ICC World Cup 2023: వాళ్లకు కదా ‘గోల్డెన్ టికెట్లు’ ఇవ్వాల్సింది! బీసీసీఐకి సన్నీ కీలక సూచన - అలా చేస్తే బెటర్ అంటున్న గవాస్కర్
బీసీసీఐ సెక్రటరీ జై షా.. వరల్డ్ కప్‌కు ప్రాచుర్యం కల్పించడానికని వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులకు ‘గోల్డెన్ టికెట్’ అందిస్తున్నాడు.

ICC World Cup 2023: వచ్చే నెల నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో కలిసి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నాహకాలను పూర్తి చేసే పనిలో ఉంది. ఈ క్రమంలోనే బీసీసీఐ సెక్రటరీ జై షా.. వరల్డ్ కప్‌కు ప్రాచుర్యం కల్పించడానికని వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులకు ‘గోల్డెన్ టికెట్’ అందిస్తున్నాడు. ఇదివరకే జై షా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌లకు ఈ టికెట్లను అందించాడు. గోల్డెన్ టికెట్ పొందిన సెలబ్రిటీలు ప్రపంచకప్ జరిగినన్ని రోజులూ ఏ మ్యాచ్ అయినా ఉచితంగానే వీక్షించొచ్చు.
అయితే తాజాగా ఇదే విషయాన్ని ఊటంకిస్తూ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ బీసీసీఐపై ప్రశంసలు కురిపించాడు. ఇది గొప్ప ఆలోచన అని.. కానీ టికెట్లను భారత క్రీడారంగంలో ప్రముఖులుగా ఉన్నవారికి కూడా ఇచ్చి వారిని గౌరవించాలని సూచించాడు. భారత్‌కు వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీలకు గోల్డెన్ టికెట్లు ఇవ్వాలని వెల్లడించాడు.
గవాస్కర్ స్పందిస్తూ.. ‘బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం (గోల్డెన్ టికెట్) చాలా గొప్పది. వివిధ రంగాలలో ప్రముఖులుగా ఉన్న వారికి వీటిని అందించడం ద్వారా వారిని గౌరవించడం గొప్ప ఆలోచన. ఇప్పటివరకైతే అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్‌లకు గోల్డెన్ టికెట్స్ ఇచ్చారు. అలాగే టీమిండియాకు వన్డే ప్రపంచకప్‌లను అందించిన కపిల్ దేవ్, ధోనీలకూ వీటిని అందించాలి. అంతేగాక ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్‌కూ అందజేయాలి. వాళ్లు దానికి పూర్తిగా అర్హులు...
ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. కానీ ఇస్రో చీఫ్‌కు గోల్డెన్ టికెట్ అందజేయడం ఆయనకు గౌరవం వంటిది. ఆయన ఆధ్వర్యంలో భారత కీర్తి పతాక చందమామ దగ్గరికీ చేరింది. ఇక నీరజ్ చోప్రా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ గానే గాక ఇటీవలే వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ అయ్యాడు..’అని అన్నాడు.
A golden moment indeed!
— Jay Shah (@JayShah) September 5, 2023
It was an absolute honour to present the golden ticket to the "Superstar of the Millennium," Shri @SrBachchan on behalf of @BCCI.
We are all excited to have you with us at @ICC @CricketWorldCup 2023. 🏏🎉 #CricketWorldCup #BCCI https://t.co/FG6fpuq19j
టెన్నిస్‌లో ఇదివరకే..
బీసీసీఐ తలపెట్టిన ఈ గోల్డెన్ టికెట్ ఆలోచన గతంలో మనం టెన్నిస్‌లో ప్రముఖ టోర్నీలు అయిన వింబూల్డన్, యూఎస్ ఓపెన్‌లలో చూశామని సన్నీ చెప్పుకొచ్చాడు. వింబూల్డన్, యూఎస్ ఓపెన్‌లలో ఆయా రంగాలలో ప్రముఖులను మ్యాచ్‌లు చూసేందుకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. బీసీసీఐ కూడా భారత్‌లో దిగ్గజ క్రీడాకారులను ఇలా ఆహ్వానిస్తే బోర్డు ప్రతిష్ట కూడా పెరుగుతుందని అన్నాడు. ఇటీవలే యూఎస్ ఓపెన్‌లో మెన్స్ డబుల్స్‌లో ఫైనల్ చేరిన రోహన్ బోపన్నతో పాటు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ వంటి వారికి కూడా గోల్డెన్ టికెట్స్ అందజేయాలని సన్నీ సూచించాడు.
కాగా 1987, 1996, 2011 తర్వాత స్వదేశంలో నాలుగోసారి వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న భారత్.. ఈ ఏడాది సొంతదేశంలో మరోసారి 2011 మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నది. భారత్ చివరిసారి 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. పదేండ్లుగా అందకుండా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని దక్కించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

