్మిత్‌కు ఇదే మొదటి సారి. ఆ తర్వాత వచ్చిన పీటర్ హ్యాండ్స్‌కాంబ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. పేస్ బౌలర్ షమీ తనను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు నాలుగో వికెట్ అందించాడు.
హ్యాండ్స్‌కాంబ్ స్థానంలో క్రీజులోకి వచ్చిన కామెరాన్ గ్రీన్ వేగంగా ఆడాడు. భారత బౌలర్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా బౌండరీలతో చెలరేగిపోయాడు. మరోవైపు ఉస్మాన్ ఖవాజా కూడా కొంచెం వేగం పెంచాడు. దీంతో చివరి సెషన్‌లో ఆస్ట్రేలియా 3.78 రన్‌రేట్‌తో పరుగులు చేసింది.
దీంతో 80 ఓవర్లు దాటాక రోహిత్ కొత్త బంతి తీసుకున్నాడు. కొత్త బంతి తీసుకున్నాక ఆస్ట్రేలియా మరింత వేగంగా పరుగులు చేసింది. చివరి 10 ఓవర్లలో ఏకంగా 56 పరుగులు సాధించింది. పేస్, స్పిన్ ఇలా అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సరిగ్గా ఆట ఆఖరి ఓవర్లో బౌండరీతో ఉస్మాన్ ఖవాజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 255 పరుగులు చేసింది.
ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్ ఇప్పటికే ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. రెండో రోజు వీరి భాగస్వామ్యాన్ని వీలైనంత వేగంగా బ్రేక్ చేస్తేనే భారత్‌కు ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు మెరుగుపడతాయి. లేకపోతే ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.
A tough morning session for #TeamIndia
— BCCI (@BCCI) March 10, 2023
Australia go into Lunch on Day 2 with 347/4 on the board.
Scorecard - https://t.co/8DPghkwsO6 #INDvAUS @mastercardindia pic.twitter.com/5ElwXobTf0